S Muralidhar
-
మై లార్డ్, యువరానర్ అనాల్సిన అవసరం లేదు.. సర్ చాలు!
సాక్షి, భువనేశ్వర్/కటక్: సాధారణఃగా కోర్టుల్లో కేసుల విషయంలో వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ లేదా..యువరానర్’ అని సంభోదిస్తుంటారు. అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్, యువర్ ఆనర్ వంటి సంబోధనలు మినహాయించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్.మురళీధర్ న్యాయవాదులకు విన్నపం చేశారు. సర్ వంటి సాధారణ సంబోధన సరిపోతుందని ఆయన అన్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఈ సందేశం జారీ చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రోజుల్లో సైతం న్యాయవాదులకు ఆయన ఇదే సందేశాన్ని జారీ చేయడం విశేషం. 2006 మే 29 నుంచి 2020 మార్చి 5వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2020లో పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉండే సమయంలో కూడా ఇదే విన్నపం అక్కడి న్యాయవాదులకు విన్నవించడం గమనార్హం. 2020 మార్చి 6 నుంచి 2021 జనవరి 3వ తేదీ వరకు పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా, చీఫ్ జస్టిస్ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మై లార్డ్, లార్డ్‌షిప్, యువర్ ఆనర్, ఆనరబుల్ వంటి సంబోధనలు నివారించాలని 2006లో తీర్మానించింది. చదవండి: వేల సంఖ్యలో కేసులు.. భారత్‌లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్? చీఫ్ జస్టిస్ నిర్ణయం అభినందనీయం.. హైకోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించాల్సిన సంబోధనల పురస్కరించుకుని, ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన సందేశం అభినందనీయమని ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జె.కె.లెంకా తెలిపారు. ఆయన విన్నపం నేపథ్యంలో తోటి న్యాయమూర్తులు ఈ సంస్కరణ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, కోర్టు విచారణకు హాజరయ్యే వ్యక్తులు ఇదే పద్ధతి పాటించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే సంబోధనల నివారణకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హయాంలో బీజం పడిందని సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి 1975 వరకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయమూర్తులను సర్ అని సంబోధించాలని ఫుల్ బెంచ్ అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. -
కీలక నిర్ణయం తీసుకున్న జస్టిస్ మురళీధర్
చంఢీఘర్: లాయర్లు తనను సంబోధిస్తున్నప్పుడు 'మై లార్డ్', 'యువర్ లార్డ్ షిప్' అనే పదాలను ఉపయోగించరాదని పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ కోరారు. ఈ మేరకు ఆయన సూచించినట్టు చంఢీఘర్‌లోని బార్ అసోసియేషన్ ప్రకటనను విడుదల చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఇటీవలే పంజాబ్ హర్యానా కోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయమూర్తులను 'సర్' అని గానీ, 'యువర్ హానర్' అని గానీ సంబోధించాలని చండీఘర్‌లోని హైకోర్టు బార్ అసోసియేషన్ గతంలో తమ లాయర్లకు సూచించింది. అయితే అనేకమంది న్యాయవాదులు తమ జడ్జీలను యువర్ లార్డ్ షిప్, మై లార్డ్, మిలార్డ్ అంటూ సంబోధిస్తూ వస్తున్నారు. తాజాగా జస్టిస్ మురళీధర్ ఈ సూచన చేయడం విశేషం. ఢిల్లీ అల్లర్ల సమయంలో విచారణ సందర్భంగా పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈ బదిలీ బీజేపీ నేతలను కాపాడేందుకే అనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆయన మాత్రం తన బదిలీని హుందాగా స్వీకరించారు. చదవండి: రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ -
బదిలీపై స్పందించిన జస్టిస్ మురళీధర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరును ప్రశ్నించి రాత్రికి రాత్రే బదిలీ అయిన ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్.మురళీధర్ తన బదిలీపై స్పష్టతనిచ్చారు. బదిలీ విషయం ముందే తెలుసని చెప్పారు. పంజాబ్, హరియణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఢిల్లీలో గురువారం ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, లాయర్లు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్జి మురళీధర్ మాట్లాడారు. ‘సత్యం వైపు నిలవండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. (అర్థరాత్రి విచారణ.. ఆ న్యాయమూర్తి బదిలీ) తన బదిలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందస్తుగానే సమాచారం అందించారని, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతోనే పంజాబ్–హరియాణా కోర్టుకు బదిలీ చేశారని తెలిపారు. ఫిబ్రవరి 26న తన బదిలీ ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకలు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించిన మురళీధర్‌ను కేంద్రం బదిలీ చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!) -
సోనియా వెంట ఉన్నది ‘ఆయన’ కాదు
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ ఎస్. మురళీధర్‌తో కలిసి వచ్చిన సోనియా గాంధీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తోన్న దృశ్యం అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జస్టిస్ మురళీధర్‌కు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని, ఆయన కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీకి సహాయకుడిగా కూడా పనిచేశారంటూ ‘రెండు ఫొటోల’ను కలిపిన ఫొటోను ‘మీడియా మాఫియా’ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. (రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ) ఢిల్లీ అల్లర్లను రెచ్చగొట్టేలా విద్వేషపూరితంగా ప్రసంగించిన బీజేపీ నాయకులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదంటూ ఢిల్లీ పోలీసులను నిలదీసినందుకు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ మురళీధర్‌ను పంజాబ్, హర్యానా కోర్టుకు కేంద్రం బదిలీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే జస్టిస్ మురళీధర్‌పై దుష్ప్రచారం కొనసాగుతోంది. సోనియా గాంధీ 2019, ఏప్రిల్ 11వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఫొటోను పోస్ట్ చేశారు. అప్పుడు ఆ ఫొటోలో సోనియా గాంధీ వెంట ఉన్నది ఆమె న్యాయవాది కేసి కౌశిక్. సోనియా గాంధీ వెంట జస్టిస్ మురళీధర్ వెళ్లే అవకాశమే లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. (ఢిల్లీ అల్లర్లపై నకిలీ ఫొటోలు వైరల్!) -
ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎస్. మురళీధర్‌ను అకస్మాత్తుగా బదిలీ చేసిన తీరుపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. విద్వేషపూరిత ఉపన్యాసంతో అల్లర్లకు కారణమైన బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాపై ఎందుకు కేసు పెట్టరంటూ ఢిల్లీ పోలీసులను నిలదీసినందుకే జస్టిస్ మురళీధర్‌పై వేటు పడిందని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తుండగా, ఆయనను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టు కొలీజియం ఫిబ్రవరి 12వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకే తాము చర్య తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. (రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ) హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ వ్యవహారాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం చేసే సిఫార్సులను అమలు చేయడానికి సరాసరి నాలుగు నెలల వ్యవధి తీసుకునే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ మురళీధర్ విషయంలో 15 రోజుల్లోగా స్పందించడం ఏమిటన్నది రాజకీయ విశ్లేషకుల మెలిక ప్రశ్న. అందులోనూ ఢిల్లీలో శాంతి, భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉండడం ఎంత వరకు సబబనే కీలకమైన వివాదాంశాన్ని విచారిస్తున్న జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడం ఏమిటన్నది రాజకీయ విశ్లేషకుల విశేష ప్రశ్న. (వాచ్మెన్ పారిపోయాడు.. నిప్పు పెట్టారు..) 1987లో హాషింపుర ఊచకోత కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రావిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) శిక్ష విధించినప్పటి నుంచి జస్టిస్ మురళీధర్‌పై బీజేపీ పెద్దలకు ఆగ్రహం ఉందన్నది విశ్లేషకుల ఆరోపణ. ఆ మాటకొస్తే 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు శిక్ష విధించిన జస్టిస్ మురళీధర్‌కు న్యాయవర్గాల్లో నిష్పక్షపాతిగా పేరుంది. అందుకే ఆయన బదిలీపై ఢిల్లీ బార్ అసోసియేషన్ బుధవారం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడానికి 2018, డిసెంబర్లో, 2019, జనవరిలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నేతత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం ముందుకు జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయాలంటూ రెండు సార్లు ప్రతిపాదనలు రాగా కొలీజియం సభ్యులు అడ్డుకున్నారు. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతత్వంలోని కొలీజియం సభ్యులు ఆమోదించారు. రాజ్యాంగబద్ధంగా సుప్రీం కోర్టుకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కేంద్రంలోని ప్రభుత్వానికి లోబడి తీర్పులిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని న్యాయ వర్గాలే చెబుతున్నాయి. (సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ) నాడు ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’ని సమర్థించిన సుప్రీం కోర్టు, వలస పాలన నాటి నుంచి కొనసాగుతున్న ‘దేశ ద్రోహం (సెడిషన్)’ చట్టాన్ని సమర్థించడం, గోవధ చట్టాలను సమర్థించడం, కోహినూరు వజ్రం కంటే ఆవు పేడ ప్రశస్తమైనదని అభివర్ణించడం ఉదాహరణలుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. న్యాయవ్యవస్థ తన ఉనికినే కాపాడుకోలేకపోతే ఎలా అన్నది శేష ప్రశ్న! -
రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ
సాక్షి, న్యూ ఢిల్లీ : రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. (చదవండి: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ) వాస్తవానికి మురళీధర్ బదిలీ గురించి కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 12వ తేదిన సుప్రీంకోర్టు కొలిజీయం ఆయన బదిలీకి ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అప్పటి నుండి ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ దాడులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆయన బుధవారం అర్థరాత్రి తన నివాసంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరును తప్పబట్టారు. ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని కూడా సూచించారు. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. -
ఆ వీడియోలను తొలగించేందుకు ఓకే!
న్యూఢిల్లీ: అమలులో ఉన్న ఏ చట్టాన్నైనా ఉల్లంఘించేలా యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను తొలిగించేందుకు ఆ సంస్థ ఒప్పుకుందని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే వీడియోలను తాము ఉపేక్షించమని యూట్యూబ్ సంస్థ చెప్పినట్లు న్యాయమూర్తి ఎస్.మురళీధర్ పేర్కొన్నారు. ఐటీ మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తామని యూట్యూబ్ తెలిపిందన్నారు. టాటా స్కై తొలగించమని చెప్పిన వీడియో లింకులను తొలగించాలని గతేడాది ఆగస్టు 27న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా అభ్యంతకర వీడియోలకు సంబంధించిన లింకులు తొలగించామని న్యాయస్థానానికి ఈ ఏడాది ఆగస్టు 10న యూట్యూబ్ సంస్థ తెలిపింది.