సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మే 19, 2023న జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఏపీ హైకోర్టు సీజే పదవి భర్తీచేయాల్సి వచ్చిందని కొలీజియం పేర్కొంది. అన్ని అంశాలు పరిగణించి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఠాకూర్‌ను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో.. జస్టిస్ ఠాకూర్‌ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న ఫిబ్రవరి 9, 2023 నాటి సిఫార్సును రద్దుచేస్తూ తాజా సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం పేర్కొంది.
ఠాకూర్ స్వస్థలం జమ్మూకశ్మీర్..
ఇక జస్టిస్ ఠాకూర్ ప్రస్తుతం బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆయన ఏప్రిల్ 25, 1964న జన్మించారు. జమ్మూ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందిన ఆయన.. 1989 అక్టోబరు 18న ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. 2011లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అనంతరం.. మార్చి 8, 2013న జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆ తర్వాత జూన్ 10, 2022న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక సుప్రీంకోర్టు తాజా సిఫార్సుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.
చదవండి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ భూయాన్, జస్టిస్ ఎస్‌వీ భట్టి
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరధే
ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధేను నియమించాలంటూ కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు కొల్లీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ నియామకం చేపట్టాల్సి వచ్చినట్లు కొలిజియం పేర్కొంది. ఇక జస్టిస్ అలోక్ అరధే ఏప్రిల్ 13, 1964న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆయన 1988లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. డిసెంబరు 29, 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఫిబ్రవరి 15, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సెప్టెంబరు 20, 2016న జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 11, 2018న జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం.. జస్టిస్ అరధే నవంబరు 17, 2018న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జులై 3, 2022 నుంచి అక్టోబరు 14 వరకూ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సివిల్ కాన్‌స్టిట్యూషనల్ అంశాల్లో నిష్ణాతుడిగా ఆయన పేరుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment