కొలిజీయం రాకతో దేశంలోని హైకోర్టుల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిసింది.
న్యూఢిల్లీ: నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రద్దయి దాని స్థానంలో తిరిగి కొలీజియం వ్యవస్థ రానున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో ఆయా రాష్ట్రాల్లోని ఖాళీగా ఉన్న ప్రధాన న్యాయమూర్తుల స్థానాలు భర్తీ కానున్నాయి. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు ప్రధాన న్యాయమూర్తులతోపాటు 400మంది ఇతర కోర్టు సిబ్బంది తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ సేకరించిన సమాచారం ద్వారా వెల్లడైంది. గత శుక్రవారం ఎన్ జేఏసీ ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆ తీర్పుతో ఎన్ జేఏసీని రద్దయింది.
దీంతో తిరిగి ఆరు నెలల తర్వాత మరోసారి కొలీజియం వ్యవస్థ అమల్లోకి వస్తుంది. కాగా, కేంద్ర న్యాయశాఖ అక్టోబర్ 1 వరకు దేశంలోని ఆయా రాష్ట్రాల్లోని ఖాళీల వివరాలను సేకరించింది. దాని ప్రకారం మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 24 కోర్టులకు కలిపి 1017మంది న్యాయమూర్తులు అవసరం ఉండగా 611మందితోనే నడుస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బొంబే, పాట్నా, కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, గువాహటి, రాజస్థాన్ కు చెందిన కోర్టులు మాత్రమే ప్రధాన న్యాయమూర్తులతో నడుస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది.