సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నా..ఎప్పటికప్పుడు నిర్వహణ లోపం, ముందుచూపులేని వ్యవహారం బయటపడుతూనే ఉంది. ఒక్క అభివృద్ధి విషయంలోనే కాకుండా పనుల విషయంలో కూడా లోటుపాట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. శుక్రవారం కల్యాణోత్సవ సందర్భంగా రెండు గంటలపాటు కురిసిన వర్షం, వడగండ్ల వాన, గాలులుకు షెడ్లు కూలిపోయిన తీరు చూస్తే పనులు అంతంతమాత్రంగా చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ మూడేళ్లుగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కల్యాణం జరిపిస్తున్నా.. ఒక్క కల్యాణమండపం తప్ప పక్కన సువిశాల మైదానంలో హాలులాగా శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టి ఉండవచ్చు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ పట్టించుకోకపోవడంతో ప్రతిసారి అప్పటికప్పుడు హడావుడి చేసి తర్వాత వదిలేస్తున్నారు. ప్రతిసారి కల్యాణం కోసమే రూ.3కోట్ల మేర ఖర్చుచేస్తున్నా శాశ్వత నిర్మాణ విషయంలో ఆలోచన చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. అంతంతమాత్రంగానే పనులు: టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా ఇప్పటికీ ముందుచూపు లేదనే విషయం శుక్రవారం మరోమారు స్పష్టమైంది. డెకరేషన్ లైటింగ్ సిస్టమ్‌తోసహా చలువ పందిళ్లు, ఫోకస్ లైట్ల స్తంభాలు కూలిపోవడం చూస్తే చేసిన పనులను కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు.
చలువ పందిళ్లంటే రేకుల షెడ్లా?
సాధారణంగా పూర్వకాలం నుంచి కూడా చలువ పందిళ్లంటే తడికెలతో పందిళ్లు వేసి, పైన షామియానా వేసినా సమస్య ఉండదు. అలాకాకుండా ఆలయం చుట్టుపక్కలతోపాటు కల్యాణ వేదిక వద్ద కూడా రేకులతోనే చలువ పందిళ్లు వేశారు. వడగండ్ల వాన, గాలుల ధాటికి రేకులు ఎగిరిపడుతూ వస్తున్న వైనం భక్తులను బెంబేలెత్తించింది. ఒకపక్క వడగండ్ల వాన రేకులపై పడుతున్నప్పుడు వస్తున్న శబ్దాలు, మరోపక్క జనాలు హాహాకారాలు, బయట కరెంటు లేక అందరూ కల్యాణవేదిక లోపలికి తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. లైట్లు కిందపడిపోయిన నేపథ్యంలో పలుచోట్ల షార్ట్ సర్క్యూట్‌తో పలువురు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది.
ప్రకృతి దెబ్బతో కకావికలమైన ఏర్పాట్లు
శుక్రవారం సాయంత్రం 6.30ప్రాంతంలో ప్రారంభమైన బీభత్సం కొన్ని గంటల్లోనే టీటీడీ చేసిన ఏర్పాట్లను కకావికలం చేసింది. ఆలయ ఆవరణలోనే టెంట్లు కూలిపోయాయి. చెట్లు విరిగిపోయాయి. వెలుగులు లేక ఆలయం మెరుపులు మెరిసిన సమయంలో వెలుగులో మాత్రమే భక్తులకు కనిపించే పరిస్థితి శుక్రవారం రాత్రి ఆవిష్కృతమైంది.
వాతావరణశాఖ హెచ్చరించినా...
శుక్రవారం సాయంత్రం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా అధికారులు మేల్కొకోకపోవడం కూడా ఘటనకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కనీసం ముందుజాగ్రత్తలు తీసుకుని ఉంటే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలను జాగ్రత్తగా మండపంలో కూర్చోబెట్టి ఎలాగోలా ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుని ఉండవచ్చు. కానీ హెచ్చరికలు చేసినా ఎవరు కూడా వాటిని పట్టించుకోకపోవడం, మెరుపువేగంతో ప్రకృతి బీభత్సం అందరినీ భయపెట్టింది. రచనిపోయిన ఒకరిద్దరిని ఒంటిమిట్ట ఆస్పత్రి ఆవరణంలో దిక్కులేని వారిగా పడేసిన తీరు చూసి పలువురు కంటతడిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment