vontimitta ramayya kalyanam
-
ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి కల్యాణం (ఫొటోలు)
-
శ్రీరామనవమి వైభవంగా జరిగే ఒంటిమిట్ట రామాలయం స్పెషల్ ఫొటోలు
-
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట రాములోరి కల్యాణం (ఫొటోలు)
-
వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం..
సాక్షి, వైఎస్ఆర్: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. పండు వెన్నెల్లో కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. వరి గింజల కంకులు, ఫల పుష్పాలతో శోభాయమానంగా కల్యాణ వేదికను అలంకరించారు. ఒంటిమిట్టలో కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం ఉదయం శివ ధనుర్భంగా లంకారములో, పురవీధుల్లో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు ఊరేగాడు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భక్త జన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపులో.. టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీరామ నవమికి కాకుండా.. సీతారామ కల్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో చైత్ర పౌర్ణమి రోజు, పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. శ్రీరామనవమి రోజు జరిపించాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడట.అందుకే తన కళ్యాణ వేడుకను చంద్రుడు తిలకించేలా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుందని వరమిచ్చాడని కథనం. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా... రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు. ఒంటిమిట్ట ప్రత్యేకత ఇదే జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. శ్రీ రామచంద్రుడిపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. -
రారండోయ్.. రాములోరి పెళ్లికి
ఏకశిలానగరం.. కానీ ఓరుగల్లు కాదు..తెలుగునాట సీతారామలక్ష్మణులు కొలువుదీరిన పుణ్యధామం.. కానీ భద్రాద్రి కాదు వాల్మీకి రామాయణంలో కనిపించనిది.. వెన్నెల వెలుగుల్లో మురిపించేది.. ఒకే క్షేత్రం. అదే ఒంటిమిట్ట! ఆంధ్రప్రదేశ్‌లో అపర భద్రాచలంగా పేరొందిన ఈ దివ్యక్షేత్రం సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లాలో ఉంది ఒంటిమిట్ట. చుట్టూ కొండలు, పచ్చని పంటపొలాల మధ్యలో ఉంటుంది ఇక్కడి కోదండ రామాలయం. అపురూప శిల్పసంపదతో అలరారుతున్న ఈ దేవాలయ నిర్మాణంలో చోళరాజులు, విజయనగర రాజులు, మట్లి రాజుల కళా వైభవం కనిపిస్తుంది. రాజగోపురాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయ మంటపంలోని ప్రతి స్తంభం ఒక కళా రూపాన్ని ప్రదర్శిస్తుంది. చతుర్థశి నాడు.. పున్నమి వెలుగుల్లో కల్యాణం ఏకశిలానగరి కోదండ రామాలయంలో శ్రీ రామనవమి రోజు కాకుండా పండు వెన్నెల రోజు సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఆ మేరకు బుధవారం రాత్రి రామయ్య పెళ్లి జరగనుంది. చిన్నతనం నుంచి దాశరథికి ‘చంద్రుడు’ అంటే ఇష్టం. చిరుప్రాయంలో ఆకాశంలో చంద్రున్ని చూపిస్తేనే ఆహారాన్ని ఆరగించేవాడు. రఘురాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో విళంబినామ సంవత్సరంలో జన్మించాడు. ఆయన వివాహ మహోత్సవాలు అన్ని ఆలయాల్లోనూ నవమి నాడే అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. భద్రాచలం రామక్షేత్రంలో, తిరుపతి కోదండ రామాలయంలోనూ దాదాపు అన్ని చోట్ల చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవమి నాటి కల్యాణంతో ముగుస్తాయి. ఇలా అనేక చోట్ల పగలు రామయ్య పెళ్లి జరిగితే ఒక ఒంటిమిట్టలోనే రాత్రి వేళ నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. ఆలయ దివ్య దర్శనం ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. ► కోదండ రాముడు సూర్య వంశీయుడు. స్వయంప్రతాపం కలిగినవాడు. శత్రువులు కన్నెత్తి చూడజాలని తేజం ఉన్న వాడు. ప్రజల్ని కన్నబిడల్లా చూడాలంటే ఆయన ముఖంలో వెన్నెల కురవాలి. ప్రసన్నత, చల్లదనం కావాలి. ప్రజల్ని చల్లగా పాలించి శ్రీరాముడు శ్రీ రామచంద్రుడయ్యాడు. తన పేరు శ్రీరాముడికి తోడైనందుకు చంద్రుడు ఉబ్బిపోయేవాడు. దేశమంతటా జరిగే శ్రీరామ బ్రహ్మోత్సవాల్లో శ్రీరాముడి కల్యాణాన్ని చూసే అవకాశం చంద్రుడికి లేకుండా పోయింది. బ్రహ్మోత్సవాలకు అధినాయకుడైన బ్రహ్మకు తన ఆవేదనను నివేదించుకొన్నాడు. ఆమేరకు బ్రహ్మ ఏకశిలానగరిని వేదికగా నిర్ణయించాడు. చతుర్థశి రాత్రి కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడు. మోహినీ అలంకారంలో జగన్మోహనుడు ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు మంగళవారం ఉదయం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడికి అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ జరిపారు. రాత్రి 7 గంటల నుంచి నృత్యాలు, కోలాటాలు, భజనల నడుమ గరుడ సేవ కనుల పండువగా సాగింది. రామయ్య పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమం ఆలయ టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. నేడు ట్రాఫిక్ మళ్లింపు ఒంటిమిట్ట/కడప అర్బన్: ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లిస్తామన్నారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి జంక్షన్ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి. తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. రాజంపేట వైపు వెళ్లే భారీ వాహనాలు రాయచోటి మీదుగా వెళ్లాలి. రాజంపేట నుంచి వచ్చే ద్విచక్రవాహనాలను సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా దారి మళ్లిస్తారు. -
సీఎం జగన్‌కు కాలినొప్పి.. ఒంటిమిట్ట పర్యటన రద్దు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాలినొప్పి కారణంగా రేపటి వైఎస్సార్ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ఆయనకు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి పెరిగింది. గతంలో ఇలానే కాలికి గాయం కాగా, చాలా రోజులపాటు సీఎం ఇబ్బందిపడ్డారు. తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చదవండి: 2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023 5న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు: ఈ నెల 5న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. మళ్లింపు ఈ నెల 5 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలు అనుమతించరని ఎస్పీ తెలిపారు. వాహనాల దారి మళ్లింపు వివరాలు: ►కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుండి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి ►తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుండి దారి మళ్లింపు.. వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి ►రాజంపేట వైపు నుండి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు ►రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుండి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా దారి మళ్లింపు 15 చోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు ►రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను సాలాబాద్ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి ►కల్యాణ వేదిక నుండి కడప మార్గంలో 10 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు -
ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేదిక ఏర్పాట్లు పరిశీలన
వైఎస్సార్ జిల్లా: ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేదిక ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ నెల 5వ తేదీన జరుగనున్న రాములోరి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అక్కడ ఏర్పాట్లను పరిశిలించారు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈవో.. ‘ ఏప్రిల్ 5వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాములోరి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారు. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు కంపార్ట్మెంట్లలోనే ప్రసాదాలను అందజేస్తాం. కళ్యాణ ప్రాంగణమంతా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు.. సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం
తాడేపల్లి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్, ఈవోలు అందజేశారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. అదే సమయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 09 తేదీ వరకూ ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా సీఎం జగన్‌ను టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి ఆహ్వాన శుభ పత్రికను అందజేశారు. -
ఒంటిమిట్ట రామయ్య కోసం.. టెంకాయ చిప్పతో ఊరూరా..భిక్షమెత్తి
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రామదాసు. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు.. వావిలికొలను సుబ్బారావు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం – రాజంపేట ఆంధ్రవాల్మీకిగా పేరుగడించిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణకు విశేష కృషి చేశారు. ఈయన జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు 1, 1936లో మద్రాసులో పరమపదించారు. ఆలయ అభివృద్ధికే.. రాజులు ఒంటిమిట్ట ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి కోదండరామాలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఈ రామాలయంను ఉద్ధరించటానికి వావిలికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. ఆ ధనంతో రామాలయంను పునరుద్ధరించారు. టెంకాయచిప్పలో ఎంతధనం పడినా ఏదీ తన కోసం ఉంచుకోకుండా రాయాలయ అభివృద్ధికే ఇచ్చేశారు. ►ఈయన రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్ర విజయం, దండకత్రయం, టెంకాయచిప్ప శతకం, పోతన నికేతన చర్చ, శ్రీరామనుతి, కౌసల్యా పరిణయం లాంటి ఎన్నో రచనలు కూడా చేశారు. ►వాల్మీకి సంస్కృత రామాయణంను 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. ఆయన రాసిన రామాయణంను ఒంటిమిట్ట శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు వావిలికొలను సుబ్బారావుకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు. -
ఒంటిమిట్ట.. విశేషాల పుట్ట..
ఏకశిలానగరి.. విశేషాల ఝరి.. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ, లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. – ఒంటిమిట్ట/కడప కల్చరల్ రామతీర్థం.. నేటికీ పదిలం రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది. కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తరువాత బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించుటకు స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగానే నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి చక్రస్నానం జరుపుతారు. జాంబవంతుడి ప్రతిష్ట ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. రామయ్య నడయాడిన నేల శ్రీ రామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ, సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమ లేని రాముడి కోవెల హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు. విదేశీ మెచ్చుకోలు క్రీ.శ. 1652లో భారత యాత్ర చేసిన టావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు భారత దేశంలోని గొప్ప (పెద్దదైన) ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటి అని మెచ్చుకుని ప్రశంసించారు. ఇది అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారు. వెన్నెల్లో కల్యాణం శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ, భరత, శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం. రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట చెరువు జిల్లాలోని పెద్ద చెరువులలో ఒంటిమిట్ట చెరువుకు ప్రత్యేకత ఉంది. ఒంటిమిట్టకు వచ్చిన వారితోపాటు ఆ రోడ్డున వెళ్లే వారు ఈ చెరువును చూసే ఉంటారు. మెయిన్రోడ్డునుంచి కనుచూపుమేర విశాలంగా కొండల వరకు విస్తరించి ఉన్న ఆ చెరువుకు గొప్ప చరిత్ర ఉంది. కడప కైఫీయత్తుల సమాచారం మేరకు .. 1340లో కంపరాయులు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైన ఉదయగిరికి పాలకుడిగా ఉన్నారు. తన పరిధిలోని ప్రాంతమంతా స్వయంగా పర్యటిస్తూ అవసరమనిపించిన చోట దేవాలయాలు, చెరువులు నిర్మింపజేశారు. ఆయన నిర్మించిన చిట్వేలి చెరువు వద్దగల కంపసముద్రం అగ్రహారం, నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం తదితర ప్రాంతాలు నేటికీ ఆయన పేరుతోనే ఉన్నాయి. తన పాలనలో ఆయన అటు ఆధ్యాత్మిక, ఇటు సామాజిక సేవలు అందించారు. ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి, ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు. గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద, చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు. కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది. పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు, లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కల్యాణ వేదికపై కల్యాణం నిర్వహిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కల్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు. రామయ్య రథం కథ ఇదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. 1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు, ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసింది. ఆయన వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాలను గమనించారు. రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యల రాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. ► అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారా లు చెబుతున్నాయి. రామాభ్యుదయం కా వ్యం ఆయన కలం నుంచి జాలువారింది. ► బమ్మెర పోతనామాత్యుడు మహాకవి. భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు. ► వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ► కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. ► వర కవి నల్లకాలువ అయ్యప్ప, ఉప్పు గొండూరు వెంకట కవి, మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. రాచరికం.. రాజసం క్రీ.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సోదరుడు కంపరాయులు ఉదయగిరిని పాలిస్తూ ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవారు. వీరిద్దరు రాజులతో పాటు ఆయన వెంట వచ్చిన బృందానికి వసతి కల్పించారు. వారిద్దరు చెరువు, రామాలయం నిర్మించాలని కంప రాయులను అడిగారు. వారి కోరిక మేరకు వాటిని నిర్మించేందుకు ఆయన కృషి చేశారు. ఒంటడు, మిట్టడు కట్టిన ఆలయం కనుక ఈ ఆలయానికి ఒంటిమిట్ట కోదండరామాలయం అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది. ► క్రీ.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం, ఎదుర్కోలు మండపాలు, ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. -
ఒంటిమిట్ట : రమణీయం రాములోరి కల్యాణం
-
ఏదీ ముందుచూపు!
సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నా..ఎప్పటికప్పుడు నిర్వహణ లోపం, ముందుచూపులేని వ్యవహారం బయటపడుతూనే ఉంది. ఒక్క అభివృద్ధి విషయంలోనే కాకుండా పనుల విషయంలో కూడా లోటుపాట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. శుక్రవారం కల్యాణోత్సవ సందర్భంగా రెండు గంటలపాటు కురిసిన వర్షం, వడగండ్ల వాన, గాలులుకు షెడ్లు కూలిపోయిన తీరు చూస్తే పనులు అంతంతమాత్రంగా చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ మూడేళ్లుగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కల్యాణం జరిపిస్తున్నా.. ఒక్క కల్యాణమండపం తప్ప పక్కన సువిశాల మైదానంలో హాలులాగా శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టి ఉండవచ్చు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ పట్టించుకోకపోవడంతో ప్రతిసారి అప్పటికప్పుడు హడావుడి చేసి తర్వాత వదిలేస్తున్నారు. ప్రతిసారి కల్యాణం కోసమే రూ.3కోట్ల మేర ఖర్చుచేస్తున్నా శాశ్వత నిర్మాణ విషయంలో ఆలోచన చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. అంతంతమాత్రంగానే పనులు: టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా ఇప్పటికీ ముందుచూపు లేదనే విషయం శుక్రవారం మరోమారు స్పష్టమైంది. డెకరేషన్ లైటింగ్ సిస్టమ్‌తోసహా చలువ పందిళ్లు, ఫోకస్ లైట్ల స్తంభాలు కూలిపోవడం చూస్తే చేసిన పనులను కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు. చలువ పందిళ్లంటే రేకుల షెడ్లా? సాధారణంగా పూర్వకాలం నుంచి కూడా చలువ పందిళ్లంటే తడికెలతో పందిళ్లు వేసి, పైన షామియానా వేసినా సమస్య ఉండదు. అలాకాకుండా ఆలయం చుట్టుపక్కలతోపాటు కల్యాణ వేదిక వద్ద కూడా రేకులతోనే చలువ పందిళ్లు వేశారు. వడగండ్ల వాన, గాలుల ధాటికి రేకులు ఎగిరిపడుతూ వస్తున్న వైనం భక్తులను బెంబేలెత్తించింది. ఒకపక్క వడగండ్ల వాన రేకులపై పడుతున్నప్పుడు వస్తున్న శబ్దాలు, మరోపక్క జనాలు హాహాకారాలు, బయట కరెంటు లేక అందరూ కల్యాణవేదిక లోపలికి తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. లైట్లు కిందపడిపోయిన నేపథ్యంలో పలుచోట్ల షార్ట్ సర్క్యూట్‌తో పలువురు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ప్రకృతి దెబ్బతో కకావికలమైన ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రం 6.30ప్రాంతంలో ప్రారంభమైన బీభత్సం కొన్ని గంటల్లోనే టీటీడీ చేసిన ఏర్పాట్లను కకావికలం చేసింది. ఆలయ ఆవరణలోనే టెంట్లు కూలిపోయాయి. చెట్లు విరిగిపోయాయి. వెలుగులు లేక ఆలయం మెరుపులు మెరిసిన సమయంలో వెలుగులో మాత్రమే భక్తులకు కనిపించే పరిస్థితి శుక్రవారం రాత్రి ఆవిష్కృతమైంది. వాతావరణశాఖ హెచ్చరించినా... శుక్రవారం సాయంత్రం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా అధికారులు మేల్కొకోకపోవడం కూడా ఘటనకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కనీసం ముందుజాగ్రత్తలు తీసుకుని ఉంటే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలను జాగ్రత్తగా మండపంలో కూర్చోబెట్టి ఎలాగోలా ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుని ఉండవచ్చు. కానీ హెచ్చరికలు చేసినా ఎవరు కూడా వాటిని పట్టించుకోకపోవడం, మెరుపువేగంతో ప్రకృతి బీభత్సం అందరినీ భయపెట్టింది. రచనిపోయిన ఒకరిద్దరిని ఒంటిమిట్ట ఆస్పత్రి ఆవరణంలో దిక్కులేని వారిగా పడేసిన తీరు చూసి పలువురు కంటతడిపెట్టారు. -
ఒంటమిట్ట: అధికారులపై సీఎం అసహనం
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా తీవ్ర అపశ్రుతి చోటుచేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సమయంలో భారీ వర్షం కురువడంతో నలుగురు మృతిచెందారు. మరో 80 మంది దాకా గాయాల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడు–సీతమ్మల వివాహం సందర్భంగా వెలుగులతో కళకళలాడాల్సిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వరుణదేవుడి ప్రతాపానికి అంధకారంగా మారింది. శుక్రవారం ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వెనువెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన మొదలైంది. గంటకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఒకవైపు విపరీతమైన గాలులు, మరోవైపు ఉరుముల శబ్దాలతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఫోకస్ లైట్ల స్తంభాలు, డెకరేషన్ లైట్లతో అలంకరించిన బొమ్మలు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. చలువ పందిళ్లకు వేసిన టెంట్లు, రేకులు కూడా లేచిపోయాయి. వడగండ్లు రేకులపై పడుతుండడంతో భక్తులు భయకంపితులయ్యారు. కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న వేపచెట్లు నేలకూలగా, అక్కడే ఉన్న చలువ పందిరి కూలిపోయింది. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో అంధకారం నెలకొంది. ప్రాణాలు తీసిన లైట్లు: ఆలయ సమీపంలో కల్యాణోత్సవం వేదిక రేకులు కూలిపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. బద్వేలు ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య(48) మృతి చెందాడు. ఫోకస్ లైట్లు మీద పడడంతో పోరుమామిళ్లకు చెందిన చెంగయ్య(70) అనే వృద్ధుడు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఒంటిమిట్టకు చెందిన వెంకట సుబ్బమ్మ(65) అనే భక్తురాలు దక్షిణ గోపురం వద్ద కొయ్యలు మీదపడటంతో మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి చెందిన మీనా(45) రాములోరి కల్యాణానికి వచ్చి గాయపడి, తుదిశ్వాస విడిచారు. వడగళ్ల వానకు రేకులు గాలికి లేచి పడడం, విరిగిన చెట్లు తగలడం, డెకరేషన్ లైట్లు మీదపడడం వంటి కారణాలతో దాదాపు 80 మంది గాయపడ్డారు. అందులో 25 మందిని కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐదుగురిని తిరుపతికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 సమయంలో విద్యుత్ నిలిపివేయడంతో అప్పటి నుంచి రాత్రి 9.30 వరకు ఆలయం అంధకారంలోనే ఉండిపోయింది. -
నయనానందం.. కోదండ రాముని రథోత్సవం
భారీగా తరలి వచ్చిన భక్తజనం ఒంటిమిట్ట : వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతంగా కోదండరాముడు రథంపై పుర వీధుల్లో ఊరేగారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై విగ్రహాలను ఆశీనులను చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. తూర్పు ద్వారం నుంచి మొదలైన రథోత్సవం మెయిన్ బజారు వద్దకు చేరుకున్న తర్వాత కాసేపు విశ్రాంతి ఇచ్చారు. తిరిగి సాయంత్రం మొదలైన రథోత్సవం భక్తుల జయ జయధ్వానాల మధ్య రథశాలకు చేరుకుంది. ప్రత్యేక పూజల అనంతరం సీతా లక్ష్మణ సమేత రాముల వారి ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి తీసుకెళ్లారు. -
ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి కల్యాణం
♦ ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి కల్యాణం ♦ తరలివచ్చిన భక్త జనం ♦ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం చంద్రబాబు ♦ కనులముందే వైకుంఠం ఆ ప్రాంగణం అపర వైకుంఠం.. ఆ వేదిక మణిమయ స్వర్ణ కిరీటం.. ఆ ఘట్టం ఒంటిమిట్ట రామయ్య కల్యాణం.. ఆ ఉత్సవం అత్యంత వైభవం.. అపర అయోధ్య ఒంటిమిట్ట గురువారం సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించింది. రామయ్య చల్లని చూపుల పందిట్లో కల్యాణ వేదిక మణి కిరీటంలా ధగధగలాడింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరాముడు శ్రీ మహాలక్ష్మి సీతమ్మ వధూవరులుగా పెళ్లిపీటలపై కొలువయ్యారు. పున్నమి చంద్రుని సాక్షిగా జరిగిన ఈ కల్యాణం అత్యంత వైభవంగా సాగింది. ఏకశిలా నగరం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన శ్రీ సీతారామ కల్యాణాన్ని భక్తులు కన్నార్పకుండా తిలకించి పులకించిపోయారు. కల్యాణ మూర్తులను దర్శించుకుని జన్మధన్యమైందని పరవశించారు. ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం గురువారం రాత్రి నిండు వెన్నెలలో అంగరంగ వైభవంగా సాగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన ఎదుర్కోలు సన్నివేశం భక్తులను అలరించింది. శ్రీరాముని ఔన్నత్యం, ఆయన ఆదర్శ మూర్తి ఎందుకయ్యారో విశదపరుస్తూ వ్యాఖ్యానం సాగుతుండగా, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణ తంతు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. కళ్లు మిరుమిట్లు కొలిపేలా బయట బాణాసంచ కాంతులీనుతుండగా, వేలాది మంది భక్తుల రామనామస్మరణ మధ్య కన్యాదానం, మాంగల్యధారణ కన్నుల పండువగా సాగింది. ఆ కల్యాణ వైభవాన్ని తిలకించడానికి రెండు కళ్లూ సరిపోలేదనడం అతిశయోక్తి కాదు.శ్రీసీతారామ కల్యాణం.. చూచు వారలకు చూడముచ్చటగా సాగింది. కడప కల్చరల్ : శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. అంతకు ముందు ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని ఉల్లాస భరితంగా నిర్వహించారు. అనంతరం ఆలయం పక్కనే గల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ పందిళ్ల కింద ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వివాహ వేదికపైకి కల్యాణ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను అందజేశారు. టీటీడీ ఈఓ సాంబశివరావు కూడా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం టీటీడీ నుంచి వచ్చిన ప్రత్యేక వేద పండితుల బృందం ఆధ్వర్యంలో కల్యాణ క్రతువులను క్రమంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, ప్రవరలు, కన్యాదానం ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి మహా మాంగల్యాన్ని భక్తజనులకు దర్శింపజేసి వేద పండితులే స్వామి పక్షాన అమ్మవారి దివ్య గళసీమలో అలంకరించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ కల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రులు మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పరిటాల సునీత , దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్, కమిషనర్ అనూరాధ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, మండలి డిప్యూటీచైర్మన్ సతీష్‌రెడ్డి, ఆలయ ఈఓ, ఇన్‌ఛార్జి ఏసీ శంకర్‌బాలాజీ, కలెక్టర్ కేవీ రమణ, ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ, స్థానిక నాయకులు, జిల్లా ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. కాగా కల్యాణోత్సవానికి జనం భారీగా హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు హాజరు కావడంతో కల్యాణ వేదిక కిటకిటలాడింది. ఆలయ మాడ వీధులన్నీ జనసంద్రంగా మారాయి.