సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎస్. మురళీధర్‌ను అకస్మాత్తుగా బదిలీ చేసిన తీరుపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. విద్వేషపూరిత ఉపన్యాసంతో అల్లర్లకు కారణమైన బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాపై ఎందుకు కేసు పెట్టరంటూ ఢిల్లీ పోలీసులను నిలదీసినందుకే జస్టిస్ మురళీధర్‌పై వేటు పడిందని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తుండగా, ఆయనను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టు కొలీజియం ఫిబ్రవరి 12వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకే తాము చర్య తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. (రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ)
హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ వ్యవహారాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం చేసే సిఫార్సులను అమలు చేయడానికి సరాసరి నాలుగు నెలల వ్యవధి తీసుకునే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ మురళీధర్ విషయంలో 15 రోజుల్లోగా స్పందించడం ఏమిటన్నది రాజకీయ విశ్లేషకుల మెలిక ప్రశ్న. అందులోనూ ఢిల్లీలో శాంతి, భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉండడం ఎంత వరకు సబబనే కీలకమైన వివాదాంశాన్ని విచారిస్తున్న జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడం ఏమిటన్నది రాజకీయ విశ్లేషకుల విశేష ప్రశ్న. (వాచ్‌మెన్ పారిపోయాడు.. నిప్పు పెట్టారు..)
1987లో హాషింపుర ఊచకోత కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రావిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) శిక్ష విధించినప్పటి నుంచి జస్టిస్ మురళీధర్‌పై బీజేపీ పెద్దలకు ఆగ్రహం ఉందన్నది విశ్లేషకుల ఆరోపణ. ఆ మాటకొస్తే 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు శిక్ష విధించిన జస్టిస్ మురళీధర్‌కు న్యాయవర్గాల్లో నిష్పక్షపాతిగా పేరుంది. అందుకే ఆయన బదిలీపై ఢిల్లీ బార్ అసోసియేషన్ బుధవారం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడానికి 2018, డిసెంబర్‌లో, 2019, జనవరిలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నేతత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం ముందుకు జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయాలంటూ రెండు సార్లు ప్రతిపాదనలు రాగా కొలీజియం సభ్యులు అడ్డుకున్నారు. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతత్వంలోని కొలీజియం సభ్యులు ఆమోదించారు. రాజ్యాంగబద్ధంగా సుప్రీం కోర్టుకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కేంద్రంలోని ప్రభుత్వానికి లోబడి తీర్పులిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని న్యాయ వర్గాలే చెబుతున్నాయి. (సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ)
నాడు ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’ని సమర్థించిన సుప్రీం కోర్టు, వలస పాలన నాటి నుంచి కొనసాగుతున్న ‘దేశ ద్రోహం (సెడిషన్)’ చట్టాన్ని సమర్థించడం, గోవధ చట్టాలను సమర్థించడం, కోహినూరు వజ్రం కంటే ఆవు పేడ ప్రశస్తమైనదని అభివర్ణించడం ఉదాహరణలుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. న్యాయవ్యవస్థ తన ఉనికినే కాపాడుకోలేకపోతే ఎలా అన్నది శేష ప్రశ్న!
Comments
Please login to add a commentAdd a comment