కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాలపాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు.
ఎక్కడా కనిపించపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు. అతణ్ని ఎలా వధించారో చెప్పమన్నాడు. కర్ణుణ్ని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు.
అవమానభారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జునుణ్ని అనేక విధాలుగా నిందించాడు. ఎంతో గొప్పదైన గాండీవం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచి పెట్టమని అంటే వాళ్లను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు.
అదొక విషమ సందర్భం. ఆ సమయం లో వారిద్దరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహాపాపంమంటుంది ధర్మం. కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు.
అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మసూక్ష్మం. ఒకరోజు కొందరు వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళారు. కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయిందీ వివరించాడు. దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పనిమూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది.
కృష్ణుడి మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును, తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు పెద్దలను, గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు.
ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండటం వృథా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. వెంటనే శ్రీ కృష్ణుడు అతణ్ని ఆపి ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్యా సదృశమని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తాను చేసిన పాపం బారినుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మసూక్ష్మాలతో మిళితమై ఉంటుంది.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment