
ఆర్థికాంశాలపై అవగాహనకు జిరోధా ’రూపీ టేల్స్’
పిల్లల్లోనూ ఆర్థికాంశాలపై అవగాహన కల్పించే దిశగా డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జిరోధా రూపీ టేల్స్ పేరిట పుస్తకాల సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల్లోనూ ఆర్థికాంశాలపై అవగాహన కల్పించే దిశగా డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జిరోధా రూపీ టేల్స్ పేరిట పుస్తకాల సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఈక్విటీ రీసెర్చ్ విభాగం) కార్తీక్ రంగప్ప మంగళవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. పొదుపు, బీమా, బ్యాంకింగ్.. ద్రవ్యోల్బణం, స్టాక్‌మార్కెట్లు, పన్నులు అంశాలపై ఈ సెట్‌లో మొత్తం అయిదు పుస్తకాలు ఉంటాయని పుస్తక రచయిత కూడా అయిన కార్తీక్ తెలిపారు.
ఏడేళ్ల పైబడిన పిల్లలకు కూడా సులభంగా అర్థమయ్యే విధంగా కథలు, సంభాషణల రూపంలో వీటిని తీర్చిదిద్దినట్లు వివరించారు. మరోవైపు, 2015–16లో క్లయింట్ల సంఖ్య 93 శాతం మేర వృద్ధి చెందిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల మంది యూజర్లు ఉన్నారని కార్తీక్ పేర్కొన్నారు. కీలకమార్కెట్లలో ఒకటైన హైదరాబాద్‌లో వృద్ధి 113 శాతం మేర నమోదు కాగా.. 12,000 మంది పైగా యూజర్లు ఉన్నారని ఆయన వివరించారు.