‘జ్యుడీషియల్ కమిషన్’పై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకానికి సిఫారసులు చేసే ప్రస్తుత వ్యవస్థ ‘కొలీజియం’ స్థానంలో ‘జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్(జేఏసీ)’ను ఏర్పాటు చేసే బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ జేఏసీ నిర్మాణం, విధివిధానాలపై న్యాయనిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే. జేఏసీ నిర్మాణంపై వారి నుంచి ప్రభుత్వానికి రెండు రకాల అభిప్రాయాలు వచ్చాయి. కమిషన్ అధ్యక్షుడు, సభ్యులకు కచ్చితమైన పదవీకాలం ఉండేలా ఒక శాశ్వతమైన స్థిరవ్యవస్థలా జేఏసీ ఉండాలన్నది ఒక అభిప్రాయం కాగా.. యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఎక్స్ అఫీషియో’ యంత్రాంగంలా ఉండాలన్నది మరో వాదన. ఎక్స్ అఫీషియో విధానంలో..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చైర్మన్‌గా, ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు, ఇద్దరు ప్రముఖ న్యాయనిపుణులు, కేంద్ర న్యాయమంత్రి సభ్యులుగా ఉంటారు. వారు ఆ పదవుల్లో ఉన్నంతకాలం మాత్రమే కమిషన్‌లో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వారికి ఉంటుంది. ఈ రెండు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం.
‘లోక్‌పాల్’ నిబంధనల్లో సవరణలకు కమిటీ
లోక్‌పాల్ సెర్చ్ ప్యానల్ నిబంధనల్లో సవరణలు చేయడానికి అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ నేతృత్వంలోకమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.సవరణలు చేర్చిన తర్వాతే లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టనుందని అధికారులు చెప్పారు. కాగా, బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై విపక్షాలతో చర్చించి, మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. హైజాకింగ్ నిరోధకచట్ట సవరణ బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెట్టేందకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఎక్స్ అఫీషియోనా?.. శాశ్వత వ్యవస్థా?
Published Mon, Aug 4 2014 1:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement