సుష్మాస్వరాజ్ పొరపాటు చేశారు!
న్యూఢిల్లీః ప్రసిద్ధ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అద్భుత రచనలు చేసిన మహాశ్వేతాదేవి సామాజిక న్యాయంకోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఇతర మంత్రుల మధ్య ఎంతో పేరుగాంచిన ఆమె... రచయిత మహా శ్వేతాదేవి మరణంపై సంతాపం ప్రకటించడంలో మాత్రం తప్పిదం చేశారు. ఎప్పుడూ ఎంతో ఆచితూచి మాట్లాడే సుష్మా... శ్వేతాదేవి రచనలను కోట్ చేయడంలో మాత్రం అనుకోని పొరపాటు చేశారు.
విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అనుకోని తప్పిదం చేశారు. ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల సంతాపం తెలపడంలో భాగంగా ఆమె రచించని రెండు పుస్తకాలను కోడ్ చేసి, తప్పులో కాలేశారు. ఆశాపూర్ణా దేవి రాసిన 'ప్రథమ్ ప్రతిశ్రుతి', 'బకుల్ కథ' పుస్తకాలను.. మహాశ్వేతాదేవి రాసినట్లుగా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి రచరనలు తనపై శాశ్వత ముద్రను వేశాయంటూ సుష్మాస్వరాజ్... శ్వేతా రచించని రెండు పుస్తకాల పేర్లను తన ట్విట్టర్ సందేశంలో రాశారు. అయితే విషయాన్ని ట్విట్టర్ వినియోగదారులు కొందరు చూసి.. తెలిపే వరకూ కూడా ఆమె గమనించలేదు. అనంతరం తప్పును తెలుసుకొన్న సుష్మా.. వెంటనే పుస్తకాల పేర్లను పేర్కొన్న రెండో ట్వీట్ ను డిలీట్ చేశారు.
అయితే సుష్మా తన పొరపాటు మెసేజ్ ను వెంటనే డిలీట్ చేసినా.. ప్రజలు మాత్రం ఆమెను వదల్లేదు. ఆమె డిలీట్ చేసిన మెసేజ్ ఫొటోలను పోస్ట్ చేసి, ఇది ఆమె పట్టని తనానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. అజ్ఞానానికి నిదర్శనమని అభివర్ణించారు. సామాజసేవకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాశ్వేతాదేవి మరణం విషయం తెలిసిన వెంటనే గొప్ప రచయితను కోల్పోయామంటూ ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా.. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం తెలిపిన విషయం విదితమే.