శ్రీసీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకుతాళిబొట్టును చూపుతున్న పండితులు
వైఎస్సార్ జిల్లాలోని అపర అయోధ్య ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించారు. కనులపండువగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల రామనామ స్మరణలు మార్మోగుతుండగా పురోహితులు కల్యాణ క్రతువును చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రత్యేక విమానంలో కడపకు వచ్చి, అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఒంటిమిట్టకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు సంప్రదాయంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పురోహితులు అమ్మవారి మహామంగళ సూత్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. మంగళ వాయిద్యాల మధ్య పురోహితులు స్వామి పక్షాన అమ్మవారి గళసీమలో మంగళ సూత్రాలను అలంకరించారు.
- సాక్షి, కడప
Comments
Please login to add a commentAdd a comment