
రాధాకృష్ణ కృపాసాగర్, శ్యాంసుందర్, వెంకటరమణ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్‌లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది.
ఏడుగురు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు.
వీరిలో రవీంద్రబాబు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, రాధాకృష్ణ కృపాసాగర్ కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, శ్యాంసుందర్ విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, శ్రీనివాస్ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా, చక్రవర్తి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా, మల్లికార్జునరావు నూజివీడు 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా, వెంకటరమణ హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ ఏడుగురితోపాటు ఇప్పటికే కేంద్రానికి చేరిన న్యాయవాది ఎస్.ఎం.సుభాని పేరుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుతుంది. హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 24 మంది ఉన్నారు. తాజా నియామకాలు పూర్తయితే ఇంకా ఐదుపోస్టులు ఖాళీగా ఉంటాయి. త్వరలో కొన్ని ఖాళీలను భర్తీచేసేందుకు హైకోర్టు చర్యలు తీసుకోనుంది. ఆశావహులు తమ బయోడేటాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.
అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు
1962 జూన్ 20న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాళెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి రాఘవరావు, తల్లి సీతారావమ్మ. 1988లో న్యాయవాదిగా ఎల్‌రోల్ అయ్యారు. చీరాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994 మే 5న మునిసిఫ్ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పనిచేశారు. 2021 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా కొనసాగుతున్నారు.
బండారు శ్యాంసుందర్
1962 సెప్టెంబర్ 1న అనంతపురంలో జన్మించారు. తండ్రి బండారు సుబ్రహ్మణ్యం, తల్లి సుబ్బలక్ష్మి. తాత బండారు రంగనాథం ప్రముఖ క్రిమినల్ న్యాయవాది. 1986లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి అదే ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఐదేళ్లపాటు అనంతపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1991లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. న్యాయాధికారిగా 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఊటుకూరు శ్రీనివాస్
కృష్ణాజిల్లా తిరువూరు గ్రామంలో జన్మించారు. తండ్రి లక్ష్మణరావు, తల్లి లీలావతి. భార్య లక్ష్మీప్రసన్న. మచిలీపట్నం డీఎస్‌ఆర్ హిందూ న్యాయకళాశాలలో న్యాయవిద్య పూర్తిచేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు.
బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి
1964 ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా కందులపాళెం గ్రామంలో జన్మించారు. తండ్రి డాక్టర్ బి.పాపారాయచౌదరి, తల్లి విజయలక్ష్మి. 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు జడ్జిగా వ్యవహరించారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా వ్యవహరించారు. 2019లో విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా కొనసాగుతున్నారు.
తల్లాప్రగడ మల్లికార్జునరావు
1964 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా పుల్లేటికుర్రులో జన్మించారు. తండ్రి శ్రీరామచంద్రమూర్తి. తల్లి రమణ. 10వ తరగతి వరకు నేదునూరులో విద్యాభ్యాసం కొనసాగించారు. అమలాపురంలో బీఎస్‌సీ పూర్తిచేశారు. రాజమండ్రిలోని జి.ఎస్.కె.ఎం.లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1988–1994 వరకు అమలాపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
సీనియర్ న్యాయవాది పారెపు శ్రీరామచంద్రమూర్తి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నూజివీడు అదనపు జిల్లా, సెషన్స్‌జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
డా. వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్
1963లో జన్మించారు. తండ్రి వి.బి.కె.విఠల్, తల్లి పుష్పవతి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకాం, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. ఏడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు. ఐదేళ్ల పాటు లెక్చరర్‌గా వ్యవహరించారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. రాజమండ్రి, పెద్దాపురం, ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు.
2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టు న్యాయసేవాధికార సంస్థగా పనిచేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సతీమణి వి.ఎ.ఎల్.సత్యవతి కర్నూలు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు.
దుప్పల వెంకటరమణ
1963 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా చినబోడేపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి అప్పన్న, తల్లి వరహాలమ్మ. తండ్రి రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలోనే కన్నుమూశారు. అన్న పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రాథమిక విద్యాభ్యాసం బోడేపల్లి, తోటాడ గ్రామాల్లో పూర్తిచేశారు. విశాఖపట్నం ఎన్.వి.పి.లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది పలు ప్రాంతాల్లో బాధ్యతలు నిర్తరించారు. టీటీడీ లా ఆఫీసర్‌గా వ్యవహరించారు. 2017–19 వరకు న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చదవండి: ఇవేం రాతలు, ఇవేం కూతలు?
Comments
Please login to add a commentAdd a comment