
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో సోమవారం వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మది కీలక పాత్రం. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశుతోష్ తన ఫైటింగ్ నాక్‌తో ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు.
ఓటమి తప్పదనుకున్న చోటు అశుతోష్ శర్మ అజేయ ఇన్నింగ్స్‌తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. అశుతోష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 66 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ ఈ సంచలన విజయం సాధించడంలో అశుతోష్ పాత్ర ఎంత కీలకమైందో మరో ఆటగాడు విప్రాజ్ నిగమ్ పాత్ర కూడా అంతే వెల కట్టలేనిది. ఢిల్లీ విజయానికి 45 బంతుల్లో 97 పరుగులు కావాల్సిన సమయంలో విప్రజ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న ట్రిస్టన్ స్టబ్స్ ఔట్ కావడంతో ఢిల్లీ ఓటమి లాంఛనమే అంతా అనుకున్నారు.
కానీ క్రీజులోకి వచ్చిన వచ్చిన విప్రాజ్‌తన దూకుడైన బ్యాటింగ్‌తో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఐపీఎల్‍లో తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న భయం కానీ బెరుకు కానీ అతడిలో కన్పించలేదు. ప్రత్యర్ధి బౌలర్లను విప్రాజ్ ఊచకోత కోశాడు. విప్రాజ్ కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. విప్రాజ్ బౌలింగ్‍లోనూ ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. ఈ క్రమంలో ఎవరీ విప్రాజ్ నిగమ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ విప్రాజ్ నిగమ్?
20 ఏళ్ల విప్రాజ్ నిగమ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది రంజీ సీజన్‌తో అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విప్రజ్ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లో ఎక్కువగా అద్భుతాలు చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
సయ్యద్ ముష్తాక్ అలీ 2024-25 ట్రోఫీలోనూ విప్రాజ్ నిగమ్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో అతడు ఏడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఎనిమిది బంతుల్లో 27 పరుగులు పరుగులు చేసి యూపీకి సంచలన విజయాన్ని అందించాడు.
దీంతో ఒక్కసారిగా అతడు వెలుగులోకి వచ్చాడు. యూపీటీ20 2024 సీజన్‍లో కూడా విప్రాజ్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో యూపీ ఫాల్కన్స్ తరఫున 12 మ్యాచ్‍లు ఆడిన ఈ స్పిన్నర్ 20 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 వేలంలో విప్రాజ్ నిగమ్‍ను రూ.50లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్‌లో నిగమ్ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. 29 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీకి మంచి ఆల్‌రౌండర్ దొరికినట్లే.
ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ ఢిల్లీ స్కోర్లు
👉లక్నో- 209/8 (20)
👉ఢిల్లీ- 211/9 (16.2)
👉ఫలితం- ఒక్క వికెట్ తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు
చదవండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్