కొలీజియం’ వ్యవస్థ విఫలం!
ప్రఖ్యాత న్యాయకోవిదుల అభిప్రాయం
సమూల మార్పులు అవసరం
ప్రభుత్వంతో భేటీలో స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం సహా.. న్యాయవ్యవస్థలో పలు సంస్కరణలకు తెరతీసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం ప్రఖ్యాత రాజ్యాంగ, న్యాయ కోవిదులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసులు చేసే ‘కొలీజియం’ వ్యవస్థ విఫలమైందని, జడ్జీలను జడ్జీలే నియమించే ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని భేటీలో పాల్గొన్న న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారని భేటీ అనంతరం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వెల్లడించారు. ‘కొలీజియం వ్యవస్థ ఉండాలా? వద్దా? అనే అంశంపై వారు తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ ఇంకా చర్చ ముగియలేదు. ఎలాంటి మార్పులు అవసరం? న్యాయమూర్తుల నియామక వ్యవస్థ నిర్మాణం ఎలా ఉండాలి?.. అనే విషయాలపై చర్చ కొనసాగించాల్సి ఉంది’ అన్నారు. ‘ఈ వ్యవస్థను మెరుగుపర్చాలనే విషయంలో, జడ్జీల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది’ అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
‘కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందా?’ అన్న ప్రశ్నకు.. ఆ విషయాన్ని బహిరంగపరచడం సరికాదని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం అహ్మదీ, జస్టిస్ వీఎన్ ఖరే.. లా కమిషన్ చైర్మన్ ఏపీ షా, మాజీ అటార్నీ జనరల్ కే పరాశరన్, ప్రఖ్యాత న్యాయవాదులు సొలీ సొరాబ్జీ, ఫాలీ నారిమన్, కేటీఎస్ తులసి, కేకే వేణుగోపాల్, ప్రభుత్వం తరఫున న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు.. మూడున్నర గంటలపాటు జరిగిన సమాలోచనల్లో పాలు పంచుకున్నారు.
న్యాయవ్యవస్థదే పై చేయి ఉండాలి
సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ ఉండకూడదని దాదాపు భేటీలో పాల్గొన్న న్యాయ నిపుణులంతా తేల్చిచెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్(జేఏసీ)లోనూ న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉండాలని, ప్రభుత్వ ప్రతినిధిగా న్యాయ మంత్రి ఉంటే సరిపోతుందన్నారు. అలాగే, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో మార్పు ఉండకూడదని ఫాలి నారిమన్, సొలి సొరాబ్జీ హెచ్చరించారు. ‘న్యాయప్రమాణాలు, జవాబుదారీతనం బిల్లు’ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ ఎక్కువ సమయం కొలీజియంపైనే చర్చ జరిగింది. ‘కొలీజియం’ స్థానంలో జేఏసీ’ను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. జేఏసీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తామని ఇటీవలే రవిశంకర్ ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే.