నయనానందం.. కోదండ రాముని రథోత్సవం
- భారీగా తరలి వచ్చిన భక్తజనం
ఒంటిమిట్ట : వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతంగా కోదండరాముడు రథంపై పుర వీధుల్లో ఊరేగారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై విగ్రహాలను ఆశీనులను చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
తూర్పు ద్వారం నుంచి మొదలైన రథోత్సవం మెయిన్ బజారు వద్దకు చేరుకున్న తర్వాత కాసేపు విశ్రాంతి ఇచ్చారు. తిరిగి సాయంత్రం మొదలైన రథోత్సవం భక్తుల జయ జయధ్వానాల మధ్య రథశాలకు చేరుకుంది. ప్రత్యేక పూజల అనంతరం సీతా లక్ష్మణ సమేత రాముల వారి ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి తీసుకెళ్లారు.