పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు. మహాకాలుడు అంటే చాలా నల్లనివాడు అని ఒక అర్థం. అలాగే మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం.. అంటే కాలాన్నే శాసించేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విశిష్టత ఏమిటంటే.. తెల్లవారుఝామున జరిగే అభిషేకం. అది భస్మాభిషేకం. ఆ భస్మం చితాభస్మం. అంటే మహాకాలేశ్వరుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం. దీనికే భస్మహారతి అని పేరు. తెల్లవారుఝామున 3.30 గంటలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు. అదీ ప్రత్యేక వస్త్రధారణతో మాత్రమే. సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు, దీర్ఘరోగాలతో బాధపడేవారు, అంతుచిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని, ఉపశమనం పొందుతుంటారు.
నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిని పూర్వం అవంతీ నగరమనేవారు. సప్తమహానగరాలలో అవంతీనగరం కూడా ఒకటి. ఈ ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళికాదేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జయినీ నగరానికి వెళితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని, అటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళిని కూడా సందర్శించి నేత్రపర్వాన్ని పొందవచ్చు.
స్థలపురాణం
ఉజ్జయినీ నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నలుగురు కొడుకులూ తండ్రికి తగ్గ పుత్రులు. ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడుండేవాడు. వాడు ఋషి పుంగవుల జపతపాలకు, వైదిక ధర్మానుష్టానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దూషణుడు ఉజ్జయినీ పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు. అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమీ పట్టకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని, శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు.
దూషణుడు ఒకనాడు వేదప్రియుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. వేదప్రియుడి భక్తితత్పరతలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అసహాయులైన, దీనులైన తనవంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు. ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగస్వరూపుడిగా ఉజ్జయినీ క్షేత్రంలో కొలువుదీరాడు.
మరో గాథ
ఉజ్జయినీ రాజ్యాధిపతి చంద్రసేనుడు ఒకరోజు శివపూజ చేస్తుండగా శ్రీకరుడనే గోపాలుడు అక్కడికి వచ్చాడు. చంద్రసేనుడి శివార్చనా విధానాన్ని గమనించి తానూ అలాగే స్వామికి పూజ చేయాలని భావించిన శ్రీకరుడు, దారిలో ఒక రాతిముక్కను తీసుకుని దాన్నే శివలింగంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజించసాగాడు.
ఆ బాలుడు పూజలో నిమగ్నమై ఒక్కోసారి బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. తల్లి ఎంత పిలిచినా పలికేవాడు కాదు. ఒకరోజు పూజలో లీనమై బాహ్యస్మృతి మరిచిన శ్రీకరుని దగ్గర నుంచి అతను శివలింగంగా భావిస్తున్న రాతిముక్కను అతని తల్లి తీసిపారేసింది. స్మృతిలోకి వచ్చిన బాలుడు తల్లి చేసిన పనికి చింతస్తూ శివుణ్టి వేడుకుంటూ ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు అతన్ని కరుణించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.
భస్మాభిషేకం
ఉజ్జయినీ మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడి విశిష్టత. చితాభస్మం సాధారణంగా అమంగళకరమైనా, స్వామిని తాకడం వల్ల అతి మంగళప్రదమైనదిగా మారుతోంది. భస్మ హారతితోబాటు మరోవిధమైన అర్చన కూడా కాలేశ్వరుడికి జరుగుతుంది. ఇది భస్మాభిషేకం. ఆవుపేడను కాల్చి బూడిద చేసి, మూటగట్టి, దానిని శివలింగం పై భాగాన వేలాడదీసి, అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు.
అప్పుడు భస్మం మహాకాలుడి మీదనేగాక, మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ ఢమరుకం, మృదంగం, భేరీలు మోగిస్తూ, శంఖనాదాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తూ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికానుభూతి కలుగుతుంది.
ఇతర విశేషాలు
మహాకాళేశ్వరాలయం నేటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షి్ర΄ా(శి్ర΄ా)నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 సాధారణ తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండాలు ఉన్నాయి. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్థులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలేశ్వర లింగం. ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. మహాకాలేశ్వరుడి విగ్రహం పైన ఓంకారేశ్వర లింగం ఉంటుంది. ఆ పైన ఉండేది నాగచంద్రేశ్వర లింగం. ఆలయంలో గణపతి, ΄ార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పుగోడలపై ఉంటాయి. దక్షిణభాగంలో మహాదేవుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. మహాకాలేశ్వరలింగం స్వయంభూలింగం. ఇది అత్యంత ్ర΄ాచీనమైనది. సృష్టి ్ర΄ారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలునిగా కొలువు తీరి ఉండమని ్ర΄ార్థించాడట. బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణగాథలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండదీ΄ాలని పిలుస్తారు.
కాలభైరవాలయం
ఉజ్జయిని వెళ్లినవారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని సందర్శించుకుని, అటు పిమ్మట మహాకాళికా లేదా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆచారం. కాగా కాలభైరవుడి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేయడం, మామూలుగా గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్లుగా కాలభైరవుడి ఆలయానికి వెళ్లే భక్తులు మద్యం, కల్లు సీసాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆచారం. కాలభైరవార్చన విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది.
ఎలా వెళ్లాలంటే..?
హైదరాబాద్‌నుంచి ఉజ్జయినికి నేరుగా రైళ్లున్నాయి. లేదంటే పూణే వెళ్తే అక్కడినుంచి కూడా ఉజ్జయినికి రైళ్లుంటాయి. హైదరాబాద్‌నుంచి జైపూర్‌ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ ఎక్కితే సుమారు 19 గంటల్లో ఉజ్జయినిలో దిగవచ్చు. చవకగా, తొందరగా వెళ్లగలిగే మార్గాలలో అది ఒకటి. ఇంకా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా వెళ్లవచ్చు. విమానంలో అయితే హైదరాబాద్‌నుంచి పూణే లేదా ఇండోర్ వెళ్తే అక్కడినుంచి ఉజ్జయినికి రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.
– డి. పూర్ణిమాభాస్కర్
(చదవండి: దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment