
ఖమ్మం బుక్ ఫెయిర్‌లో పుస్తకాలను పరిశీలిస్తున్న కలెక్టర్ కర్ణన్
సందర్భం
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అనేక రంగాల్లో వినూత్నమైన మార్పులు, ప్రతిరంగాన్ని తీర్చిదిద్దుకునే పునర్నిర్మాణపనులు శరవేగంతో జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ బుక్‌ఫెయిర్ పరిస్థితి ఎలా ఉంటుంది అని వాదన చేసిన వారుకూడా లేకపోలేదు. కానీ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ పుస్తకప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. హైదరాబాద్‌లోని ‘తెలంగాణ కళాభారతి’ (ఎన్టీఆర్ స్టేడియం) స్థలాన్ని డిసెంబర్ 18 నుంచి 29 వరకు మాకు ఉచితంగా, ఇచ్చింది. గత 30 ఏళ్ల పుస్తకప్రదర్శనలకు ఏ ప్రభుత్వము కూడా ఉచితంగా ఇవ్వలేదు. పుస్తకాలు చదివే ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు అన్నిరకాల సహాయసహకారాలు అందించటం వల్ల గత ఐదేళ్లుగా దేశంలోనే అతిపెద్ద బుక్‌ఫెయిర్‌గా నిలిచింది.
రాష్ట్రప్రభుత్వం చేసిన మరోసహాయం జిల్లా కేంద్రాలలో మేం నిర్వహించే బుక్‌ఫెయిర్స్‌కు కూడా సహకారం అందించటం మరో విశేషం. హైదరాబాద్ లాంటి మహానగ రాలకే పరిమితమైన పుస్తకప్రదర్శనలను గ్రామీణ ప్రాంతాలదాకా మట్టి కాళ్లపాదాల దాకా తీసుకుపోవాలన్న మా సంకల్పాన్ని కేసీఆర్ సహకారంతో నెరవేరింది. దీంతో ఏ జిల్లాకు వెళ్లినా మాకు సహకారం లభిస్తుంది. జూన్ 2 నుంచి జూన్ 9 వరకు ఖమ్మంలో తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ కోరారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కల్గించింది. ఒక రకంగా ఆయనే మా వెంటపడి మరీ బుక్‌ఫెయిర్ పెట్టించారు. ఎండలు మండిపోతున్నాయి. రోకళ్లు పగిలే రోహిణీకార్తెలో జనం రావటం కష్టమౌతుందన్నా కలెక్టర్ కర్ణన్ పట్టుబట్టి మరీ ఖమ్మంలో పుస్తక ప్రదర్శన పెట్టించారు.
ఊహించని విధంగా పుస్తక ప్రియులనుంచి కదలిక వచ్చింది. తెలంగాణ అవతరణోత్సవాల సందర్భంగా ఈ పుస్తక ప్రదర్శన జరపాలన్న కర్ణన్ ప్రతిపాదనను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సమర్థించటమే కాదు, ఇక ప్రతిఏడాది ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. పుస్తక ప్రదర్శనకు ప్రతిరోజూ సాయంత్రం ఓ రెండు గంటలు కర్ణన్ స్వయంగా వచ్చి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది జిల్లా పాలనాయంత్రాంగానికి, ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించిన మంచి ప్రేరణనిచ్చింది. అనేకమంది కలెక్టర్లు పుస్తకప్రదర్శనకు మాకు సహ కరించారు. కానీ కర్ణన్‌లాగా ఇలా పూర్తిగా సహకరిస్తూ తానే నిర్వాహకునిగా మారటం మాత్రం ఆశ్చ్యర్యానందాలను కలిగించింది. ఇదే కాకుండా ఖమ్మం పట్టణంలోని జనం కూడళ్లదగ్గరకు, అపార్ట్ట్‌మెంట్ల వరకు ఈ పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలంటున్నారు.
మారుమూల గ్రామాలదాకా పుస్తకాలను తీసుకుపోయి జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి మా వంతుగా చేయబోయే ఈ చిన్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కర్ణన్ ఎంతోసహాయం చేస్తున్నారు. తనేకాకుండా తన తండ్రిని, తనకుటుంబ సభ్యులను, తన పిల్లలను తీసుకుని రోజూ బుక్‌ఫెయిర్‌కొచ్చి ప్రేరణ కల్గిస్తున్నారు. పుస్తకాలమీద తనకు ప్రేముండటమేకాదు, ఆ ప్రేమ అందరి మనసుల్లోకి పోవాలన్నది ఆయన తపన. కర్ణన్ పుస్తకప్రేమికుడుగా మారటానికి ఆయన తండ్రి లైబ్రేరియన్ కావటం కూడా ఒక కారణం. కర్ణన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఖమ్మం జిల్లా వ్యాపితంగా పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయబోతున్నాం. ఖమ్మంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కర్ణన్‌పుస్తక ప్రదర్శనగా మారింది. పుస్తకాలు వర్ధిల్లాలన్న పుస్తక ప్రేమికుల కోరిక ఇలా నెరవేరుతుంది. భవిష్యత్తులో పుస్తక ప్రదర్శనలను సంచార గ్రంధాలయాలుగా మార్చాలి. ఊరూరుకు పుస్తక సంతలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో ప్రతిఊరుకు పుస్తక సంతలను నెలకొల్పేందుకు కృషిచేస్తాం. సమాజమార్పుకు, సంఘ ప్రగతికి పుస్తకాలు కూడా పనిముట్లుగా ఉపయోగపడతాయన్న అనేకమంది విజ్ఞుల ఆలోచనకు పుస్తక ప్రదర్శనలు దర్పణాలుగా నిలుస్తాయి.
జూలూరీ గౌరీ శంకర్
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
మొబైల్ : 94401 69896