హైకోర్టుల జడ్జీల బదిలీలేవీ?
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
బదిలీ అయిన జడ్జీలను అవే హైకోర్టుల్లో కొనసాగించడం సందేహపూరిత ఊహాగానాలకు తావిస్తోంది. కొలీజియం సిఫారసులపై కాలయాపన చేయకుండా పునఃపరిశీలనకు పంపి ఉండాల్సింది. ఏమైనా ఇబ్బందులున్న పక్షంలో తిప్పి పంపితే మేము పరిశీలిస్తాం. అలాకాకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో అర్థం లేదు. – సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలదీసింది. కొలీజియం సిఫారసులు చేసినప్పటికీ బదిలీ చేయకపోవడంపై రెండువారాల్లోగా సవివరమైన కారణాలతో స్థాయి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన జడ్జీలను అవే హైకోర్టుల్లో కొనసాగించడం సందేహపూరిత ఊహాగానాలకు తావిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. కొలీజియం సిఫారసులపై కాలయాపన చేయకుండా పునఃపరి శీలనకు పంపి ఉండాల్సిందని సూచించింది. ఏమైనా ఇబ్బందులున్న పక్షంలో తిప్పి పంపితే తాము పరిశీలిస్తామని, అలాకాకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో అర్థం లేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఏజీ ముకుల్ రోహత్గీకి స్పష్టం చేసింది.
జస్టిస్ ఠాకూర్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఉన్నత న్యాయస్థానాలకు జడ్జీల నియామకంపై ఆయన క్రమం తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై కొంతకాలంగా కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కాగా 37 మంది న్యాయమూర్తుల పేర్లను ప్రభుత్వానికి కొలీజియం తిప్పిపంపిందని, అవి పరిశీలనలో ఉన్నాయని ఏజీ తెలిపారు. మరి జడ్జీల బదిలీల సంగతేమిటని న్యాయమూర్తులు ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. 10 నెలలుగా ఈ అంశం పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. అయితే బదిలీలకు సంబంధించిన సమాచారం తన వద్ద లేదని, పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు మూడు వారాల సమయం ఇవ్వాలని రోహత్గీ కోరారు. అందుకు నిరాకరించిన బెంచ్ రెండు వారాల్లోనే పూర్తి వివరాలతో నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది.