సాక్షి, కడప: అపర అయోధ్యగా పేరొందిన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. చారిత్రక ప్రాశస్త్యంగల ఒంటిమిట్టలో నాలుగేళ్లుగా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి.
ఏకశిలా నగరంలో కిక్కిరిసిన భక్తులు
ఏకశిలా నగరంగా పేరున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఒంటిమిట్ట కిటకిటలాడింది. క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. ఉ.9 గంటల ప్రాంతంలో ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. శాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్టించడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం సందర్బంగా ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
30న కల్యాణోత్సవం: ఒంటిమిట్టలో 30న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కల్యాణంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. అలాగే, గవర్నర్ కూడా హాజరయ్యే అవకాశమున్నందున అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.
చంద్రునికి ప్రీతిగా రాత్రివేళ కల్యాణం
రాజంపేట: విశ్వవ్యాప్తంగా సీతారాముల కల్యాణం పగటిపూట జరిపితే ఒక్క ఒంటిమిట్టలోనే రాత్రిపూట జరపడం విశేషం. దీనివెనుక పెద్ద కథే ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అదేమిటంటే.. ఎక్కడ చూసినా సీతాశ్రీరాముల కల్యాణం ఉదయంపూటే జరుగుతుండడంతో దానిని కనులారా వీక్షించి తరించే అవకాశం చంద్రునికి లేకుండాపోయింది. చంద్రుడు ఈ బాధ భరించలేకపోయాడు. బ్రహ్మోత్సవాలకు అధినాయకుడైన బ్రహ్మకు తన ఆవేదనను నివేదించుకున్నాడు. బ్రహ్మ అందుకు తగిన ఏర్పాటుచేస్తానని.. భూమ్మీద ఏదో ఒకచోట ఆ అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. దాని ఫలితంగానే ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో చైత్ర శుద్ధ చతుర్ధశి నాటి రాత్రి వివాహ మహోత్సవం, కళాపూర్ణుడైన చంద్రుడు శ్రీ సీతారామకల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడు.
ఇదిలాఉంటే.. ఈ కల్యాణం ఏర్పాటుచేసింది బ్రహ్మదేవుడు కాదు.. శ్రీ మహావిష్ణువు అని కూడా అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో పగటిపూట జన్మించాడు. పగటివేళ జననం కారణంగా చంద్రుడు ఆ సన్నివేశం చూడలేకపోయాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడుగా రాత్రిపూట జన్మించాడు. చంద్రుడు కృష్ణ జననం చూడగలిగాడు. అయినా శ్రీరామకల్యాణం చూడలేకపోతున్నానే చంద్రుని ఆవేదనను శ్రీ మహావిష్ణువు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో తీర్చినట్లు మరో కథనం. అలాగే, బుక్కరాయలు ఒంటిమిట్టలో శ్రీరామ బ్రహ్మోత్సవాలు ప్రారంభించాడు. ఇందులో భాగంగా శ్రీరామ కల్యాణం జరగాలి. తొలి కల్యాణ మహోత్సవానికి ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రిపూట వచ్చింది. ఈ విధంగా బుక్కరాయల కాలంలో రాత్రిపూటే తొలి సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగినట్లు తెలుస్తోంది. ఆ నాటి నుంచి నేటి దాకా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
ఆంజనేయుడు లేని ఏకైక రామాలయం
ఒంటిమిట్ట ఆలయంలో బుక్కరాయలు ఏకశిలపై ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన కాలంలోనే ఆలయ నిర్మాణం ప్రారంభమైనట్లు, చివరగా సిద్దవటం మట్లి రాజులు ఆలయ నిర్మాణాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉండగా, ఆంజనేయస్వామిలేని ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. మరోవైపు.. ఇక్కడ ఒకే శిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు రూపుదిద్దుకోవడంతో ఈ ప్రాంతం ఏకశిలా నగరంగా ఖ్యాతి పొందింది.
Comments
Please login to add a commentAdd a comment