సాక్షి, ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా గురువారం టీటీడీ ఈఓ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఒంటిమిట్టలోని స్వామి వారి కల్యాణ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. భక్తులందరికి అక్షింతలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, ఈఎంసీ సీఈఓ గౌతమి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
కడప కార్పొరేషన్: ఈనెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 7.30 నుంచి 7.40 గంటల వరకు కోదండరామస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సీతారాముల కల్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. 8.00 నుంచి 10.00 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకిస్తారు.
తర్వాత రోడ్డు మార్గాన ఒంటిమిట్ట నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు కడపలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు, 16వ తేదీ శనివారం ఉదయం 9.10 గంటలకు కడప ఎన్జీఓ కాలనీలో నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి పాత బైపాస్‌లో ఉన్న ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుంటారు. 9.30 నుంచి 9.45 గంటల వరకు కడప నగర మేయర్ సురేష్‌బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ ముందస్తు వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి కడపకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలుజిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment