ఐసొలేషన్ కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థి శివమణి
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): కరోనా సోకగానే సహజంగా భయపడిపోతాం. ఏమవుతుందో ఎప్పటికి కోలుకుంటామోనని కలత చెందుతాం. కానీ ఆ బాలుడుకి ఆ భయం ఏమాత్రం లేదు. ఎంచక్కా పాఠ్య పుస్తకాలు చదివేస్తూ.. ఐసొలేషన్‌లో ఉన్న సమయాన్ని అలా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎంతో ఏకాగ్రతతో ఓ తరగతి గదిలో కూర్చుని చదువుతున్నట్టుగా ఆ పిల్లవాడు పైతరగతి పుస్తకాలు చదవడాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమల్లెల పంచాయతీ నాయునిఓడ్డు దళితవాడకు చెందిన మహేష్ కుమారుడు శివమణి(13) కరోనాతో రొంపిచెర్ల ఐసొలేషన్ కేంద్రంలో చేరాడు.
పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పూర్తిచేసిన శివమణి.. ఈ ఏడాది 8వ తరగతిలో చేరాల్సి ఉంది. అయితే విద్యార్థి ఇప్పటి నుంచే చదువుపై దృష్టి మళ్లించాడు. ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు పాఠ్య పుస్తకాలు వెంట తీసుకెళ్లాడు. అంతేకాదు నిద్రలేచింది మొదలు.. పుస్తకాలు తీసి చదువుకోవడాన్ని చూసి అక్కడున్న వైద్య సిబ్బంది సైతం ముచ్చటపడుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేంద్ర తదితరులు విద్యార్ధిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment