సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసులు పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం నిర్ణయించింది. ఆ నలుగురిలో తెలుగు వ్యక్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. సీజేఐ సహా ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జీల్లో ఐదుగురు అత్యంత సీనియర్లు కొలీజియం సభ్యులుగా ఉంటారు.
సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో భేటీ అయిన కొలీజియం.. జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి (ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు సీజే), జస్టిస్ హేమంత్ గుప్తా (మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అజయ్ రస్తోగీ (త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా (పట్నా హైకోర్టు)లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాల్సిందిగా కేంద్రానికి సిఫారసులు పంపాలని నిర్ణయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య 24కాగా, కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే ఆ సంఖ్య 28కి పెరగనుంది.
మెదక్ నుంచి సుప్రీంకోర్టు వరకు..
జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. 1980ల్లో లాయర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2002 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో ఏపీ హైకోర్టు శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. అక్కడే దాదాపు 12 ఏళ్లు పనిచేశారు. 2016 గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. ఇప్పుడు కేంద్రం కొలీజియం సిఫారసులను ఆమోదిస్తే ఆయన సుప్రీంకోర్టు జడ్జి అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment