ప్రకృతి తీరుతెన్నులను చురుకుగా పరిశీలించే స్వభావం కలవారికి ఎవరికయినా, కలువపూలు వెన్నెలలో వికసిస్తాయనీ, మనిషి మనసుకూ చందమామకూ సంబంధం ఉంటుందనీ మరొకరు చెప్పవలసిన పని ఉండదు. పున్నమి చంద్రుడిని చూస్తే... సముద్రమే పట్టరాని ఆవేశంతో పొంగిపోతుంది. మనిషి మనసూ అంతే. ‘రసమయ జగతిని ఉసిగొలిపే తన మిసమిస’తో నెలరేడు మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపిస్తాడు. మనసు పని తీరును తీవ్రతరం చేస్తాడు. కోరిన దిశలో మరింత వేగంగా నడిపిస్తాడు. భోగులను భోగంవైపూ, యోగులను యోగంవైపూ, భావుకులను భావ తీవ్రతవైపూ, ప్రేమికులను ప్రేమ జ్వరం దిశగానూ, భక్తులను అనన్య భక్తి మార్గంలోనూ నడుపుతాడు. ‘చంద్రమా మనసో జాతంః’ చంద్రుడు విరాట్ పురుషుని మనసు నుండి సృష్టి అయినవాడు అని వేదం. అందుకే కాబోలు మనసుకు పున్నమి చంద్రుడంటే అంత వెర్రి ఆకర్షణ.
అందునా, కార్తీక పూర్ణిమ మరీ అందమైంది. అసలే శరదృతువు. ఆపైన రాతిరి. ఆ పైన పున్నమి. పున్నమి అంటే మామూలు పున్నమి కాదు. పుచ్చ పూవు వెన్నెలల పున్నమి. మనసు చురుకుగా చిందులు వేస్తూ పరవశంతో, రెట్టింపు ఉత్సాహంతో విజృంభించి విహరించే సమయం.
అయితే చిత్త నది ‘ఉభయతో వాహిని’ అన్నారు. అది ‘కల్యాణం’ (శుభం) దిశగానూ ప్రవహించగలదు. వినాశం దిశగానూ ప్రవహించ గలదు. మనస్సు యజమానిగా ఉండి, ఇంద్రియాలను నియంత్రిస్తే, చిత్త నది సరయిన దిశలో ప్రవహించేందుకు అవి సాయపడతాయి. ఇంద్రి యాలు లాక్కెళ్ళినట్టు, మనసు వెళితే ప్రవాహం వినాశం దిశ పడుతుంది.
చదవండి: కార్తీక పూర్ణమి విశిష్టత.. త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారు?
చిత్త నదిని ‘కల్యాణం’ దిశగా మళ్ళించే ప్రయత్నాలకు పున్నమి దినాలు అనువైనవనీ, పున్నములలో కార్తీక పూర్ణిమ ఉత్తమోత్తమమనీ భారతీయ సంప్రదాయం. ఈ పుణ్య దినాన చేసిన నదీస్నానాలకూ, తులసి పూజలకూ, జపతప దాన యజ్ఞ హోమాది కర్మలకూ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని నమ్మిక. ప్రాకృతిక కారణాలవల్ల ఈ పర్వదినాన, మనసు మరింత శ్రద్ధా, శుద్ధీ నిలుపుకొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు చేసే ఉపవాసాలూ, శివారాధనలూ, ప్రత్యేక దీపారాధనలూ, దీపదానాలూ, ఆలయాలలో ఆకాశ దీప నమస్కారాలూ, జ్వాలా తోరణ దర్శనాలూ వంటి పర్వదిన విధులు, సత్ఫలాలు కాంక్షించే సజ్జనులకు పెద్దలు చూపిన మార్గం.
కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు!!
– ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment