
భారతదేశం ఎన్నో దివ్య క్షేత్రాలకు, ఎన్నెన్నో దివ్య ధామాలకు నిలయం. ఆ సేతు శీతాచలం అసంఖ్యాకమైన పవిత్ర ఆలయాలు ఈ నేలపై కొలువై ఉన్నాయి. యుగాలు మారినా, తరాలు గడిచినా ఆ ఆలయాల శక్తి ఏ మాత్రం తరగలేదు. ఈ రోజుల్లో ఆలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడిని మొక్కుబడిగా చూసి, కోరికల చిట్టా విప్పడం అనవాయితీగా మారిపోయింది. గుడికి వెళ్లి కూడా అనేకమైన సమస్యల గురించిన చింతను వదలకుండా అదే పనిగా తలుచుకోవడం సామాన్యంగా మారింది. ఆలయాలు మహా శక్తి క్షేత్రాలు. ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు శక్తిని గ్రహించాలి.
దేవుడిని దర్శించడంతో పాటు పరమాత్మ తత్వంతో ఏకీకృతం అయ్యే ప్రయత్నం చేయాలి. భగవద్ తత్వంతో లయం కావాలంటే మొదట మౌన స్థితికి చేరాలి. ఎందుకంటే భౌతిక జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి స్వాంతనను ఇవ్వగలిగే శక్తిని మీరు మౌనం ద్వారా పొందగలరు. మౌనం మీకు సత్య దర్శనాన్ని కలిగిస్తుంది. దివ్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసును ప్రయత్న పూర్వకంగా స్థిమిత పరిచి శక్తిని ప్రోది చేసుకోవాలి. తక్షణమే మీ చింతలు తగ్గి, మనసు మీ అదుపులోకి వస్తుంది. ఎన్ని పనులున్నా కోవెలకు వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ వదిలిపెట్టాలి. ఫోన్ కాల్స్ కానీ, మెసేజీలు కానీ, ఆఫీస్ విషయాలు కానీ, ఇంటి పనులు, ఇతరితర విషయాలన్నీ పక్కన పెట్టి భగవద్ చైతన్యంతో మమేకం కావాలి.
మహిమాన్విత ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు, అక్కడికి చేరడంతోనే మీరు ఎంతో కొంత శక్తిని స్వీకరిస్తారు. అదే గనుక మౌన స్థితిలో ఉండగలిగితే మరింత అద్భుత శక్తిని పొందుతారు. ఆలయాలలో అనేక మాధ్యమాల ద్వారా ప్రసరించే దివ్యశక్తి మీ శక్తి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శక్తి శరీరాన్ని కాంతి శరీరం అని కూడా అంటారు. శక్తి శరీరానికి దివ్య శక్తే ఆధారం. మీరు మౌన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దివ్యశక్తి మీలోనికి అధికంగా ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఋషులు, దేవతలు ప్రతిష్ఠించిన పురాతన ఆలయాల్లో దేవతా శక్తి, ఋషుల తపొశక్తులు రెండూ కలగలిసి ఉంటాయి. ఎన్నియుగాలు గడిచినా ఇటువంటి ఆలయాలలోని శక్తి సంపద చెక్కుచెదరదు. అందుకే వందల సంవత్సరాలుగా భక్తకోటి తరలి వస్తున్నా ఇంకా అదే శక్తి ప్రకంపనలతో ఈ ఆలయాలు అలరారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, భక్తి ప్రపత్తులతో మౌన స్థితో ఉండటం ఉత్తమం.
అవకాశం కుదిరితే కాసేపు ఆ ప్రదేశాల్లో ధ్యానసాధన కూడా చేయండి. భగవంతుడి వద్దకు వెళ్లిన ప్రతిసారీ మీ సమస్యలను గురించో, లేక΄ోతే మీరు పొందాలనుకుంటున్న కోరికల గురించో విన్నవించుకునే బదులుగా, మీకు భగవంతుడు ప్రసాదించిన ఎన్నో వరాలకు భక్తితో కృతజ్ఞతలు తెలిపి, మౌనస్థితికి వెళ్ళండి. మీరు అనుభవిస్తున్న బాధలు, సమస్యలు అన్నీ పరమాత్మకు తెలుసు. అలాగే మీరు ఏమి కోరుకుంటున్నారో కూడా ఆయనకు తెలుసు. భగవంతుడు సర్వాంతర్యామి. మీరు చేయవలసింది భగవంతునికి మీ భక్తిని సమర్పించడం. స్వచ్ఛమైన మనసుతో, మౌనస్థితిలో భగవంతుడి చైతన్యంలో లయమవ్వడం. ఇలా చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలను క్రమక్రమంగా ఓర్పు నేర్పులతో పరిష్కరించుకోగల శక్తి మీకే లభిస్తుంది. దివ్యశక్తి మీతో కలిసి మీ ప్రగతికై పని చేస్తుంది.
– మాతా ఆత్మానందమయి, ఆధ్యాత్మిక గురువు