ఆ నల్లటి వరుస కట్టిన అక్షరాల వెంట అక్షువులతో వెంబడిస్తే గుత్తులుగా కాసిన మామిడి పండ్ల చెట్టు కింద అశ్వాన్ని వదిలి సేదతీరుతున్న రాకుమారుడు కనిపిస్తాడు. కొమ్మపై కూచున్న జంట పక్షులు ఏవో అతనికి తెలియాల్సిన రహస్యం మరికాసేపట్లో చెవిన ఊదుతాయి. నల్లటి వరుస కట్టిన ఆ పంక్తుల వెంట పరిగెడితే కొత్త పెళ్లికూతురిని శోభనం రాత్రి చంపడమే వ్రతంగా పెట్టుకున్న రాకుమారుడు ఆ పెళ్లికూతురు మొదలెట్టిన గొలుసు కథల్లో గుడ్లు తేలేసి వ్రతం మరిచి ‘ఆ తర్వాత?’ అనే ప్రశ్నతో జీవితాంతం బతుకు వెళ్లమార్చడం చూస్తాము.
కాగితం మీద వరుస కట్టిన పంక్తులు రాముడు కానలకు వెళ్లాక కౌసల్య పడిన శోకమెట్టిదన్న ఆలోచనను ఇస్తాయి. బోధిచెట్టు కింద దేహాన్ని క్షోభ పెట్టుకుంటున్న సిద్ధార్థుని సాక్షాత్కారం కోసం వేచి చూడమంటాయి. కరకు పళ్లు దిగబడి కాలి విముక్తి కోసం ఘీంకారం చేస్తున్న గజేంద్రుని మోక్షానికి శంఖు చక్రాలు వదిలి శ్రీ మహావిష్ణువును పరిగెత్తమంటాయి. రామలింగడు ఈ పంక్తులు పలకడానికే అంబ ఇచ్చిన ఒక చేతి పాలు, మరో చేతి పెరుగును కలిపి గొంతులోకి ఒంపుకున్న వైనం చెబుతాయి. పుటలు కొన్ని శ్రీనాథుని పల్లకీ మోస్తాయి. పుటలు కొన్ని పేదవాడి తెల్లని నవ్వును మల్లెలుగా విరబూస్తాయి. పుటల నిండా వీరుని ధీరకంపనం... వనిత దీక్షా కంకణం... పసిపిల్లల కేరింతలు... యువతీ యువకుల సల్లాపాలు... కన్నీటి ఉప్పదనం... త్యాగపు శౌర్యము... భీరువు ఆక్రందన... ఆలోచనల అలజడి... తేజోమూర్తి జీవన సందేశము.
ఒక దేశ ‘తలసరి ఆదాయం’ ఎలా గణిస్తారోగాని ఒక దేశ ‘తలసరి సంస్కారం’ సగటున ఆ దేశపౌరుడు చదివిన పుస్తకాల సంఖ్యను బట్టి అవి ఎలాంటి పుస్తకాలన్న నాణ్యతను బట్టి గణించాలి. ఆహార కొరత వస్తేనో, విదేశీ మారకద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్టు కాదు. ఏ దేశ ప్రజలైతే నిజంగా పుస్తకాలు చదవడం మానేస్తారో, ఇంట పుస్తకాల అల్మారా లేకుండా జీవిస్తారో, ‘పుస్తకమా అది ఏమి’ అని ఫోన్ స్క్రీన్‌లో తల కూరుస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్టు!
వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం మేలైనది. ఇంట టివి, ఫ్రిజ్జు, కారు, ఐఫోన్ ఎన్ని కొన్నా మరోటేదో కావాలన్న అత్యాశను, పేడలో పడవేసే పేరాశను కలిగిస్తాయి. పుస్తకాలు? నీ పాదాలకు లేపనం రాసి హిమానీనదాల వరకూ తీసుకెళతాయి. నీ చీకటి కవాటాలను తెరిచి వెలుతురు వాకిళ్ల ఎదుట నిలబెడతాయి. నీ మూఢవిశ్వాసాలకు నువ్వే నవ్వుకునేలా చేస్తాయి. చైతన్యాన్ని కలిగించి నీ నిజస్థితి మీద అంచనా కట్టిస్తాయి. ద్వేషంతో, హైన్యంతో, వ్యవస్థీకృత దుర్లక్షణాలతో బతకాలన్న నీ పట్టుదలను అవి హరిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్ పెట్టమనవు. విలాసాలు అమేజాన్ చేయమనవు. అవి కోరేదల్లా తెరిచి చదవమనే!
రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల తెలుగు జనాభా. ఏ పుస్తకమూ 500 కాపీలు అమ్ముడుపోదు. అంటే కోటికి 100 మంది కూడా పుస్తకాలు కొనరు. సినిమా హీరోల కొరకు టికెట్టు రికార్డు స్థాయిలో కొంటారు. ‘నెక్ట్స్ సినిమా ఏమిటి?’ అని అడుగుతారు. ‘నువ్వు చదివిన పుస్తకం చెప్పు’ అని ఏ హీరోనీ ఎవరూ అడగరు. శ్రీమంతురాలైన సుధామూర్తి తానే శ్రీమంతులుగా భావించే ఒకరి ఇంటికి వెళ్లిందట. ‘అబ్బబ్బ... ఆ ఇంట మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు.. బంగారు సింహాసనాలు... అమూల్య కళాకృతులు... ఒక్కటే లోపం. ఒక్క పుస్తకం కనపడలేదు’ అని రాసింది. ఇలాంటి పేదరికంలో ఉన్న శ్రీమంతులు మనలో ఎందరు? పూర్వం తెలుగు ఇళ్లల్లో తప్పనిసరిగా ఎక్కాల పుస్తకం ఉండేది. శతకాలు ఉండేవి. పెద్ద బాలశిక్ష అయినా కనిపించేది. ఒక చిన్న గూటిలో ఇవి కూడా లేని స్థితికి తెలుగుజాతి ఎగబాకింది
10 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. పక్క కవి పుస్తకం కొనరు. 5 వేల మంది తెలుగు కథకులు ఉన్నారు. పక్క రచయిత సంకలనం కొనరు. పాఠకుల మీద వంక పెడుతుంటారు. మొదట వీరే పుస్తకాలు కొనరు. రచయిత అంటే ఎవరు? సీనియర్ పాఠకుడు! మంచి కవి కావాలన్నా, మంచి కథకుడు కావాలన్నా మొదట జీవితంలో పాల్గొనాలి అనుభవం కోసం. తర్వాత పుస్తకాలు చదవాలి సాధన కోసం. జీవన స్పర్శ, పుస్తకాల సంపర్కం లేని శుష్కకవులతో, కథకులతో నిండి ఉంది నేటి మెజారిటీ తెలుగు సమాజం. ఇక మన పాఠకులు ‘మా పిల్లలు తెలుగు చదవరు’... ‘మాకు ఈ కథలు, కవిత్వం పడవు’ అంటూ ఉంటారు. నీకు రోటి పచ్చడి ఇష్టమైతే కనీసం రోటి పచ్చళ్ల మీద వచ్చిన పుస్తకమైనా కొను. ఇంట పుస్తకంగా కనపడుతూ ఉంటుంది.
డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్‌లో పుస్తకాల రుతువు. అంటే బుక్ ఎగ్జిబిషన్. వందలాది స్టాళ్ళు, వేలాది పుస్తకాలు, ఆవిష్కరణలు, ఉపన్యాసాలు, సాహితీకారుల దర్శనం, మిత్రుల కరచాలనం, చలిగాలుల్లో ఛాయ్‌తో చేసే కబుర్లు. తెలుగులో ఎందరో రచయితలు, కవులు, బుద్ధిజీవులు... ఈ బుక్ ఎగ్జిబిషన్‌కు తరలివచ్చే పాఠకుల మీద నమ్మకంతో కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నారు. పాత క్లాసిక్స్‌ను రీప్రింట్ చేస్తున్నారు. ‘ఈ పుస్తకాలు చదివి ఆనందించండి, ఆస్వాదించండి, ఆలోచించండి’ అని కొమ్ముబూర ఊది మరీ మొరపెట్టుకోనున్నారు. ఈ రుతువులో పాలుపంచుకోండి. పుస్తకాల చెట్టు నీడ ప్రతి ఇంటా పడుగాక!
Comments
Please login to add a commentAdd a comment