సమ్మోహన స్వరూపుడు | Krishna Janmashtami 2024 | Sakshi
Sakshi News home page

సమ్మోహన స్వరూపుడు

Published Mon, Aug 26 2024 3:37 AM | Last Updated on Mon, Aug 26 2024 9:55 AM

Krishna Janmashtami 2024

నేడు కృష్టాష్టమి పర్వదినం

రూపు నల్లన.. చూపు చల్లన. మనసు తెల్లన... మాట మధురం. పలుకు బంగారం.నవ్వు సమ్మోహకరం. వ్యక్తిత్వం విశిష్టం..ఆ ముద్ర అనితర సాధ్యం. అందుకే...  నమ్మిన వారికి కొండంత అండ. అసలు కృష్ణుడంటేనే సచ్చిదానంద రూపం.. అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..అందుకే ఆ నామం ఆరాధనీయం..  సదా స్మరణీయం.

కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా చతుర్విధ çపురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి.

దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకూ శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా నందన నామ సంవత్సర దక్షిణాయన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. నేడు ఆయన ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా ఓ వ్యాస పారిజాతం. 

చిలిపి కృష్ణునిగా, గో పాలకునిగా, రాధా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టపత్నులకూ ఇష్టుడైన వాడిగా... గోపికావల్లభుడిగా... యాదవ ప్రభువుగా, పార్థుడి సారథియైన పాండవ పక్షపాతిగాను, గీతా బోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, రాజనీతిజ్ఞునిగా... ఇలా బహువిధాలుగా శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం ద్యోతకమవుతుంటాయి. ఎన్నిసార్లు చదివినా, ఎంత తెలుసుకున్నా ఆయన లీలలు మిగిలిపోతూనే ఉంటాయి. 

శ్రీ కృష్ణుడు బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. గోపికల ఇళ్లలో వెన్నముద్దలను దొంగిలించి తినేవాడు. అది చాలదన్నట్టు వారిలో వారికి తంపులు పెట్టేవాడు. అందులోని అంతరార్థమేమిటంటే.. జ్ఞానానికి సంకేతమైన వెన్న అజ్ఞానానికి చిహ్నమైన నల్లని కుండలలో కదా ఉండేది. అందుకే కుండ పెంకులనే అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నమైన వెన్నను దొంగిలించడం ద్వారా తన భక్తుల మనసులో విజ్ఞానపు వెలుగులు నింపేవాడు. 

గోపాలకృష్ణుడు
‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు. 

మోహన కృష్ణుడు
శ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలిపింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. శ్రీకృష్ణుని పూజించేవారికి మాయవలన కలిగే దుఃఖాలు దరిచేరవని అంటారు.

వేణుమాధవుడు
కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...కృష్ణుడికి అర్పించుకోవడం కోసం వేణువు తనను తాను డొల్లగా చేసుకుంటే, ఆ డొల్లలో గాలిని నింపడం కోసం కృష్ణుడు ఎప్పుడూ దానిని తన పెదవుల దగ్గరే ఉంచుకునేవాడు. అందుకే కృష్ణుడి పెదవులు తనను తాకి నప్పుడు పరవశించి మృదు మధురమైన గానాన్ని వినిపిస్తుంది వేణువు. అందుకే నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. – డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement