
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్ నుంచి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులు 70 వరకు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిని ఇన్నాళ్లు ఎందుకు పెండింగ్‌లో ఉంచారని కేంద్రాన్ని ప్రశ్నించింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ సమస్య పరిష్కారానికి అటార్నీ జనరల్ కార్యాలయం చొరవ తీసుకోవాలని పేర్కొంది.
దీనికి అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఏడు రోజులు సమయం అడిగారు. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ స్పందిస్తూ ’’ నేను ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ నన్ను నేను నియంత్రించుకుంటున్నాను. సమస్య పరిష్కారానికి అటార్నీ జనరల్ ఏడు రోజులు మాత్రమే సమయం అడిగారు. నేను ఇప్పటికి మౌనంగా ఉంటున్నారు. వచ్చేసారి ఇక ఊరుకోను.
చదవండి: అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..?
అటార్నీ జనరల్ కార్యాలయమే కేంద్రం దగ్గరున్న పెండింగ్ సిఫార్సుల సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే న్యాయమూర్తుల కొరత అన్నది అతి పెద్ద సమస్య’’ అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కుండబద్దలు కొట్టారు. జడ్జీల నియామకం జాప్యం అవుతున్న కొద్దీ చాలా మంది లాయర్లు తమ దరఖాస్తుల్ని వెనక్కి తీసుకుంటున్నారని, అత్యంత ప్రతిభ కలిగిన లాయర్లు న్యాయమూర్తుల పదవుల్లోకి రాకుండా ఉండడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
‘‘కిందటి వారం వరకు 80 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత 10 మంది నియామకం జరిగింది. ఇప్పుడు పెండింగ్‌లో 70 ఉన్నాయి. వాటిలో 26 న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించినవి. ఒక సమస్మాత్మక హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి నియామకం కూడా ఇంకా పెండింగ్‌లో ఉంది’’ అని జస్టిస్ కౌల్ వివరించారు. న్యాయమూర్తుల నియామకం అంశంలో కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment