రవి శంకర్ ప్రసాద్ వివరణ
పార్లమెంటులో రెండోరోజూ దుమారం
మాజీ సీజేఐల రాజీ ఆరోపణలపై విరుచుకుపడ్డ విపక్షాలు
న్యూఢిల్లీ/చెన్నై: అవినీతి ఆరోపణలున్న ఆ మద్రాస్ హైకోర్టు జడ్జిని కొనసాగించడంపై కొలీజియం మొదట్లో తటపటాయించిందని, అయితే, యూపీఏ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి కొనసాగింపునకు సిఫారసు చేసిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. ‘‘2003లో ఆ న్యాయమూర్తిని కొనసాగించేందుకు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. తరువాత యూపీఏ హయాంలో ఆ న్యాయమూర్తిని ఎందుకు కొనసాగించకూడదో వివరణ ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి సందేశం వచ్చింది. అప్పటికీ ఆ న్యాయమూర్తిని కొనసాగించేందుకు సిఫారసు చేయకూడదని కొలీజియం గట్టిగానే ఉంది. అనంతరం న్యాయశాఖ నుంచి రెండు లేఖలు రావడంతో కొనసాగింపునకు అనుకూలంగా కొలీజియ నిర్ణ యం తీసుకోవాల్సి వచ్చింది.’’ అని ప్రసాద్ చెప్పారు. కానీ, ఆరోపణలున్న ఆ జడ్జి మరణించారని, ఆ కొలీజియంలోని న్యాయమూర్తులు రిటైరయ్యారని రవిశంకర్ అన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇకపై ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు.
పార్లమెంటులో రెండోరోజూ దుమారం
జస్టిస్ కట్జూ చేసిన ఆరోపణలపై వరుసగా రెండోరోజు మంగళవారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. అవినీతి జడ్జిని కొనసాగించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన డీఎంకేకు చెందిన ఆ కేంద్ర మంత్రి ఎవరో పేరు బయటపెట్టాలంటూ అన్నాడీఎంకే సభ్యులు లోక్‌సభ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఇదే అంశంపై అన్నాడీఎంకే, డీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదంతో రాజ్యసభ కూడా కాసేపు వాయిదా పడింది. ఈ వ్యవహారంలో నిజమేంటో మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఎవరి ఒత్తిడితోనో.. కరుణానిధి: రాజకీయంగా దుమా రం రేపుతున్న న్యాయమూర్తి కొనసాగింపు అంశంపై డీఎంకే అధినేత ఎం.కరుణానిధి పెదవి విప్పారు. పదేళ్ల కిందటి అంశాన్ని లేవనెత్తడంలో ఉద్దేశమేంటో తెలపాలని జస్టిస్ కట్జూని ప్రశ్నించారు. ఏదో పరోక్ష ఒత్తిడి కారణంగానే కట్జూ ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థలో భాగంగా ఉంటూ అదే వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కట్జూపై మండిపడ్డారు.
పీఎంఓ ఒత్తిడితోనే సీజేఐల ‘రాజీ’
Published Wed, Jul 23 2014 2:42 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement