సాక్షి, న్యూ ఢిల్లీ : రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
(చదవండి: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ)
వాస్తవానికి మురళీధర్ బదిలీ గురించి కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 12వ తేదిన సుప్రీంకోర్టు కొలిజీయం ఆయన బదిలీకి ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అప్పటి నుండి ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ దాడులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆయన బుధవారం అర్థరాత్రి తన నివాసంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరును తప్పబట్టారు. ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని కూడా సూచించారు. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది.
కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment