కడప రూరల్ : జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానంలో విలీనం చేయాలనుకుంటే గట్టిగా వ్యతిరేకిస్తామని భారతీయ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లపురెడ్డి హరినాథరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించారు.
పైగా తమ పార్టీపైనే ఆరోపణలు చేయడం, దిష్టిబొమ్మలు దహనం చేయడం తగదని హితవు పలికారు. గురువారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానంలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్లు సమాచారం ఉందన్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.
ఇప్పటికే జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన దేవునికడప, గండిక్షేత్రాలు టీటీడీలో విలీనం అయ్యాయన్నారు. అయినప్పటికీ వాటి అభివృద్ధి ఏమాత్రం జరగలేదని తెలిపారు. ఒంటమిట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రపక్షంగా ఉంటూ బీజేపీపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పలు విద్యా సంస్థలను కేటాయించగా, రాష్ర్ట ప్రభుత్వం ఏ ఒక్క విద్యా సంస్థలను నెలకొల్పుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. ఆ పార్టీ నాయకులు రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీతో అన్ని వర్గాల సంక్షేమం జరుగుతోందన్నారు.
ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేస్తే వ్యతిరేకిస్తాం
Published Fri, May 1 2015 5:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement