గ్రూప్‌–1.. నో స్టాక్‌ | Telangana: Books Shortage At Telugu Academy | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1.. నో స్టాక్‌

Published Sun, May 1 2022 2:33 AM | Last Updated on Sun, May 1 2022 11:15 AM

Telangana: Books Shortage At Telugu Academy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మెజార్టీ అభ్యర్థులు సాధన చేసే పుస్తకాలు తెలుగు అకాడమీవే. తాజాగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో ఈ పుస్తకాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. తెలుగు అకాడమీ కౌంటర్‌ వద్ద అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అయితే తెలుగు అకాడమీ బుక్‌ కౌంటర్‌లో పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో పుస్తకాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది.  

డిమాండ్‌ ఎక్కువ..లభ్యత తక్కువ 
సబ్జెక్టు ఏదైనా తెలుగు అకాడమీ పుస్తకాలకున్న ప్రాధాన్యతే వేరు. అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, విషయ నిపుణుల విశ్లేషణలతో కూడిన ఆ పుస్తకాలు పోటీ పరీక్షల్లో విజయానికి బాటలు వేస్తాయనే భావన అభ్యర్థుల్లో ఎప్పట్నుంచో ఉంది. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇటీవల గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల కావడం.. మొదటి నోటిఫికేషన్‌లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

మంచి జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ కొలువులు చేస్తున్న వారు సైతం దీర్ఘకాలిక సెలవులు పెట్టి గ్రూప్‌–1 నియామకాల కోసం సిద్ధమవుతుండటంతో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు సంబంధిత సిలబస్‌ ఉండే పుస్తకాలు సేకరించే పనిలో పడ్డారు. ఇతర పబ్లికేషన్స్‌ మాటెలా ఉన్నా తెలుగు అకాడమీ పుస్తకాల లభ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 

కొత్తవి రావు.. తెలుగులో లేవు 
ఇంటర్వ్యూలను తొలగించడంతో గ్రూప్‌–1 పరీక్ష 900 మార్కులకు పరిమితమైంది. ఇందులో ప్రిలి మినరీ పరీక్షలో జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ ఉంటుంది. ర్యాంకింగ్‌లో ఈ మార్కులకు ప్రాధాన్యత లేనప్పటికీ మెయిన్‌ పరీక్షలకు అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు తప్పనిసరి. ఇక జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష మార్కులు కూడా ర్యాం కింగ్‌ పరిధిలోకి రావు. ఈ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తెలుగు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి.

కీలకమైన మెయిన్‌ పరీక్షల  సబ్జెక్టు పుస్తకాలు, కరెంట్‌ అఫైర్స్‌ పుస్తకాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్‌ పరీక్షల్లో మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 24 అంశాలతో కూడిన సిలబస్‌ ఉంది. అయితే కరెంట్‌ అఫైర్స్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ పుస్తకాలు అందుబాటులో లేవు.  చరిత్ర, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఇంగ్లిష్‌ వెర్షన్‌లో మాత్రమే అం దుబాటులో ఉన్నాయి. హిస్టరీ, హెరిటేజ్, కల్చర్‌ ఆఫ్‌ తెలంగాణ పుస్తకాలు లేవు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొత్త వెర్షన్‌ కూడా లేదు.

అభివృద్ధి, పర్యావరణ సమస్యలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఆంగ్లంలోనే ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులకు సమయం అత్యంత కీలకంగా మారింది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఔపోసన పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు అకాడమీలో లేని పుస్తకాల కోసం ఇతర పబ్లికేషన్ల వైపు పరుగులు పెడుతున్నారు.

కొత్త పుస్తకాల స్టాకు రాలేదంటున్నారు 
పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉత్తమమని మా ప్రొఫెసర్‌ చెప్పడంతో వాటినే చదువుతున్నాను. ప్రస్తుతం గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో ఆ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. తాజా సమాచారంతో కూడిన పుస్తకాల కోసం నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నా. కానీ కొత్త పుస్తకాల స్టాకు ఇంకా రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్నారు. వారి దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాల సెట్‌ ఒక్కో దానికి రూ.1,150 వసూలు చేస్తున్నారు.  
– డి. నర్సింగ్‌రావు, గ్రూప్‌–1 అభ్యర్థి, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement