
బుక్ స్టేల్
పుస్తకం.. మనలను మనం తెలుసుకోవడానికే కాదు... ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే మాధ్యమం. అలాంటి ఎన్నో పుస్తకాలకు కేంద్రం ఎఎ హుస్సేన్ అండ్ కో.
పుస్తకం.. మనలను మనం తెలుసుకోవడానికే కాదు... ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే మాధ్యమం. అలాంటి ఎన్నో పుస్తకాలకు కేంద్రం ఎఎ హుస్సేన్ అండ్ కో. నిత్యం సందడిగా ఉండే అబిడ్స్‌లో... సంతోష్ సప్నా సినిమా హాల్ పక్కన ప్రశాంతంగా కొలువుదీరి ఉంటుందా బుక్‌మార్క్. హైదరాబాద్ చరిత్రను తనతో మోస్తున్న ఈ విజ్ఞానఖని.. మరికొన్ని రోజుల్లో కనుమరుగవ్వనుంది.
కార ణాలేమైనా... గతం కాబోతోన్న ఈ వర్తమానం మహాప్రస్థానం...
..:: కట్ట కవిత
నిజాం కాలంలో సర్జన్ అయిన సర్ అబ్దుల్ హుస్సేన్ అరస్తుయార్‌జంగ్ బహదూర్ మనవడు... ఎం.రియాజత్ హుస్సేన్ అరస్తుకు స్టాంప్స్, కాయిన్స్ అండ్ కరెన్సీ సేకరణ హాబీ. మంచి రీడర్ కూడా. ఆయన 1949లో ఈ బుక్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఆయన కొడుకు షౌకత్ హుస్సేన్... ఆ బాధ్యతలను తీసుకున్నారు. మొదట ఇంపోర్టెడ్ బుక్స్ కోసమే ఏర్పాటైనా.. ఆ తరువాత పిల్లల బుక్స్‌తో పాపులరైంది. ఆయన కస్టమర్స్‌ను మెస్మరైజ్ చేసేవారు. పుస్తకాలతో పాటు ఆయన మాటతీరు కస్టమర్స్‌ను మళ్లీ మళ్లీ షాప్‌కి రప్పించేది. 1966లో షౌకత్ హుస్సేన్ అనారోగ్యం పాలవ్వడంతో బుక్‌షాప్ మేనేజ్‌మెంట్ తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన కొడుకు ఆసిఫ్ హుస్సేన్ అరస్తు.
దొరకని పుస్తకం లేదు..
గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఫస్ట్ పోర్షన్ బుక్స్... సెకండ్ పోర్షన్ గ్రీటింగ్ కార్డ్స్... ఫస్ట్‌ఫ్లోర్ మొత్తం పిల్లల పుస్తకాలే. భారతీయ ప్రముఖ రచయితల రచనలు... రెలిజియస్, సెల్ఫ్ డెవలప్‌మెంట్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్, ఆటోబయోగ్రఫీస్ లిటరేచర్‌లో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఫిలింస్, స్పోర్ట్ రిలేటెడ్ రిఫరెన్స్ మెటీరియల్... ఇలా దొరకని ఇంగ్లిష్ పుస్తకమంటూ ఉండదక్కడ. ఇక్కడికి వచ్చి పుస్తకం దొరకక నిరాశతో వెళ్లిపోయిన కస్టమర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక్క పుస్తకాలే కాదు... ఒకప్పుడు గ్రీటింగ్‌కార్డ్స్, పోస్ట్‌కార్డ్స్ కూడా ఇక్కడ దొరికేవి.
30 ఏళ్ల అనుబంధం...
ఒక్క కస్టమర్స్‌కే కాదు... ఇందులో పనిచేసే సిబ్బందికీ షాప్‌తో ఉన్న అనుబంధం విడదీయరానిది. సిటీ కాలేజ్‌లో ఎస్‌ఎస్‌సి పూర్తి చేసిన జావీద్ అన్సారీ 30 ఏళ్ల కిందట ఈ బుక్‌స్టోర్‌లో చేరాడు. ఆయన జీవితమంతా ఇక్కడే గడిచిపోయింది. మెహిదీపట్నంలో ఉండే అన్సారీకి నలుగురు బిడ్డలు. ఆయన అంతగా చదువుకోకపోయినా... పిల్లలందరినీ మంచి చదువులు చదివించాడు. అన్సారీ మూడో కూతురు డాక్టర్ కూడా. ‘ఇక్కడ పనిచేయడం వల్లే చదువు, నాలెడ్జ్ ప్రాధాన్యత తెలిసొచ్చిందేమో. అందుకే నా పిల్లలను కూడా చదివించగలిగాననుకుంటా’ అంటాడు ఆయన. ఇంతమంచి పుస్తకాల షాప్ మళ్లీ హైదరాబాద్‌లో ఏర్పడడం అసంభవమనే చెబుతాడు. పిల్లలుగా ఇక్కడ పుస్తకాలు కొని చదివిన వారు తమ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడే ‘నేను చిన్నప్పుడు పుస్తకాలు కొన్నాను’ అని తమ బాల్యం గురించి చెబుతుంటారు. ఇలాంటి ఎన్ని అనుభూతులో ఈ షాప్‌తో ముడిపడి ఉన్నాయి!
కరువైన ఆసక్తి...
ఇంతటి చరిత్ర ఉన్న ఈ బుక్‌షాప్.. మొబైల్ ఫోన్స్ విప్లవం, ఇంటర్నెట్ మాయాజాలంతో తన మార్క్‌ను కోల్పోయింది. ‘ఆన్‌లైన్ సేల్స్‌తో కస్టమర్స్ తగ్గారు. నెట్‌లో ఆర్డర్ చేస్తే పుస్తకం నట్టింటికే వచ్చి చేరుతోంది. ఇంతకుముందులా బుక్స్ కొనడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. గతంలో పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తే.. పుస్తకం కొనడానికి దాచిపెట్టేవాళ్లు పిల్లలు.
కొత్త పుస్తకం వచ్చిందంటే హాట్‌కేక్‌లా అమ్ముడుపోయేది. ఫీల్డ్, చదివే డిగ్రీతో సంబంధం లేకుండా మంచి పుస్తకాలు కొనేవారు. ఇక పరిశోధనలు చేయాలనుకున్నవాళ్లు... పుస్తకాలవైపే చూసేవారు. మరి ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు... వక్ఫ్ భూములకు చెందిన ఈ బిల్డింగ్ పెచ్చులూడుతోంది. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చి షాపింగ్‌మాల్ కట్టే ఆలోచనలో ఉన్నారు’ అని ఆవేదనగా చెప్పారు ఆసిఫ్.
లెజెండరీ స్టోర్..
నిజాం వారసులతోపాటు.. హైకోర్టు జడ్జెస్, సురేష్ ఒబెరాయ్, రేఖలాంటి సెలబ్రిటీస్ ఈ బుక్‌షాప్‌కు తరచూ వచ్చేవాళ్లు. ఇక ఎంఎఫ్ హుస్సేన్ అయితే ఇక్కడికొచ్చిన ప్రతిసారీ.. ఓ మంచి పుస్తకం తీసుకోవడంతోపాటు షౌకత్ హుస్సేన్‌తో కూర్చుని చాయ్ తాగకుండా వెళ్లకపోయేవారు. సన్నీడేస్ పుస్తకం రిలీజైన టైమ్‌లో సునీల్ గవాస్కర్ కూడా ఈ బుక్‌మార్క్‌లో అడుగుపెట్టారు. అంతేనా బాలీవుడ్ లెజెండరీ దిలీప్‌కుమార్‌కీ నచ్చిన బుక్‌షాప్ ఇది. ఇంతటి ప్రాముఖ్యమున్న బుక్‌షాప్‌ను క్లోజ్ చేసిన తరువాత... ఏం చేయాలన్న భయం తనను వెంటాడుతోంది అంటున్నారు ఆసిఫ్. ఈ పుస్తకాల సముద్రాన్ని ఎలా పారబోయడం అని ఆందోళన
చెందుతున్నారు!
చెరిగిపోతున్న జ్ఞాపకం...
నేను హైదరాబాద్‌కు రాకముందు... వరంగల్‌లో ఉన్నప్పుడే ఎఎ హుస్సేన్ బుక్‌స్టోర్ గురించి విన్నాను. డాక్టర్ రామనాథంగారు మంచి చదువరి. 85లో ఆయన ఎన్‌కౌంటర్ అవడానికి ముందువరకు ఆయన ఏ పుస్తక మైనా ఎఎ హుస్సేన్ నుంచి తెప్పించుకున్నా అని చెప్పేవారు. అట్లా ఒక్క హైదరాబాద్‌కే కాదు... తెలంగాణ అంతటికీ సుపరిచితమైన బుక్‌స్టాల్. ఆ రోజుల్లో ఇతర బుక్‌షాప్స్‌లో ఇంగ్లిష్ పుస్తకాలు దొరికేవి కావు.
ప్రగతి శీల భావాలున్నవాళ్లకు, మొత్తంగా సాహితీకారుల ఇంగ్లీష్ సాహిత్య అవసరాలకు కేంద్రం అది. 80-90ల్లో ప్రధానమైన బుక్‌షాప్ అంటే ఎఎ హుస్సేన్ మాత్రమే. నేను 82లో ఎం.ఎ కోసం హైదరాబాద్‌కి వచ్చాక మొదట వెళ్లిన షాప్స్‌లో అది ఒకటి. కొత్త ఇంగ్లిష్ పుస్తకాల కోసం అక్కడికే వెళ్లేవాడిని. అట్లాంటి షాప్ మూతపడటమంటే ఒక జ్ఞాపకం చెరిగిపోవడం.
- ఎన్. వేణుగోపాల్, ఎడిటర్, ‘వీక్షణం’
ఏదో బాధ...
మెథడిస్ట్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే నాకు ఈ బుక్‌షాప్‌తో పరిచయం. ఉన్నత విద్య, ఉద్యోగ రీత్యా.. దాదాపు 45 ఏళ్లు దేశానికి దూరంగా ఉన్నా. మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాక.. అబిడ్స్‌లో మళ్లీ గుర్తించగలిగింది అంటే ఈ బుక్‌షాప్‌నే. ఎన్నో వచ్చాయి... ఎన్నో పోయాయి.. మిగిలింది ఒక్కటే ఎఎ హుస్సేన్ బుక్‌షాప్. బాల్యంలో ఎన్నో స్మృతులకు నిలయమైన ఈ స్టోర్ మూతపడుతోందంటే ఎంతో బాధ కలుగుతోంది. అందుకే ఏదో ఒకటి కొందామని వచ్చా.
- డాక్టర్ డి.ఎస్.రావ్, చిక్కడపల్లి