♦ ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి కల్యాణం
♦ తరలివచ్చిన భక్త జనం
♦ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం చంద్రబాబు
♦ కనులముందే వైకుంఠం
ఆ ప్రాంగణం అపర వైకుంఠం.. ఆ వేదిక మణిమయ స్వర్ణ కిరీటం.. ఆ ఘట్టం ఒంటిమిట్ట రామయ్య కల్యాణం.. ఆ ఉత్సవం అత్యంత వైభవం.. అపర అయోధ్య ఒంటిమిట్ట గురువారం సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించింది. రామయ్య చల్లని చూపుల పందిట్లో కల్యాణ వేదిక మణి కిరీటంలా ధగధగలాడింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరాముడు శ్రీ మహాలక్ష్మి సీతమ్మ వధూవరులుగా పెళ్లిపీటలపై కొలువయ్యారు.
పున్నమి చంద్రుని సాక్షిగా జరిగిన ఈ కల్యాణం అత్యంత వైభవంగా సాగింది. ఏకశిలా నగరం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన శ్రీ సీతారామ కల్యాణాన్ని భక్తులు కన్నార్పకుండా తిలకించి పులకించిపోయారు. కల్యాణ మూర్తులను దర్శించుకుని జన్మధన్యమైందని పరవశించారు.
ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం గురువారం రాత్రి నిండు వెన్నెలలో అంగరంగ వైభవంగా సాగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన ఎదుర్కోలు సన్నివేశం భక్తులను అలరించింది. శ్రీరాముని ఔన్నత్యం, ఆయన ఆదర్శ మూర్తి ఎందుకయ్యారో విశదపరుస్తూ వ్యాఖ్యానం సాగుతుండగా, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణ తంతు భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది.
కళ్లు మిరుమిట్లు కొలిపేలా బయట బాణాసంచ కాంతులీనుతుండగా, వేలాది మంది భక్తుల రామనామస్మరణ మధ్య కన్యాదానం, మాంగల్యధారణ కన్నుల పండువగా సాగింది. ఆ కల్యాణ వైభవాన్ని తిలకించడానికి రెండు కళ్లూ సరిపోలేదనడం అతిశయోక్తి కాదు.శ్రీసీతారామ కల్యాణం.. చూచు వారలకు చూడముచ్చటగా సాగింది.
కడప కల్చరల్ : శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. అంతకు ముందు ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని ఉల్లాస భరితంగా నిర్వహించారు. అనంతరం ఆలయం పక్కనే గల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ పందిళ్ల కింద ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వివాహ వేదికపైకి కల్యాణ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
టీటీడీ ఈఓ సాంబశివరావు కూడా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం టీటీడీ నుంచి వచ్చిన ప్రత్యేక వేద పండితుల బృందం ఆధ్వర్యంలో కల్యాణ క్రతువులను క్రమంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, ప్రవరలు, కన్యాదానం ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి మహా మాంగల్యాన్ని భక్తజనులకు దర్శింపజేసి వేద పండితులే స్వామి పక్షాన అమ్మవారి దివ్య గళసీమలో అలంకరించారు.
దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ కల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రులు మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పరిటాల సునీత , దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్, కమిషనర్ అనూరాధ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, మండలి డిప్యూటీచైర్మన్ సతీష్‌రెడ్డి, ఆలయ ఈఓ, ఇన్‌ఛార్జి ఏసీ శంకర్‌బాలాజీ, కలెక్టర్ కేవీ రమణ, ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ, స్థానిక నాయకులు, జిల్లా ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. కాగా కల్యాణోత్సవానికి జనం భారీగా హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు హాజరు కావడంతో కల్యాణ వేదిక కిటకిటలాడింది. ఆలయ మాడ వీధులన్నీ జనసంద్రంగా మారాయి.
ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి కల్యాణం
Published Fri, Apr 3 2015 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement