శ్రీశైలం: శ్రీశైలంలోని ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. ఉప స్థపతి జవహర్ మంగళవారం వీటిని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. ఆలయ ఈవో కేఎస్.రామారావు వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ..5 ఇన్ టూ 9 అంగుళాల సైజులో ఉన్న రాగి రేకులపై నాగరి, కన్నడ లిపితో చెక్కిన శాసనాలు ఉన్నాయన్నారు.
శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా ఉందని, మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించారని చెప్పారు. 97 వెండి నాణేలు విడిగా లభించాయని, 148 నాణేలు ఇత్తడి పాత్రలో ఉన్నాయని తెలిపారు. ఇవి 1800–1910 మధ్య తయారైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు. వీటి పరిశీలనకు శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ అధ్యయన కేంద్రం సంస్కృతి, పురావస్తు విభాగం ఆచార్యులను పిలిపించామని, పురావస్తు కార్యాలయానికి కూడా సమాచారమిచ్చామని చెప్పారు. కాగా, ఇదే ప్రాంతంలో ఈ నెల 7, 8 తేదీలలో 29 తామ్ర శాసనాలు లభించాయి.
(చదవండి: సింహం ప్రతిమలు మాయం, విచారణకు కమిటీ)
Comments
Please login to add a commentAdd a comment