కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దీపం,దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పవిత్ర కార్తీకమాసంలో పౌర్ణమికిచాలా ప్రాధాన్యత ఉంది. చాలా పవిత్రమైంది భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తికపౌర్ణమి ఎపుడు, పూజలు గురించి తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి 2024
ఈ ఏడాది నవంబర్ 15న జరుపుకుంటారు. నవంబర్ 15న ఉదయం 6:19 గంటలకు శుభ సమయం మొదలై నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 వరకు కొనసాగుతుంది.
కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత
కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలన్నీ దీప కాంతులతో వెలుగొందుతాయి. శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుని పీడ తొలగిపోయినందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట.. అందుకే భక్తులు కూడా ఈ విజయాన్ని ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలు , నదీ తీరాల దగ్గర దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పల్లో నేతి దీపాలను వెలగించి నీటిలో వదిలే దృశ్యాలు శోభాయమానంగా ఉంటాయి.
ఈ రోజున విష్ణువు తన మత్స్య (చేప) అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుందని, ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఈ పూర్ణిమ నాడు చేసే పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
“అల్పమపి క్షితౌ క్షిప్తం వటబీజం ప్రవర్ధతే.
జలయోగాత్ యథా దానాత్ పుణ్యవృక్షో ⁇ పి వర్ధతే॥”
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
కార్తీక పూర్ణిమ నాడు పవిత్ర స్నానం , దానం
గంగా , యమునా, కృష్ణ లాంటి వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను ఆ దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. సంవత్సరమంతా పూజలు చేయకపోయినా, కార్తీకమాసం అంతా దీపారాధన చేయలేనివారు కనీసం కార్తీక పౌర్ణమిరోజు భక్తితో ఇలా దీపం ముట్టించి, ఆ దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తీక పురాణం చెబుతోంది.
రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేతి లో నానబెట్టి ఉంచుకున్న 365 వత్తులను వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి అపుడు ఉపవాసాన్ని విరమిస్తారు. దేవాలయాలక, నదీ తీరాలకు వెళ్లలేని వారు ఇంట్లో చక్కగా శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్న తులసమ్మ దగ్గర పున్నమి కాంతుల్లో ఈ దీపాలు వెలిగించి నమస్కరించినా, శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు.
అలాగే కార్తీక పూర్ణిమ నాడు చేసే విరాళం ఈ రోజున అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణులు ,నిరుపేదలకు ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యత చెప్పబడింది. మరికొంతమంది ఈ రోజు కేదారీశ్వరుడిని నోము నోచుకొని అన్నదానం చేస్తారు.
కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ, తులసి పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్వాలా తోరణంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఫలితాలతోపాటు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
Comments
Please login to add a commentAdd a comment