
నిఘా కరువైన శ్రీశైలం దేవస్థానం
సెల్‌ఫోన్లు, లగేజితో ఆలయంలోకి వచ్చేస్తున్న భక్తులు, సిబ్బంది
క్యూలైన్ల వద్ద అడిగే వాడే లేడు
భద్రతను వదిలేసి, టికెట్లు తనిఖీ చేస్తున్న సెక్యూరిటీ గార్డులు
మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లు ఉన్నా వినియోగించని వైనం
లగేజి స్కానర్ సైతం నిరుపయోగమే
నిఘా విభాగం హెచ్చరించినా చర్యలు శూన్యం
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆలయాల భద్రతను అధికారులు గాలికొదిలేశారు. క్షేత్రంలో అడుగడుగునా నిఘా, భద్రత లోపాలు కొట్టొచి్చనట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన భద్రతపై పోలీసు, ఆక్టోపస్ భద్రతా దళం, నిఘా వర్గాలు పలు నివేదికలు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు పరచడంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, భక్తులు అందరూ సెల్‌ఫోన్లతో, లగేజి బ్యాగులతో ఆలయంలోకి ప్రవేశించేస్తున్నారు. ఆలయంలోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులను అనుమతించకూడదని ఈవో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ సినా, కొందరు అధికారులు వాటిని బుట్టదాఖలు చేశారు. –శ్రీశైలం టెంపుల్
సెక్యూరిటీ బాధ్యతలు వదిలేసిన గార్డులు
శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి సాధారణ రోజుల్లో రోజుకు 20 నుంచి 30వేల మంది, రద్దీ రోజుల్లో సుమారు 50 వేల మంది వస్తుంటారు. ఆలయంలో భద్రతకు సుమారు 40 మంది హోంగార్డులు, ఓ ఏజెన్సీ ద్వారా 180 మంది సెక్యూరిటీ గార్డులు, మరో రెండు ఏజెన్సీల ద్వారా 32 మంది సెక్యూరిటీ గార్డులు, ఐదుగురు సెక్యూరిటీ సూపర్‌వైజర్లు ఉన్నారు. హోంగార్డులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఆలయంలో, క్షేత్రంలోని వివిధ ప్రదేశాలలో సెక్యూరిటæ విధుల్లో ఉండాలి.
అలాగే క్యూలైన్ల ప్రవేశ ద్వారాల వద్ద భక్తులు సెల్‌ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలి. అయితే రూ.150, రూ.300 క్యూలైన్లు, ఆర్జితసేవల క్యూలైన్ వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులు ఓ పర్యవేక్షకురాలి ఆదేశాలతో భద్రత విధులు వదిలేసి, టికెట్లు, ఆధార్ కార్డులు తనిఖీల్లో మునిగిపోతున్నారు.
ఆ క్యూలైన్లలో పని చేసే హోంగార్డులు సైతం టికెట్ల తనిఖీలతోనే తలమునకలు అవుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇతర అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. దీంతో భక్తులు, సిబ్బంది ఆలయంలోకి యథేచ్ఛగా సెల్ ఫోన్లు, లగేజితో ప్రవేశిస్తున్నారు. ఎక్కడా ఏ దశలోనూ అడిగేవాడు, తనిఖీ చేసే వాళ్లు కనిపించడంలేదు.
నిరుపయోగంగా భద్రత పరికరాలు
శ్రీశైల దేవస్థానం భక్తుల భద్రత దృష్ట్యా ఉచిత క్యూలైన్, ఆర్జిత సేవాకర్తల ప్రవేశ ద్వారం, శ్రీ కృష్ణదేవరాయ గోపురం, రూ.150 క్యూలైన్, రూ.300 క్యూలైన్, హరిహరరాయగోపురం, అమ్మవారి ఆలయం వెనుక తదితర చోట్ల డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లను దేవస్థానం ఏర్పాటు చేసింది.
ఆర్జిత సేవాకర్తల ప్రవేశ ద్వారం, శ్రీకృష్ణదేవరాయగోపురం వద్ద డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఇటీవల తొలగించారు. మిగతా చోట్ల ఉన్నవీ పనిచేయక, అలంకారప్రాయంగా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం లగేజ్ స్కానర్‌ను దేవస్థానం ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు వినియోగించిన దాఖాలాల్లేవు. ఇక ఆలయంలో సెల్‌ఫోన్ జామర్లు లేకపోవడం చూస్తే భద్రతను ఏ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారో అర్థమవుతోంది.
హెచ్చరికలు బేఖాతరు
శ్రీశైలం ఆలయం భద్రతపై ఆక్టోపస్ బృందాలు పలుమార్లు మాక్‌డ్రిల్ నిర్వహించాయి. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్వీయ పర్యవేక్షణ చేపట్టి పలు భద్రతా చర్యలు చేపట్టాలని సూచిస్తూ దేవస్థానానికి నివేదికలు కూడా ఇచ్చారు. నిఘా విభాగాలు కూడా క్షేత్ర భద్రతపై పలుమార్లు హెచ్చరించినా ఆలయ అధికారుల తీరులో మార్పురాలేదు.
స్క్రీనింగ్ చేస్తున్నాం
శ్రీశైలం దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లోకి ప్రవేశించే భక్తులు ఎలాంటి సెల్‌ఫోన్లు, నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశాం. ఆలయంలో భద్రతను మరింత పటిష్టం చేస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి
Comments
Please login to add a commentAdd a comment