వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..? | Varalakshmi Vratam 2024: Full Guide To Pooja And Significance | Sakshi
Sakshi News home page

వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?

Published Thu, Aug 15 2024 4:52 PM | Last Updated on Fri, Aug 16 2024 7:14 AM

Varalakshmi Vratam 2024: Full Guide To Pooja And Significance

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది.  భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘'వర'అంటే శ్రేష్ఠమైన అని అర్థం కూడా ఉంది.

సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి
శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా

కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. 

ఈ వ్రతం రోజు చదివే వరలక్ష్మీ కథలో.. సాక్షాత్తూ లక్ష్మీ దేవే కలలో సాక్షాత్కరించి, వ్రత విధానాన్ని వివరించడం.. గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది.

పూజా విధానం..
భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.

శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఇంటి ఆచారాన్ని బట్టి కలిశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం లేదా అమ్మవారి ఫొటో లేదా రూపును తెచ్చుకుని పూజించాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.

తోరం తయారు చేయు విధానం..
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

ఆ రోజు వీలుకాకపోతే..
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.
కేవలం వరాల కోసం కాదు..

లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి.

(చదవండి: అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement