
వావిలికొలను సుబ్బారావు (ఫైల్)
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రామదాసు. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు.. వావిలికొలను సుబ్బారావు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం – రాజంపేట
ఆంధ్రవాల్మీకిగా పేరుగడించిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణకు విశేష కృషి చేశారు. ఈయన జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు 1, 1936లో మద్రాసులో పరమపదించారు.
ఆలయ అభివృద్ధికే..
రాజులు ఒంటిమిట్ట ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి కోదండరామాలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఈ రామాలయంను ఉద్ధరించటానికి వావిలికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. ఆ ధనంతో రామాలయంను పునరుద్ధరించారు. టెంకాయచిప్పలో ఎంతధనం పడినా ఏదీ తన కోసం ఉంచుకోకుండా రాయాలయ అభివృద్ధికే ఇచ్చేశారు.
►ఈయన రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్ర విజయం, దండకత్రయం, టెంకాయచిప్ప శతకం, పోతన నికేతన చర్చ, శ్రీరామనుతి, కౌసల్యా పరిణయం లాంటి ఎన్నో రచనలు కూడా చేశారు.
►వాల్మీకి సంస్కృత రామాయణంను 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. ఆయన రాసిన రామాయణంను ఒంటిమిట్ట శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు వావిలికొలను సుబ్బారావుకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు.