Chief Justices of High Courts
-
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మే 19, 2023న జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఏపీ హైకోర్టు సీజే పదవి భర్తీచేయాల్సి వచ్చిందని కొలీజియం పేర్కొంది. అన్ని అంశాలు పరిగణించి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఠాకూర్‌ను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో.. జస్టిస్ ఠాకూర్‌ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న ఫిబ్రవరి 9, 2023 నాటి సిఫార్సును రద్దుచేస్తూ తాజా సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం పేర్కొంది. ఠాకూర్ స్వస్థలం జమ్మూకశ్మీర్.. ఇక జస్టిస్ ఠాకూర్ ప్రస్తుతం బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆయన ఏప్రిల్ 25, 1964న జన్మించారు. జమ్మూ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ పొందిన ఆయన.. 1989 అక్టోబరు 18న ఢిల్లీ బార్ కౌన్సిల్లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. 2011లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అనంతరం.. మార్చి 8, 2013న జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆ తర్వాత జూన్ 10, 2022న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక సుప్రీంకోర్టు తాజా సిఫార్సుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. చదవండి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్టి తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరధే ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధేను నియమించాలంటూ కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు కొల్లీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ నియామకం చేపట్టాల్సి వచ్చినట్లు కొలిజియం పేర్కొంది. ఇక జస్టిస్ అలోక్ అరధే ఏప్రిల్ 13, 1964న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేసిన ఆయన 1988లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. డిసెంబరు 29, 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 15, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సెప్టెంబరు 20, 2016న జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 11, 2018న జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం.. జస్టిస్ అరధే నవంబరు 17, 2018న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జులై 3, 2022 నుంచి అక్టోబరు 14 వరకూ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సివిల్ కాన్స్టిట్యూషనల్ అంశాల్లో నిష్ణాతుడిగా ఆయన పేరుపొందారు. -
నాలుగు హైకోర్టులకు సీజేలు
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తు(సీజే)లు నియమితులయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. గుజరాత్ హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సోనియా గిరిధర్ గోకానీని అదే హైకోర్టు సీజేగా నియమించారు. అదేవిధంగా, ఒరిస్సా హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి జస్టిస్ జస్వంత్ సింగ్ త్రిపుర హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఈయన ఈ నెల 22న రిటైర్ కానున్నారు. ఇంతకుముందు జస్టిస్ సింగ్‌ను ఒరిస్సా హైకోర్టు సీజేగా నియమించాలంటూ చేసిన సిఫారసును కొలీజియం ఆతర్వాత ఉపసంహరించుకుంది. రాజస్తాన్ హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్ సందీప్ మెహతాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ జమ్మూకశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తాజా నియామకాలను న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం ట్విట్టర్లో ప్రకటించారు. కాగా, జస్టిస్ గోకానీ బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. గుజరాత్ జ్యుడిషియల్ సర్వీస్ నుంచి వచ్చిన ఈమెకు 62 ఏళ్లు నిండటంతో ఫిబ్రవరి 25న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సబీనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్నారు. గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ గోకానీని తక్షణమే నియమించాలంటూ గత వారం కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. -
ఆరేళ్ల తర్వాత అరుదైన సమావేశం
న్యూఢిల్లీ: దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఈ నెల 30న జరగనుంది. సత్వర న్యాయాన్నందించడం, వివాదాల పరిష్కారం, న్యాయవ్యవస్థలో ఖాళీలు పెరగడం తదితర అంశాలు సమావేశంలో చర్చిస్తారు. 2016 ఏప్రిల్ 24న చివరిసారి ఈ సమావేశం జరిగింది. తాజా సమావేశాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఇందులో సీజేఐ, న్యాయమంత్రి పాల్గొనే అవకాశముంది. సమావేశంలో పలు వర్కింగ్ సెషన్లు జరుగుతాయి. నిజానికి ఇలాంటి సమావేశాలను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించాల్సిఉంది. చదవండి: (ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు: యూజీసీ అనుమతి) -
హైకోర్టుల జడ్జీల బదిలీలేవీ?
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు బదిలీ అయిన జడ్జీలను అవే హైకోర్టుల్లో కొనసాగించడం సందేహపూరిత ఊహాగానాలకు తావిస్తోంది. కొలీజియం సిఫారసులపై కాలయాపన చేయకుండా పునఃపరిశీలనకు పంపి ఉండాల్సింది. ఏమైనా ఇబ్బందులున్న పక్షంలో తిప్పి పంపితే మేము పరిశీలిస్తాం. అలాకాకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో అర్థం లేదు. – సుప్రీం ధర్మాసనం న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలదీసింది. కొలీజియం సిఫారసులు చేసినప్పటికీ బదిలీ చేయకపోవడంపై రెండువారాల్లోగా సవివరమైన కారణాలతో స్థాయి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన జడ్జీలను అవే హైకోర్టుల్లో కొనసాగించడం సందేహపూరిత ఊహాగానాలకు తావిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. కొలీజియం సిఫారసులపై కాలయాపన చేయకుండా పునఃపరి శీలనకు పంపి ఉండాల్సిందని సూచించింది. ఏమైనా ఇబ్బందులున్న పక్షంలో తిప్పి పంపితే తాము పరిశీలిస్తామని, అలాకాకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో అర్థం లేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఏజీ ముకుల్ రోహత్గీకి స్పష్టం చేసింది. జస్టిస్ ఠాకూర్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఉన్నత న్యాయస్థానాలకు జడ్జీల నియామకంపై ఆయన క్రమం తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై కొంతకాలంగా కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కాగా 37 మంది న్యాయమూర్తుల పేర్లను ప్రభుత్వానికి కొలీజియం తిప్పిపంపిందని, అవి పరిశీలనలో ఉన్నాయని ఏజీ తెలిపారు. మరి జడ్జీల బదిలీల సంగతేమిటని న్యాయమూర్తులు ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. 10 నెలలుగా ఈ అంశం పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. అయితే బదిలీలకు సంబంధించిన సమాచారం తన వద్ద లేదని, పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు మూడు వారాల సమయం ఇవ్వాలని రోహత్గీ కోరారు. అందుకు నిరాకరించిన బెంచ్ రెండు వారాల్లోనే పూర్తి వివరాలతో నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది.