ఒంటిమిట్ట రామాలయంలోని అంతరాలయం జీర్ణోద్ధరణ
రూ. 75 లక్షలతో పనులు చేపట్టనున్న కేంద్ర పురావస్తు శాఖ
శతాబ్దాల చరిత్ర, ఏకశిలానగరిగా గుర్తింపు. ఒంటిమిట్ట రాములోరిగా ప్రఖ్యాతి. ఇప్పుడు ఆ పురాతన కోదండరామాలయంలో గర్భగుడి జీర్ణోద్ధరణ పనులు చేయడానికి కేంద్రపురావస్తు శాఖ సన్నద్ధం అవుతోంది. శతాబ్దం కాలం తర్వాత చేపడుతున్న ఈ పనులతో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం కొత్త సొబగులు సంతరించుకోనుంది.
వందేళ్ల క్రితం ఆంధ్ర వాల్మీకిగా గుర్తింపు పొందిన వావికొలను సుబ్బారావు నేతృత్వంలో ఓ సారి గర్భగుడిలో జీర్ణోద్ధరణ పనులు జరిగాయి. టీటీడీ ఆదీనంలోకి ఆ రామాలయం వెళ్లిన తర్వాత అంతరాలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తుశాఖ చేపట్టనుంది. – రాజంపేట
విజయనగర సామ్రాజ్య కాలంలో..
విజయనగర సామ్రాజ్య కాలంలో.. క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో తన పరివారంతో పర్యటించారు. ఇక్కడి అడవుల్లో వంటడు, మిట్టడు అనే ఇద్దరు బోయలు రాజుగారికి సేవలందించారు. ఆ సమయంలో ఒంటిమిట్ట ప్రాంతంలో ఉన్న ఆలయం గురించి రాజుకు వివరించారు. గుట్టమీద చిన్న గుడిలో జాంబవంతుడు ప్రతిష్టించిన ఏక శిలలో సీతారామలక్ష్మణులను పూజిస్తున్నామని, అక్కడ ఓ గుడి కట్టాలని వారు రాజును అభ్యర్థించారు.
వంటడు, మిట్టడు చెప్పిన మేరకు కంపరాయలు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించి ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. ఒకే శిలలో సీతారామలక్ష్మణులను జాంబవంతుడు ప్రతిష్టించినట్లే.. అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. అప్పట్లో గర్భాలయం, అంతరాలయం, చిన్నగోపురం ఉండేవి. మొదటిదశ నిర్మాణమిది.
కొబ్బరి చిప్ప చేతపట్టుకుని..
రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాలు ఆక్రమణకు గురికాగా, వందేళ్ల క్రితం రామునికి నైవేద్యం కరువైన పరిస్థితి వచ్చింది. జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి వావికొలను సుబ్బారావు కంకణం కట్టుకున్నారు. కొబ్బరి చిప్పను చేతపట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఊరూరా తిరిగి జోలెపట్టారు. ఆ డబ్బుతో రామాలయాన్ని పునరుద్ధరించారు. 1925లో దాదాపు రూ. 2 లక్షలను సేకరించి, గర్భగుడి, ఆలయ ప్రాంతాన్ని జీర్ణోద్ధరణ చేశారు. అప్పట్లో పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
6 నుంచి గర్భాలయం మూసివేత
ఇప్పుడు జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో సెపె్టంబర్ 6 నుంచి గర్భాలయం మూలవిరాట్టు దర్శనం ఉండదు. ఆలయ ప్రాంగణంలో టీటీడీ బాలాలయం నిరి్మస్తోంది. దాదాపు రూ. 75 లక్షలతో గర్భగుడి పనులు చేపట్టనున్నారు. గర్భాలయం మూలవిరాట్టు (ఏకశిల) చుట్టూ చేపట్టే పనులను వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఈవిషయాన్ని కేంద్రపురావస్తుశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి తెలియచేశారు. అలాగే గోపురం పైభాగంలో ఉన్న శిలారూపాలను కూడా అందంగా తీర్చిదిద్దనున్నారు. శతాబ్ద కాలం తర్వాత గర్భగుడిలో పనులు జరగడంపై రామభక్తుల్లో ఆనందం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment