ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం.. కమనీయం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట దివ్యక్షేత్రం బుధవారం అయోధ్యనగరిని తలపించింది. కళ్లు చెదిరే కళ్యాణశోభతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ప్రభుత్వపక్షాన రాజలాంఛనాలు సమర్పించగా శ్రీ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా సాగింది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఆ క్షేత్రంలోని ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంటిమిట్ట టీటీడీలో విలీనమైన తర్వాత తొలిసారిగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
కానుకలను సమర్పించిన గవర్నర్, సీఎం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీరామచంద్రుడు, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, సువర్ణ కిరీటాలను కల్యాణ కానుకలుగా సమర్పించారు. ఒంటిమిట్ట చెరువు సమీపంలో రూ.142 కోట్ల అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శ్రీరామ ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.