స్టాక్‌హోమ్ సిండ్రోమ్
అవును, అది జరిగిపోయింది. జడ్జీల నియామకానికి కొల్లీజియం వ్యవస్థ అవతరించింది. అది అత్యున్నత న్యాయస్థానంవారి ముద్దుబిడ్డ! ఆవ్యవస్థను విమర్శించాలన్నా, లోపాలు కనిపెట్టాలన్నా అది వృథా ప్రయాస. ఎందుకంటే దానిమీద అప్పీలుచేసుకునే అవకాశం లేదు. సుప్రీంకోర్టుపైన ఏ కోర్టూ లేదు. ఆ వ్యవహారం అంతటితో ఆగిపోవలసిందే! అందుకోసం అందరూ ఆ వ్యవస్థను అంగీకరించవలసిందేనన్నఅభిప్రాయానికి వచ్చినట్లు కనపడుతున్నది.
అది రాజ్యాంగబద్ధంకాదని తెలిసినా చెయ్యగలిగిందేమీలేదు. తప్పదనుకున్నప్పుడు ఒప్పుకుంటే పోతుందిగదా!తప్పులున్నాయనుకుంటే సరిదిద్దుకుని వాడుకోవాలి గాని ఒద్దంటే లాభమేమిటి? చొక్కా చిరిగితే కుట్టుకుని తొడుక్కోవటం లేదూ? కొల్లీజియం విధానంలోపారదర్శకత లేదని విస్మరించలేము. ఆపారదర్శకత ఏవిధంగా సాధించాలో ఆలోచించాలి. అది విజ్ఞులైన పౌరుల లక్షణం.
అందుకే న్యాయశాస్త్రపారంగతులు వివిధమార్గాలను ప్రతిపాదిస్తున్నారు. రాజ్యాంగపరంగా తమకున్న హక్కులను హరించిన కొల్లీజియంను ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అన్నిపార్టీలసహకారంతో తాము అంగీకరించి పంపిన న్యాయాధికారుల నియామక చట్టాన్ని కోర్టువారు తమ అధికారాన్ని గుర్తించలేదన్నసాకుతో కొట్టివేస్తే పార్లమెంటుకూడా సరేనని తల ఊపింది. రాజ్యాంగాన్నికాపాడి అనుసరించవలసిన బాధ్యత ఉన్నవారు ఆ రాజ్యాంగాన్ని విస్మరించి, అధిగమించి అధికారాలను చేజిక్కించుకున్నారంటే అర్థమేమిటి? రాజ్యాంగంఉన్నదెందుకు? ప్రజాస్వామ్యమంటే అర్థమేమిటి? ఐనా అన్నివ్యవస్థలుఅందుకంగీకరించిన వంటే మనం ఇప్పుడు స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ప్రభావంలోఉన్నామా?
అవును, అవి సిండ్రోమ్ ప్రభావ లక్షణాలే! 1973 లో ఇద్దరు సాయుధ దుండగులు స్టాక్‌హోమ్లో ఒక బాంకు ని దోచుకోవటానికి ప్రయత్నించారు. అక్కడున్న రక్షక సిబ్బందిని, పోలీసులను కాల్చివేశారు. నిర్భయంగా డబ్బుని దోచుకుని సంచులలో పెట్టుకున్నారు. అంతలో పోలీసు బలగాలు చేరాయి. దుండగులు డబ్బుని ప్రక్కనపెట్టి ఆత్మరక్షణకు తయారయ్యారు. బాంకు ఉద్యోగులను బందీలుగా పట్టుకుని పోలీసులు తమను కాల్చకుండా కాపాడుకున్నారు.
నలుగురు ఉద్యోగులను పట్టుకుని వారిమీద తుపాకులు గురిపెట్టి, వారిని స్ట్రాంగ్ రూంలోకి నెట్టిద్వారం దగ్గర నిలుచున్నారు. పోలీసులు వారినేమీ చెయ్యగల స్థితిలోలేరు. ఆపరిస్థితి ఆరురోజులు సాగింది. బందీలు ఎక్కడ ఉన్నారో, ఏస్థితిలో ఉన్నారో తెలుసుకోవటానికి పైకప్పులో రంధ్రం చేసి చూడవలసి వచ్చింది. వారంతా ఒకమూల బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. వారిమీదకు తుపాకులు గురిపెట్టి ఉన్నవి. దుండగులను హతమార్చాలన్న విషయం ప్రక్కనపెట్టి బందీలను సురక్షితంగా బయటకు తేవటం ఎలాగన్న సమస్య పోలీసులకు వచ్చింది. వారికి ఆహారాన్ని అందించటానికి దుండగులు ఒప్పుకున్నారు.
ఎదురుగా ఉన్నబందీలతో మాటకలపక తప్పలేదు. దుండగులు ఏక్షణాన్నయినా తమను కాల్చివెయ్యవచ్చునని బందీలకు భయంగానే ఉన్నది. అయినా వారేమీ చెయ్యలేదు. పైగా కబుర్లు చెపుతున్నారు. ఏదో కృతజ్ఞతా భావం తొంగిచూచింది. ఆరవరోజుకి పోలీసుల ప్లాను ఫలించింది. దుండగుల దృష్టి మళ్ళించి వారిమీద దాడిచేసి, ఆయుధాలను వదిలించి అదుపులోకి తీసుకున్నారు.
ఆ సమయంలో బలప్రయోగం తప్పదుగదా! ఆరురోజులపాటు తమ సహనాన్నిపరీక్షించి, తమ సామర్థ్యాన్ని పరిహసించిన వారిమీద పోలీసులకు కసిగానే ఉంటుంది. ఆస్థితిలో బందీలుగా ఉండి విడుదలైనవారు దుండగుల మీద బలప్రయోగం చెయ్యవద్దని పోలీసులను బ్రతిమాలటం మొదలు పెట్టారు. పోలీసులకు అది అర్థం కాలేదు. తమనుబందీలుగా పట్టుకుని భయపెట్టినవారిపైన బందీలకెందుకింత సానుభూతి? మానసిక శాస్త్రజ్ఞలు దానినే "సిండ్రోమ్" అన్నారు. అది స్టాక్‌హోమ్ లో జరిగింది గనుక "స్టాక్‌హోమ్ సిండ్రోమ్" అన్నారు.
ఆవిధమైన సానుభూతి కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనది ఆ పరిస్థితి నుంచి తాము తప్పించుకోలేమన్న నమ్మకం. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ప్రాణాపాయమే జరుగవచ్చు. తరువాత తమను ఏక్షణమైనా నిర్జించగలిగిన దుండగులు తమకు ఏమీ హాని కలిగించకుండా ఉండటం. తమకు కావలసిన కనీస సౌకర్యాలకు లోటులేకుండా చూసుకున్నారు. ఆ కారణంగా వారిమీద సద్భావం కలుగుతుంది. ఆ లక్షణాల సముదాయమే సిండ్రోమ్. ఇప్పుడు మనమంతా ఆవిధమైన లక్షణాలనే ప్రదర్శిస్తున్నామా?
పైన చెప్పినట్లుగా, కొల్లీజియం వ్యవస్థను కాదనలేము. అది అత్యున్నత న్యాయస్థానంనిర్ణయం. అది నీకు నచ్చకపోయినా, దానిలో లోపాలున్నా నీవు చెయ్యగలిగిందేమీలేదు. ఒకవేళ దానిని అధిగమించటం కోసం పార్లమెంటు ఏదైనా చట్టం చేసినా, దానిని కోర్టు కొట్టివెయ్యవచ్చు. న్యాయాధికారుల నియామకం చట్టాన్ని ఆవిధంగానే కొట్టివేశారు - కేవలం న్యాయాధికారుల ఆధిక్యతను నిర్ద్వందంగా ఒప్పుకోవటంలేదని ఆకారణంతో ఏ చట్టాన్నైనా కొట్టివెయ్యవచ్చు.అది రాజ్యాంగ విరుద్ధమని ఎవరైనా అనుకోవచ్చు. కాని దానిని కోర్టు సమర్థించేటంత వరకు అది అనుసరణీయమే అవుతుంది. దానిని అంగీకరించవలసిందే, పాటించవలసిందే!
ఇన్నిఅధికారాలున్న సుప్రీం కోర్టు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్నివిస్మరించిందని అనలేము. కొల్లీజియం నిర్ణయాలు తీసుకునే పద్ధతిని నిర్వచించేఅవకాశం ప్రభుత్వానికే ఇచ్చారు. నిజానికి కొల్లీజియం ని సృష్టించినన్యాయాధికారులకు ఆమాత్రం చేతగాక కాదు. కాని ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండాచేశారన్న నింద రాకుండా ఉండాలని ఆబాధ్యతను ప్రభుత్వానికి అప్పగించారు.ప్రభుత్వం కూడా ఆమాత్రానికే సంతోషించి విధివిధానాలను రూపొందించింది. కానిఅవేవీ కోర్టువారికి నచ్చలేదు. ప్రతిష్ఠంభన ఏర్పడింది.
ఈ ప్రతిష్టంభనకు కారణమేమిటి? ఎవరైనా ఒక అబద్ధం ఆడితే, దానిని కప్పిపుచ్చుకోవటానికి పదిఅబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఒకతప్పు చేస్తే, దానిని సమర్థించుకోవటంకోసం ఇంకా పది తప్పులు చెయ్యవలసి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే ఇప్పుడుజరుగుతున్నది. రాజ్యాంగాన్ని రక్షించి పాటించవలసిన వ్యవస్థ దానిని కాదని అతిక్రమించి, అందులోలేని అధికారాలను తమకుతాముగా ఆపాదించుకోవటం మౌలికమైన తప్పు. జడ్జీలనియామకంలో ప్రభుత్వం తప్పులు చేస్తున్నదని ఆ అధికారాన్ని తాములాక్కున్నారు. కాని వారుకూడా మానవ మాత్రులేగదా! అవే తప్పులు వారుకూడా చేస్తున్నారని బయటపడింది.
దానిని కప్పిపుచ్చి, రాజ్యాంగసమ్మతం కాని వ్యవస్థను రక్షించటానికి న్యాయ శాస్త్రకోవిదులంతా నడుంకట్టారు. కొల్లీజియం నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలన్నారు. నిజమే. కాని ఏవిధంగా ఆపారదర్శకతను సాధించాలి? అనేదానికి రకరకాల సలహాలు చేస్తున్నారు. జడ్జీల ఖాళీలు ప్రకటించి దరఖాస్తులు స్వీకరించి పారదర్శకంగా ఎన్నుకుని ప్రకటించాలని కొందరు సూచించారు. అంటే న్యాయాధికారులనుగూడా ప్రభుత్వాధికారుల స్థాయికి దించారన్నమాట!
అలాకాక కొల్లీజియం లో జరిగే సంప్రతింపులు, తర్జనభర్జనలు బహిరంగం చెయ్యాలన్నారు కొందరు. దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన వ్యవస్థ ఏదీ ప్రస్తుతం కోర్టు అధీనంలో లేదుగనుక, అటువంటి కార్యదర్శక వ్యవస్థను స్థాపించి కోర్టు అధీనంలో పెట్టాలని కొందరు సూచించారు. అందులో విశ్రాంత న్యాయాధికారులే ఉండాలని కొందరు సూచించారు. ఏమిటీ సూచనలు? ఎందుకు చేస్తున్నారు? ఎక్కడికి పోతున్నాం మనం? రాజ్యాంగబద్ధం కాని ఒకవ్యవస్థను పటిష్ఠం చెయ్యటం కోసం విజ్ఞులు, న్యాయశాస్త్రవేత్తలు ఈవిధంగా పోటీపడటమేమిటి?పారదర్శకంగా ఉన్నంత మాత్రాన ఏదైనాతప్పు ఒప్పవుతుందా?
1974లో స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ప్రభావం చూపే సంఘటన మరొకటి జరిగింది. నిజానికి ఈ సిండ్రోమ్ కి ఎక్కువ ప్రచారం వచ్చింది ఈసంఘటన కారణంగానే! కాలిఫోర్నియా లోపత్రికారంగానికి అధికారులైన కుటుంబానికి వారసురాలైన ఒక అమ్మాయిని -సింబయోనియన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక ఉగ్రవాద సంస్థ అపహరించుకు పోయింది. బందీగా ఉన్న ఆ అమ్మాయికి కావలసిన అన్ని సౌకర్యాలూ అమర్చారు. తోడుగా ఉండటానికి సమవయస్కుడైన ఒక యువకుడి గూడా ఇచ్చారు.
దానికి తోడు తమ ఆదర్శాలను వివరించారు. తాము దుండగులం కాదనీ, బీదలకోసం దోపిడీలు చేసి పంచి పెడుతున్నామని వివరించారు. అందుకు ఉదాహరణగా పత్రికాధిపతులను ప్రతిదినము బీదలకు అన్నదానం చెయ్యవలసిందిగా ఆదేశించటాన్ని చూపించారు. ఆ అమ్మాయికి వారిపట్ల సానుభూతి కలిగింది. తరువాత జరిగిన దోపిడీలలో ఆమె కూడా పాలుపంచుకున్నది. అది చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆతరువాత జరిగిన ఒక దోపిడిలో వారిని పట్టుకున్నారు. ఆ అమ్మాయిని కుటుంబానికి అప్పగించారు. అయినా ఆమె తనను అపహరించినవారినే ఆదర్శం గా వాదించేది. కాని కొన్నాళ్ళకు ఆపద్ధతిలోని దుష్ప్రభావాలను గుర్తించి విమర్శించటం మొదలు పెట్టింది. అంటే సిండ్రోమ్ ప్రభావం నుంచి బయటపడిందన్న మాట! ఆవిధంగా బయటపడటం సంభవమేనని సూచించింది.
ఒక దుశ్చర్య చేసినవారు తమను సానుభూతితో చూచినంత మాత్రాన ఆ దుశ్చర్యను సమర్థించవలసిన అవసరం లేదని గ్రహించటం సంభవమేనని అవగాహన అయింది. దాదాపు ఇరవైఏళ్ళుపైగా కొల్లీజియం వ్యవస్థ అమలులో ఉన్నది. దానికి అందరూ అలవాటుపడి పోయారు. అది రాజ్యాంగబద్ధమైన విధానం కాదన్న విషయం మరచిపోయారు. కొల్లీజియం లో సభ్యుడైన ఒక న్యాయమూర్తి అందులోని లోపాలను ఎత్తిచూపిన తరువాతగూడా, అందులోని మౌలిక లోపాన్ని గురించి ఆలోచించకుండా దానిని ఏవిధంగా సమర్థించాలనే ఆలోచిస్తున్నారు. అలాకాక, మౌలికలోపాన్ని గుర్తించి, సవరించటానికి ఇది మంచి అవకాశంగా భావించి తగిన చర్యలు తీసుకోవటం అవసరం.
అది అత్యున్నతన్యాయస్థాన నిర్ణయం గనుక సవరించేదారిలేదని సందేహించవలసిన అవసరంలేదు. విశ్రాంత న్యాయమూర్తి కె.టి.థామస్ వంటి వారు దారి చూపించారు. జడ్జీలనియామకానికి ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టివెయ్యటం సమంజసం కాదని, ఆనిర్ణయాన్ని సుప్రీం కోర్టు తిరిగి పరిశీలించి సరిదిద్దవచ్చునని సూచించారు. కోర్టువారు అది ప్రతిష్ఠాభంగం అనుకోకుండా ఆసలహాను పాటించి ఈ ప్రతిష్ఠంభన నుంచి, రాజ్యాంగబద్ధం కాని పరిస్థితినుంచి దేశాన్నిరక్షించగలరని ఆశించవచ్చు. ప్రభుత్వము, పార్లమెంటు కూడా తమ రాజ్యాంగబద్ధమైనబాధ్యతలను, అధికారాలను విస్మరించకుండా, సక్రమంగా పాటించటం అవసరం.
జాస్తి జవహర్లాల్