విద్యుద్దీప కాంతుల మధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం
ఏకశిలానగరం.. కానీ ఓరుగల్లు కాదు..తెలుగునాట సీతారామలక్ష్మణులు కొలువుదీరిన పుణ్యధామం.. కానీ భద్రాద్రి కాదు వాల్మీకి రామాయణంలో కనిపించనిది.. వెన్నెల వెలుగుల్లో మురిపించేది.. ఒకే క్షేత్రం. అదే ఒంటిమిట్ట! ఆంధ్రప్రదేశ్‌లో అపర భద్రాచలంగా పేరొందిన ఈ దివ్యక్షేత్రం సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది.
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లాలో ఉంది ఒంటిమిట్ట. చుట్టూ కొండలు, పచ్చని పంటపొలాల మధ్యలో ఉంటుంది ఇక్కడి కోదండ రామాలయం. అపురూప శిల్పసంపదతో అలరారుతున్న ఈ దేవాలయ నిర్మాణంలో చోళరాజులు, విజయనగర రాజులు, మట్లి రాజుల కళా వైభవం కనిపిస్తుంది. రాజగోపురాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయ మంటపంలోని ప్రతి స్తంభం ఒక కళా రూపాన్ని ప్రదర్శిస్తుంది.
చతుర్థశి నాడు.. పున్నమి వెలుగుల్లో కల్యాణం
ఏకశిలానగరి కోదండ రామాలయంలో శ్రీ రామనవమి రోజు కాకుండా పండు వెన్నెల రోజు సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఆ మేరకు బుధవారం రాత్రి రామయ్య పెళ్లి జరగనుంది. చిన్నతనం నుంచి దాశరథికి ‘చంద్రుడు’ అంటే ఇష్టం. చిరుప్రాయంలో ఆకాశంలో చంద్రున్ని చూపిస్తేనే ఆహారాన్ని ఆరగించేవాడు. రఘురాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో విళంబినామ సంవత్సరంలో జన్మించాడు. ఆయన వివాహ మహోత్సవాలు అన్ని ఆలయాల్లోనూ నవమి నాడే అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. భద్రాచలం రామక్షేత్రంలో, తిరుపతి కోదండ రామాలయంలోనూ దాదాపు అన్ని చోట్ల చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవమి నాటి కల్యాణంతో ముగుస్తాయి. ఇలా అనేక చోట్ల పగలు రామయ్య పెళ్లి జరిగితే ఒక ఒంటిమిట్టలోనే రాత్రి వేళ నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. ఆలయ దివ్య దర్శనం ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది.
► కోదండ రాముడు సూర్య వంశీయుడు. స్వయంప్రతాపం కలిగినవాడు. శత్రువులు కన్నెత్తి చూడజాలని తేజం ఉన్న వాడు. ప్రజల్ని కన్నబిడల్లా చూడాలంటే ఆయన ముఖంలో వెన్నెల కురవాలి. ప్రసన్నత, చల్లదనం కావాలి. ప్రజల్ని చల్లగా పాలించి శ్రీరాముడు శ్రీ రామచంద్రుడయ్యాడు. తన పేరు శ్రీరాముడికి తోడైనందుకు చంద్రుడు ఉబ్బిపోయేవాడు. దేశమంతటా జరిగే శ్రీరామ బ్రహ్మోత్సవాల్లో శ్రీరాముడి కల్యాణాన్ని చూసే అవకాశం చంద్రుడికి లేకుండా పోయింది. బ్రహ్మోత్సవాలకు అధినాయకుడైన బ్రహ్మకు తన ఆవేదనను నివేదించుకొన్నాడు. ఆమేరకు బ్రహ్మ ఏకశిలానగరిని వేదికగా నిర్ణయించాడు. చతుర్థశి రాత్రి కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడు.
మోహినీ అలంకారంలో జగన్మోహనుడు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు మంగళవారం ఉదయం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడికి అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ జరిపారు. రాత్రి 7 గంటల నుంచి నృత్యాలు, కోలాటాలు, భజనల నడుమ గరుడ సేవ కనుల పండువగా సాగింది. రామయ్య పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమం ఆలయ టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది.
నేడు ట్రాఫిక్ మళ్లింపు
ఒంటిమిట్ట/కడప అర్బన్: ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లిస్తామన్నారు.
కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి జంక్షన్ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి.
తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి.
రాజంపేట వైపు వెళ్లే భారీ వాహనాలు రాయచోటి మీదుగా వెళ్లాలి.
రాజంపేట నుంచి వచ్చే ద్విచక్రవాహనాలను సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా దారి మళ్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment