సాక్షి, వైఎస్ఆర్: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. పండు వెన్నెల్లో కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. వరి గింజల కంకులు, ఫల పుష్పాలతో శోభాయమానంగా కల్యాణ వేదికను అలంకరించారు.
ఒంటిమిట్టలో కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం ఉదయం శివ ధనుర్భంగా లంకారములో, పురవీధుల్లో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు ఊరేగాడు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భక్త జన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపులో.. టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరోవైపు శ్రీరామ నవమికి కాకుండా.. సీతారామ కల్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో చైత్ర పౌర్ణమి రోజు, పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. శ్రీరామనవమి రోజు జరిపించాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడట.అందుకే తన కళ్యాణ వేడుకను చంద్రుడు తిలకించేలా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుందని వరమిచ్చాడని కథనం. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా... రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు.
ఒంటిమిట్ట ప్రత్యేకత ఇదే
జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. శ్రీ రామచంద్రుడిపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment