కడప కల్చరల్ : ఒంటిమిట్ట దివ్య క్షేత్రానికి కొత్త హంగు కలగనుంది. జాంబవ ప్రతిష్టగా పేరున్న ఈ క్షేత్రంలో జాంబవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని చాలా కాలంగా భక్తులు కోరుతున్నారు. వారి వినతులకు స్పందించిన టీటీడీ అదికారులు ఇటీవలి పర్యటన సందర్భంగా ఈ మేరకు విగ్రహ ప్రతిష్ట చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రానికి తలమానికంగా, జిల్లాకు గర్వ కారణంగా నిలిచిన శ్రీమద్ ఒంటిమిట్టకు జాంబవ క్షేత్రంగా పేరుంది. ఈ ఆలయానికి అధికార హోదా దక్కేందుకు స్థానిక పరిశోధకులు ఆలయ ప్రాచీనత గురించి చెబుతూ క్షేత్ర పాలకుడిగా రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించినది జాంబవంతుడేనని స్పష్టం చేశారు. ఇందుకు పురాణ గాథలను ఉదాహరణగా చూపారు. తిరుమల క్షేత్రానికి వరాహ స్వామి, దేవునికడపకు హనుమంతుడు క్షేత్ర పాలకులు. అలాగే ఒంటిమిట్ట ఆలయానికి జాంబవంతుడు క్షేత్ర పాలకుడని స్థానిక చరిత్రకారుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్ట జాంబవ క్షేత్రమని పేర్కొనేందుకు జిల్లాలో పలు ఆధారాలు లభించాయి. సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో రోడ్డు వారగా జాంబవంతుని శిలాచిత్రం గల శాసనం లభించింది. పలు తరాలుగా తాము జాంబవంతుడిని పూజిస్తున్నామని, ఒంటిమిట్ట తిరునాలకు గ్రామ వాసులంతా తప్పక వెళతామని తెలిపారు.
అంబవరంలో..
కడప నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో అంబవరం గ్రామం ఉంది. గ్రామం మధ్యలో గల చిన్న దిమ్మెపై రెండు అడుగుల జాంబవంతుని విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఒకప్పుడు ఈ స్థలంలో చిన్న రాయి ఉండేదని, దాన్నే జాంబవంతునిగా పూజించేవారమని, పెద్దల కాలం నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. తరతరాలుగా తమ గ్రామంలో జాంబవంతుని పూజలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వరుసగా రెండేళ్లుగా వర్షాలు రాకపోతే నెల రోజుల పాటు ఇంటికొక బిందె చొప్పున నీళ్లు తెచ్చి జాంబవంతుని విగ్రహాన్ని అభిషేకిస్తామని, తప్పక మంచి ఫలితం ఉంటోందని వారు వివరించారు.
తాడిగొట్లలో..
కడప నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాడిగొట్ల గ్రామం ఉంది. ఊరి మధ్య విశాలమైన అరుగుపై ఆ గ్రామ ప్రజలు జాంబవంతుని విగ్రహం ఉంది.
గ్రామంలో ఏ ఇంటిలోనైనా శుభ కార్యాలు జరిగితే తొలిపూజ జాంబవంతునికే నిర్వహిస్తామని తెలిపారు. వర్షాభావ పరిస్థితి ఏర్పడితే స్వామికి అభిషేకాలు చేస్తామని, తప్పక వర్షాలు కురుస్తాయన్న విశ్వాసం ఉందన్నారు. ఈ గ్రామాలే గాక చిట్వేలితోపాటు కడప నగరానికి సమీపంలోని మరికొన్ని గ్రామాలలో కూడా జాంబవంతుని విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒంటిమిట్ట క్షేత్ర పాలకుడు జాంబవంతుడు గనుక జిల్లాలోని ఆ క్షేత్రానికి సమీపంలో గల చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న గ్రామాలలో నేటికీ పూజిస్తూ ఉండడంతో.. ఒంటిమిట్ట క్షేత్రానికి జాంబవంతుని గల అనుబంధాన్ని భావితరాలకు శాశ్వతంగా తెలిపేందుకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని రామయ్య భక్తులు చిరకాలంగా కోరుతున్నారు. ఇటీవల ఆలయాన్ని పరిశీలించిన టీటీడీ అధికారులకు కూడా విన్నవించడంతో.. వావిలకొలను సుబ్బారావు తపం చేసిన శృంగిశైలంపై జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కొండపైనే తొలుత జాంబవంతుడు నివసించినట్లు కైఫీయత్తుల పరిష్కర్త, చరిత్ర పరిశోధకులు దివంగత విద్వాన్ కట్టా నరసింహులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
గిరి ప్రదర్శన
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం, సింహాచలంతోపాటు మరికొన్ని దివ్య క్షేత్రాలలో ఆయా దేవతామూర్తుల పూజలో భాగంగా అక్కడ గిరి ప్రదర్శన నిర్వహిస్తుండడం తెలిసిందే. అదే పద్ధతిలో ఒంటిమిట్టలోని శృంగిశైలానికి కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదిజాంబవ మఠాల పెద్దలు పలు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొండపై జాంబవంతుని ప్రతిష్ట జరిగితే ఇక్కడ కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని వారు మరోమారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, ఒంటిమిట్ట తిరునాల సందర్బంగా తాము తమ శిష్య గణాలతో కలిసి శృంగిశైలం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని గుర్తు చేశారు. మంచి నిర్ణయం తీసుకున్నట్లు హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారులను అభినందించారు.
ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
Comments
Please login to add a commentAdd a comment