కోటి పుణ్యాల కార్తీక పున్నమి  | Karthika Pournami Special : Highlights Of This Auspicious Day | Sakshi
Sakshi News home page

కోటి పుణ్యాల కార్తీక పున్నమి 

Published Fri, Nov 27 2020 8:39 AM | Last Updated on Fri, Nov 15 2024 7:00 AM

Karthika Pournami Special : Highlights Of This Auspicious Day

కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయితే ఈ మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమి నాటి  పూజకు ఫలితం అధికంమంటారు. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. చంద్రుని కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. అటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.

కారీక్త పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్యస్త్రీలు మంగళ స్నానం ఆచరించి  శుచియైన వస్త్రం ధరించి ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, పార్వతీపరమేశ్వరులకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించాలి. సూర్యోదయానికి పూర్వమే తులసికోట వద్ద 365 వత్తులను ఆవునేతితోగాని, కొబ్బరినూనెతోగాని, నువ్వులనూనెతో గాని తడిపి దీపాలను వెలిగించాలి. అలాగే బియ్యపిండితో చేసిన దీపాలను, ఉసిరికాయ దీపాలను కూడా సమర్పించాలి. పిమ్మట.. 

శివాలయానికి వెళ్ళి గుమ్మడి, కంద దుంప, తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానమిచ్చి, నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాలువలో వదలాలి. ఈవేళ చాలా ప్రాంతాలలో నదీమతల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు. ఈ దృశ్యం అత్యంత మనోహరంగా, కనులకింపుగా వుంటుంది. దీనివల్ల నదీమతల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. 

ఈ దినమంతా ఉపవసించి, సంధ్యాసమయంలో యధావిధిగా తిరిగి స్నానాదులు గావించి, కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి.  పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను ధనం, సౌభాగ్యం, ఆరోగ్యం, యశస్సునిమ్మని ప్రార్థించాలి.  

ఈరోజు శివాలయంలో ఈశ్వరునికి నవరసాలతో, పంచామృతాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. తదనంతరం లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చనలను నిర్వహిస్తారు.  ధాత్రీపూజను కూడా చేస్తారు. ఉసిరి చెట్టు లభ్యం కాకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా తులసి కోటలో వుంచి పూజిస్తే మంచిది. ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకీలోనుంచి ఈ తోరణం నుండి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకీని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ పటాపంచలయి, ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం.

కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి.  ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని నమ్మిక. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాలనుండి భక్తులు వస్తారు.  పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. కార్తీకపౌర్ణమి నాడు కార్తికేయుడు తారాకాసుర సంహారం చేసినట్లు తెలుస్తోంది. అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమినాడు తమిళులు నూత్న వధూవరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి, సువాసినులకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు. దీనివలన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని, తమ కుమార్తె వలన మరొక గృహం కాంతులీనుతుందని నమ్మకం.అత్యంత ఫలప్రదమైన ఈ కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో ఆచరించి మన సంప్రదాయ విధివిధానాలను ముందు తరాలకు పదిలపరచి లోకక్షేమానికి కృషిచేద్దాం.

:::డా. దేవులపల్లి పద్మజ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement