మనుషుల మీద లేబుల్స్ వేయడంలో మనకు ఒక సౌలభ్యం ఉంటుంది. దానివల్ల వారిని అంచనా కట్టడానికి ఒక పరిధి ఏర్పడుతుంది. కానీ భూమ్మీద ప్రవాహంలా బతికేవాళ్లు కొందరుంటారు. ఆ ప్రవాహంలో అన్నింటినీ తమలో ఇముడ్చుకుని పోతారు. సాగిపోవడమే వారి లక్షణం. ఆగిపోవడం వారికి తెలియని గుణం. వారు ఏమిటి? అని ప్రశ్న వేసుకున్నప్పుడు, వారు ఏమిటి కాదు? అనే మరో ప్రశ్న ఎదురొస్తుంది. ఆ రెండు ప్రశ్నల మధ్యే వారి జీవితం గురించిన ఒక జవాబు దొరుకుతుంది. 150 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ లోని నార్మండీలో జన్మించిన (1873 జనవరి 28) ‘కొలెట్’ ఒక సజీవ ప్రవాహం. చాలా కారణాల వల్ల ఫ్రెంచ్ సమాజపు సాహిత్య సాంస్కృతిక జీవితాన్నీ, తద్వారా ప్రపంచాన్నీ ఆమె ప్రభావితం చేశారు. ‘చెరి’, ‘జిజి’, ‘ద వేగబాండ్’, ‘ద ప్యూర్ అండ్ ది ఇంప్యూర్’ లాంటి రచనలు చేసిన కొలెట్ జీవితం ఆమె రచనలంతే ఆకర్షణీయం.
తన పేరును కేవలం ఏకపదంగా రాసుకున్న ‘కొలెట్’ పూర్తి పేరు సిడోనీ–గాబ్రియెల్ కొలెట్. ఆమె జీవితంలోని వివాహపు అధ్యాయం పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికి పరిమితులను చెబుతుంది. కేవలం కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి పద్నాలుగేళ్ల పెద్దయినవాడితో వివాహానికి ఒప్పుకొంది. భర్త హెన్రీ గౌథియర్ విల్లర్స్ కలంపేరు ‘విల్లీ’. సమాజంలో ప్రతిష్ఠ ఉన్నవాడు. అతడి ప్రఖ్యాతి ఎంతటిదంటే ‘ఘోస్టు రైటర్స్’తో పుస్తకాలను రాయిస్తుండేవాడు. ‘‘నీ ప్రాథమిక పాఠశాల జ్ఞాపకాలను కాగితం మీద పెట్టు,’’ అని నూతన వధువుకు కూడా చెప్పాడు.
మనోరంజకమైనవి ఉంటే వదిలిపెట్టొద్దనీ, వాటిని తాను ఏదోలా వాడుకుంటాననీ కూడా అన్నాడు. కొలెట్ సహజంగానే రైటర్ మెటీరియల్. ఆమె రాతలను విల్లీ ముందు కొంచెం అనుమానించినా, వాటిని 1900లో ‘క్లాడైన్ ఎట్ స్కూల్’ నవలికగా తెచ్చాడు. ఒక పాఠశాల బాలిక కౌమార దశను వాస్తవికంగా చిత్రించిన ఈ రచనకు వెంటనే పేరొచ్చింది. సాహిత్యంలో కౌమార బాలిక గొంతుక వినిపించింది. ఆత్మ కథాత్మక సాహిత్యానికి పథనిర్ణేత అయ్యింది.
వీటి మూల రచయిత్రి కొలెటే అని సాహిత్య లోకం అనంతర కాలపు ఆమె రచనల శైలిని బట్టి నిర్ధారించుకుంది కానీ అప్పటికి అధికారిక రచయిత విల్లీనే. అమ్మకాలు పెరగడంతో భార్య మీద ఒత్తిడి పెట్టాడు. ఒక దశలో గదిలో బంధించి, తర్వాతి ఇన్ స్టాల్‌మెంట్ ఇచ్చేంతవరకూ విడిచిపెట్టలేదు. ఈ వేధింపులు సహిస్తూనే, కొనసాగింపు నవలికలు ‘క్లాడైన్ ఇన్ పారిస్’, ‘క్లాడైన్ మేరీడ్’ రాసింది కొలెట్. క్లాడైన్ పాత్ర ఎంత హిట్టయ్యిందంటే, ఆ థీమ్‌తో సిగరెట్లు, లింజెరీ, పెర్‌ఫ్యూమ్ కూడా విల్లీ ప్రారంభించాడు.
విల్లీ ఆమెను సాహిత్యంలోకి ప్రవేశపెట్టినా, మేలుకొన్నాక, ఆయన్ని జీవితంలోంచి బయటికి నెట్టేసింది కొలెట్. కానీ రాయల్టీల డబ్బులు లేకపోవడంతో స్టేజీ నటిగా పనిచేసింది. 1907లో తనే రాసిన ‘ద ఫ్లెష్’ సంగీత రూపకంలో స్టేజీ మీద ఎడమ చన్నును ప్రదర్శించడం పెద్ద కల్లోలం సృష్టించింది. ఇక, ‘మౌలిన్ రూజ్’లో తన స్నేహితురాలు ‘మిస్సీ’ని బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం దుమారం లేపింది.
ఈ మొదటి ప్రదర్శన తర్వాత పోలీసులు దాన్ని సాగనివ్వలేదు. బహిరంగంగా వాళ్లు తమ లెస్బియన్ బంధం గురించి ప్రకటించడం కూడా అప్పటి సమాజానికి విఘాతంలా తగిలింది. దీనివల్ల ఎవరికీ కంటబడని స్థలాల్లో కొంతకాలం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, స్వలింగ శృంగార సాహచర్య ప్రదర్శనల తాలూకు ధిక్కార బీజాలు ఇలా మొదలయ్యాయని అనుకోవచ్చు.
కొలెట్ అంటే ఒక స్కాండల్. పరస్పర వైరుద్ధ్యంగా కనబడే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో కనబడతాయి. ప్రపంచమంతా యూదుల పట్ల పట్టింపుతో ఉన్నప్పుడు, నాజీలతో జట్టుకట్టి, యూదు వ్యతిరేక భావనలు ఉన్న రచనలు చేశారు. తాను ఎంత స్వేచ్ఛగా బతికినప్పటికీ, ఓటు హక్కు కోరే స్త్రీలను కొరడాతో బాదాలన్నారు. జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధరంగం నుంచి వార్తలు పంపారు. ఒక సాహిత్య పత్రికకు సంపాదకురాలిగా పనిచేసినప్పుడు, ఎంతోమంది యువ రచయితలను ప్రోత్సహించారు.
సుమారు యాభై పుస్తకాలను వెలువరించిన కొలెట్, పది గంటల పాటు ఏకధాటిగా కూడా రాసేది. ‘‘కొలెట్ స్త్రీవాది అవునో కాదో నిర్ణయించాల్సింది ఆమె కాదు’’ అని ఆమెను స్త్రీవాదిగానే సాహిత్య లోకం తర్వాత గుర్తించింది. సాధారణ మనుషులు కోరుకునే నైతిక చట్రంలోకి ఇమడని కొలెట్ ఒక బైసెక్సువల్. కుమారుడి లాంటి బాలుడితో ప్రణయం కొనసాగించారు. ‘మాంసం’ అనేది ఆమెకు చాలా ఇష్టమైన మాట. వాంఛకు అది సంకేతం. ‘‘ప్రేమ, నా కలానికి బ్రెడ్ అండ్ బటర్’’ అన్నారు.
అందం పట్ల ఆమెకు మితిమీరిన పట్టింపు. వృద్ధాప్య ఛాయలు పొడసూపగానే ‘ఫేస్–లిఫ్ట్’ చేయించుకున్నారు. తన శరీరంలో ఏర్పడిన ముడతలను ద్వేషించారు. పాశ్చాత్య దేశాల్లోనూ విడాకులు తీసుకున్నవాళ్లకు మన్నన లేని కాలంలో, రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె మరణించినప్పుడు ధార్మిక క్రతువులు నిరాకరించబడ్డాయి.
‘‘చనిపోయిన తర్వాత కూడా కొలెట్ ఎంత సుదీర్ఘకాలం బతికింది!’’ అన్నారు 1967లో జర్నలిస్ట్ జానెట్ ఫ్లానర్. ఆ మాట అన్న యాభై ఏళ్ల తర్వాత కూడా కొలెట్ బతికేవుంది. ఆమె జీవితం ఇప్పటికీ ఆసక్తిగొలుపుతూనే ఉంది. ఆమె మీద పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచో చెడో కొలెట్ రూపంలో ఒక ఉత్సాహం ఈ భూమ్మీద కొన్నాళ్లు తిరగాడిందని మనం అనుకోవచ్చు. అయినా చెడు అని ఎందుకనాలి!
ఒక ప్రవాహం
Published Mon, Jan 8 2024 4:27 AM | Last Updated on Mon, Jan 8 2024 4:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment