స్వామి వివేకానంద జన్మ దినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నాము. ఈ పావన భారత దేశంలో వృత్తి ఏదైనా ధార్మికతే అంతస్సూత్రం. ఈ గడ్డ మీద ఎందరో సాధు సంతులు,సన్న్యాసులు జన్మించి జాతికి మార్గదర్శకం చేస్తూ వచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ సర్వోత్కృష్టమైన అన్వేషణలో కపట వేషధారులు. కూడా, తులసి వనంలో గంజాయి మొక్కల్లా పుట్టుకు వస్తున్నారు. అలాంటి కపట వేషగాళ్ళను గురించి శ్రీ ఆది శంకరాచార్యుల. ప్రముఖ శిష్యుడు తోటకాచార్యులు ఇలాగన్నారు. జటిలో ముణ్డీ లుంచిత కేశః కాషాయంబర బహుకృత వేషః పశ్యనపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః
జడలు కట్టిన వెంట్రుకలతో నొకడు, నున్నగా గుండు కొట్టించు కున్నవాడు మరొకడు, కాషాయ వస్త్రాలు కట్టిన వాడు వేరొకడు పొట్ట కోసం వేషాలువేస్తూ అమాయ కులను దోచుకుంటున్నారు. "భగవన్మార్గంలో బూటకము ఎప్పటికీ మంచిది కాదు. బూటకపు వేషధారణ సరి కాదు. మనస్సు వేషానికి తగ్గట్లు లేనట్లయితే అది క్రమేణా పతనం చెందుతుంది" అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస.
సన్న్యాసుల్లో విశిష్టుడు, శ్రేష్టుడు అయిన పరివ్రాజకుడ్ని భారత మాత మనకు ప్రసాదిం చడం మన మహా భాగ్యం. ఒక పర్యాయం భారతీయ సంతు పురు షుడు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం కళాశాల విద్యార్ధులకు భారతీయ సంస్కృ తిని ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలియ జెప్తున్నాడు. భారతీయ సంస్కృతి, ధర్మాలు వైజ్ఞానిక పరమైన సంబంధం ఉందని అతడు చెప్పాడు. అందువలనసంస్కృతిని,ఆధ్యాత్మ కతను విజ్ఞానంతో మేళవించి చూడటం భారత దేశంలో పరిపాటి అన్నాడు. అంతలో ఒక విద్యార్థి అసహనంగా లేచాడు. ఆ విద్యార్ధి వ్యంగ్యంగా ఇలా ప్రశ్నించాడు "మీరు వైజ్ఞానిక దృక్పథం తోనే మీ లక్షీదేవికి వాహ. నంగా గుడ్లగూబను సమకూర్చారా మహా శయా! గుడ్లగూబ పగలు చూడలేదుఅలాంటి పగలు అంధత్వం గల గుడ్లగూబ సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి వాహనం కావ డంలో ఏ విజ్ఞాన తర్కం దాగివుంది?"అది ఆ విద్యార్ధి ప్రశ్న. వెంటనే ఆ సత్పురుషుడు శాంతంగా ఇలా జవాబిచ్చాడు.
"మా బారత దేశవాసులు మీ పశ్చిమ దేశవాసుల్లా ధనమే సర్వ సుఖాలకు మూలం అనుకోరు. అందు వలన ధనం వెంట పడ రాదని మా ఋషి మునులు మా జాతిని హెచ్చరించారు. సంపదలను కొదువ లేకుండా అధర్మంగా సంపాదిస్తే మనిషి గుడ్లగూబలా గుడ్డివాడు అవుతాడు. అంటే కళ్ళు ఉన్నా అతనికి చూపు లోపిస్తుంది.అతడ్నిధనగర్వం అనే అంధకారం ఆవహిస్తుంది. ఆ సంకేతాన్ని ఇవ్వడానికి వైజ్ఞానిక దృక్పదంతో సంపదల అధిదేవత అయిన మా లక్ష్మీ దేవికి గుడ్లగూబ ఉపయుక్తమైన వాహనం అని మా విజ్ఞులు అభిప్రాయ పడ్డారు." ఆ జవాబు విన్న సభా సదుల కరతాళ ధ్వనులతో సభమార్మ్రోగింది. ఆ తరువాత ఆ స్వామి ఇలా అన్నారు.
"మా దేవి సరస్వతి జ్ఞాన విజ్ఞానాలకు ప్రతీక. మనుషుల్లో జ్ఞానాన్ని, విజ్నానాన్ని జాగృతం చేస్తుంది సరస్వతి. అందువల్ల సరస్వతీ దేవి వాహనంగా హంసను ఎన్ను కున్నారు. పాల నుంచి నీటిని వేరుచేయగల సామర్ధ్యం ఒక్క హంసకే ఉంది. ఇప్పుడు మీరు బాగా అర్ధం చేసుకుని ఉంటారు. మా సంస్కృతి, ధర్మం పూర్తిగా వైజ్ఞానిక పరమైనది" అతని తర్కయుక్తమైన సమాధానం వారి జిజ్ఞాసను శాంత పరిచింది. ఆ సత్పురుషుడు వేరెవరో కాదు స్వామి వివేకానంద. అతని గురించి తెలియని భారతీయుడు లేడు. అతని గురించి తెలియని విదేశీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు.
ఒక మారు జాతిని ప్రభోధిస్తూ వివేకా నంద భావ ప్రచారమే మన కర్తవ్యం అన్నారు. ఆ సందేశాన్ని అతని మాటల్లోనేచెప్పుకోవాలి. "నేనొక నూతన ఆశయాన్ని ఇస్తున్నాను. దాన్ని సాధించగలిగితే మిమ్మల్ని ధీరులు గాను, సేవానిరతులుగాను గుర్తిస్తాను. ఒక సంఘటితమైన ప్రణాళికను తయారు చేయండి. నిరక్షరాస్యులు, నిరుపేదలెందరో ఉన్నారు. సాయంకాలమో, మధ్యాహ్నమో లేక మరి యే ఇతర సమయంలోనో వారి గుడిసె గుడిసకు వెళ్ళి వారికి ఖగోళశాస్త్రము, భూగోళశాస్త్రము మున్నగు వాటికి సంబంధి చిన చిత్రపటాలను చూపి ఆ తరువాత శ్రీ రామకృష్ణుల గురించి బోధించండి. వివిధ దేశాల్లో ఏం జరిగిందో లేక ఏమి జరుగుతోందో ఈ లోకం ఎలా ఉందో మొదలైన విషయాలను తెలిపి వారి కళ్ళు తెరిపించండి. ఈ పని మీరు చేయగలరా? రండి! కార్య సాధనకు కంకణం కట్టుకొండి. కబుర్లు చెప్తూ కార్యకలా పాలు ఆచరించే కాలం గతించింది. ప్రస్తుతం కార్యరంగం లోనికి దిగి పని చేయాలి. యువకులై, ఉత్సాహవంతులై, బుద్ధిమంతులై ధీరులై మృత్యుగహ్వరంలోనికి చొరపడడానికి, సముద్రాన్ని ఎదురీదడానికి సంసిద్ధులై సంచరించండి "
జననం 1863 జనవరి 12 న కలకత్తాలో విశ్వనాథ దత్తు, భూవనేశ్వరి దంపతులకు ముద్దు బిడ్డగా నరేంద్రుడు జన్మించాడు. అతని సోదరుడైన భూపేంద్రనాథ్ దత్తు ధైర్య సాహసాలు, ఏకాగ్రత, మేథ, నిర్బయత్వం, వాదనాపటిమ వంటి సద్గుణాలను పుణికి పుచ్చుకున్నాడు.విదేశీ పాలకుల పాలనను ద్వేషించేవాడు. ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి భారత దేశాన్ని విముక్తి చేయాలని వారికి వ్యతిరేకంగా పోరాడే విప్లవ పోరాట యోధులతో చేతులు కలిపాడు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. చిన్న తనంలో తల్లి నుంచి రామాయణ కథ విన్నాడు. మరి ఆ వంశంలోపుట్టిన నరేంద్రుడు వారిని తీసిపోతాడా? దేముడిని చూడాలన్న ఆకాంక్ష, జ్ఞానులు అజ్ఞానులు ఇలా సర్వులూ
దేముడున్నాడు అని అంటారు. అసలు దేముడున్నాడా? ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలాగుంటాడు అనే ప్రశ్నలు అతని మస్తిష్కాన్ని దొలిచేవి. "మీరు దేముడ్ని చూసారా? పోని దేముడ్ని చూసిన వ్యక్తిని నాకు చూపగలరా?" అని ఎందరెందరినో అడిగాడు. దేముణ్ణి చూసిన వ్యక్తి ఆ బాలుడికి తారసపడలేదు. ఒక ప్రక్క ఆధ్యాత్మికత వేరొక వంక హేతువాదం. దేముడి ఉనికినే సందే హించేవాడు నరేంద్రుడు.
సందేహ నివృత్తి..
1881లో దక్షిణేశ్వరం కాళికాలయంలో అతను శ్రీ రామకృష్ణ పరమహంసను దర్శించి అతని వద్ద అదే ప్రశ్న వేసాడు. రామకృష్ణ పరమహంస జవాబు విని విస్మయం చెందాడు "మీరు దేముణ్ణి మీ కళ్ళతో స్వయంగా చూసారా!?" అని ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగాడు.
"చూసాను, చూస్తున్నాను. నేను నిన్ను ఇప్పుడే ఏ విధంగా చూస్తున్నానో అంతకు వంద రెట్లు స్పష్టంగా నేను జగన్మాతను చూస్తున్నాను" అని రామకృష్ణులు నరేంద్రతో అన్నారు. నీవు సాధన చేస్తే భగవతితో మాట్లాడగలవు అని విశ్వాసంగా చెప్పారు. శ్రీ రామకృష్ణుల శిష్యత్వాన్ని స్వీకరించాడు. నరేంద్రుడు. అతని శిక్షణలో అపార జ్ఞానాన్ని ఆర్జించాడు.
ఒకనాడు శ్రీ రామకృష్ణ పరమహంస ఒక ఉపదేశం ఇచ్చారు." జీవుల యెడ దయ చూపడానికి నీ వెంతవాడవు? నీవు చేయ గలిగిన దల్లా ఈశ్వర భావంతో సమస్త జీవులను సేవించడమే! మాధవసేవ అంటూ ప్రత్యేకంగా ఏది లేదు మానవసేవయే మాధవ సేవ." అతని ఉపదేశం ఆదేశంగా తోచింది నరేంద్రునికి. వెనువెంటనే శ్రీ రామకృష్ణ మిషన్
స్థాపించే పనిలో నిమగ్నుడయ్యాడు. అతనుపరివ్రాజకుడిగా 1892 లో దేశ సంచారం మొదలు పెట్టాడు. దేశంలో అల్లుకున్న క్షుద్ర మైన పరిస్థితులను నిశితంగా గమనించాడు.
నరేంద్ర దత్తు వివేకానందుడైన తీరు..
పర్యటనలో ఒకనాడు ఖేత్రీ మహరాజును కలిసాడు. అతనే ఈ పేరు మార్పు కోరికను బయటపెట్టాడు. ఆనాటి నుంచి నరేంద్రుడు వివేకానందుడయ్యాడు.
విశ్వమతమహాసభ - వివేకవాణి
చికాగో నగరంలో 11-9-1893 నాడు విశ్వమత మహాసభలు ప్రారంభమయ్యాయి. హిందూ ధర్మ ప్రతినిధిగా ఆ సభలో పాల్గొనే అవకాశం స్వామి వివేకానందకు కలిగింది. వేలాది మంది ఉద్దండులైన విద్యావంతుతో సభా ప్రాంగణం నిండిపోయింది. రోమన్ చర్చి అధ్యక్షులు కార్డినల్ గిబ్బల్స్ అధ్యక్షత వహించారు. చికాగో సభ అనంతరం నేను ఒక ప్రసిద్ధ వ్యక్తిని, వక్తను అయ్యాను అని వివేకానంద చెప్తూ పులకితులయ్యారు. ఆ సభలో ప్రవేశించటానికి ముందు ఆ తరువాత విషయాలు ఆయన ఇలా చెప్పేరు. ఆ. సమ యంలో అతనిమనస్సు ఎంతో డోలాయ మానం అయిందో అతని మాటల్లో ఇలా వ్యక్తమైంది.
"విశ్వమతమహాసభ ప్రారంభోత్సవం నాడు ఉదయం కళామందిరంఅనే సమావేశ స్థలానికి తీసుకు వెళ్ళారు.అక్కడ ఆ సభల కోసం ఒక పెద్ద హాలు మరి కొన్ని చిన్న చిన్న హాలులను రూపొందించారు అన్నిదేశాలవారు అక్కడకు చేరుకున్నారు. భారతదేశం నుంచి బ్రహ్మసమాజానికి చెందిన మజుందారు, బొంబాయికి చెందిన నాగర్కరు, జైన మతం తరుఫున వీర్ చంద్ర గాంధీ, దివ్యజ్ఞాన సమాజం తరుఫున చక్రవర్తి వచ్చారు. వీరిలో మజుందార్తో పూర్వ పరిచయం ఉంది. మిగతా ముగ్గురు అపరిచితులు. చక్రవర్తితో బాటు శ్రీ మతి అనిబిసెంటు వచ్చింది. ప్రేక్షక గేలరీ కిక్కిరిసి నిండి పోయింది. అదొక జన మహా సముద్రం. ఏనాడు బహిరంగ సభలో ప్రసంగించని నేను మహానీయమైన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడమా!
ఉర్రూతలూగించిన ప్రసంగం..
ఒక్కొక్కరు వేదిక మీద కొచ్చి తమ ప్రసంగాలను వినిపిస్తున్నారు. అప్పుడు నా హృదయం దడదడలాడింది. నా నోరు ఎండి పోయింది. ఉదయము సమావేశంలో ప్రసం గించ సాససించలేనంత అధైర్యం నన్ను ఆవహించింది. డాక్టర్ బారోసుగారు. నన్ను పరిచయం చేశారు.సరస్వతీదేవికి ముందుగా మొక్కేను. ఆ తరువాత గురువరేణ్యులు శ్రీ రామకృష్ణులకు మనస్సు లోనే ప్రణమిల్లి నేను క్లుప్తంగానే మాట్లాడేను. ఆ సభ నుద్దేశించి "అమెరికా సోదర సోదరీమణులారా!" అంటూ సంబో ధించాను. రెండు నిమిషాల పాటు హాలు దద్దరిల్లేలా, చెవులు గింగరుమనేలా కరతాళ ధ్వనులు చెలరేగాయి.
ఆ తరువాత నేను చెప్పవలసినది ధైర్యంగా చెప్పాను. ఉపన్యా సం ముగిసే సరికి ఉద్వేగంగా, దాదాపు నిస్త్రాణలతో కూర్చుండి పోయాను. పలు వురు ప్రసంగాలు వ్రాసుకువచ్చి చదివేరు. నేను ముందుగా ఏమి వ్రాసి తెచ్చుకోక అశువుగా చెప్పాను.అందువల్ల చాలామంది విచలితులయ్యారు, విభ్రాంతులయ్యారు. మరునాడు అన్ని వార్తాపత్రికలు ఆనాటి ఉపన్యాసాలన్నింటి లోను నాదే అగ్రగణ్య మైనది అని ప్రకటించాయి.అందులోఒక పత్రిక ప్రచురించిన వార్తాంశం ఇలా ఉంది. 'స్త్రీలు పురుషులు ఎక్కడ చూసినా కిక్కిరిసి ఉన్నారు. వివేకానందుడి ఉపన్యాసం ఆసాంతం గంభీరంగా విన్నారు.' చివరకు మత దురభిమానం గల పత్రికలు కూడా "సుందర వదనుడైన అతడు ఆకర్షణీయమైన వైఖరితో అత్యంత వాగ్ధాటితో విశ్వమత మహాసభలో అందరి కన్న మిన్న అయిన వ్యక్తిగా విరాజిల్లేడు" అని వ్రాసి తమ అంగీ కరాన్ని వెల్లడి చేసాయి.
వివేకానంద అమెరికా నుంచి స్వదేశం వస్తూనే సముద్రపు ఒడ్డున ఇసుకలో పొర్లాడి నేను భోగభూమి నుంచి మన కర్మ భూమి, పుణ్యభూమికి తిరిగి వచ్చాను. నా శరీరం మనస్సులలోని మలినాన్ని తొలగించుకుంటు న్నాను అన్నాడు. దేశంలో ప్రబలిన బలహీనతలను,మూఢా చారాలను, విదేశీ వ్యామోహాన్ని, కుల దురభి మానానలను వీడనాడాలని ప్రబోధించాడు. స్త్రీలను, పేదలను ఆదుకో వలసి ఉందని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని రూపు మాపేందకు దేశవాసులకు పరిశ్రమించాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల వనిత మార్గరెట్ నోబెల్ ను స్వచ్ఛమైన భారతీయ యువతిగా మలచి సోదరి నివేదిత అన్న పేరునిచ్చాడు. వివేకానందుడి అడుగు జాడల్లో నడుస్తూ ఆమె స్త్రీలను విద్యావంతులుగా చేయటంలో బాగా కృషి చేసింది. అనాధ బాల బాలికల కోసం అనేక అనాధాశ్రమాలను నెలకొల్పింది.
శ్రీ రామకృష్ణ సేవా సమాజాన్ని 1897 లో నెలకొల్పారు. మానవసేయే మాధవసేవగా ఆనాటి నుంచి నేటి వరకు ఆ సంస్థలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. హైందవ సంస్కృతి పరంపరలను,ధర్మాన్ని కాపాడడంలోనూ వివేకానందునిది విశిష్టమైన శ్రేణి. అతని వాణి నలు దిక్కులా మ్రోగింది. నిరంతరం పరిశ్రమిచడంవలన అతని ఆరోగ్యం క్షీణించింది. ఆది శంకరాచార్యుల్లా అతను 39 సంవత్సరాల పిన్న వయసులోనే 1902 లో ఈ భౌతిక దేహాన్ని త్యాగించి పరమపధం చేరుకున్నాడు. అయితే వివేకానంద వాణి అమరవాణి.ఇప్పటికీ అది మన మధ్య నుండి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. అతను ఈ పవిత్ర భారత దేశంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి. ఆ క్షితి అపూర్ణీయమైనది. అయితే అతని బాటలో నడుస్తూ అతని సందేశాన్ని ఔదల దాల్చి దరిద్రనారాయుణుల సేవలో నిమగ్నం కావడమే అతనికి మనమిచ్చే మహా నివాళి. ఆ విశిష్ట శ్రేణి ఆ వివేకానంద వాణి అహర్నిశాలు మన మనస్సులో జాగృతమై ఉండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్దించడానికి ఇది తరుణం కాదా?
- గుమ్మా ప్రసాద రావు
Comments
Please login to add a commentAdd a comment