న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అఖిల్ ఖురేషిని నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. గుజరాత్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న అఖిల్ ఖురేషి పదోన్నతి విషయమై కొలీజియం మే 10న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయంపై మంగళవారం స్పందించిన కేంద్రం..కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ల సంఘం బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అఖిల్ ఖురేషి నియామకాన్ని అడ్డుకుంటోందని పిటిషన్‌లో న్యాయవాదులు ఆరోపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ విషయంలో కేంద్రం, కొలీజియం మధ్య చర్చలు జరిగిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపింది.
కాగా నిబంధనల ప్రకారం కొలీజియం రెండోసారి గనుక అఖిల్ ఖురేషి పేరును ప్రతిపాదించినట్లైతే కేంద్రం తప్పనిసరిగా ఆయన నియామకాన్ని ఆమోదించాల్సిందే. ఇక గతేడాది ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పదోన్నతి విషయమై కేంద్రం, కొలీజియంల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిగా జోసెఫ్ పేరును కొలీజియం ప్రతిపాదించిగా.. కేరళ నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో తగిన ప్రాతినిథ్యం ఉన్నందు వల్ల ఆయన పేరును పునఃసమీక్షించాలని కేంద్రం కోరింది. అయితే మరోసారి కొలీజియం ఆయన పేరునే సిఫారసు చేసింది. ఈ క్రమంలో ఇందుకు అంగీకరించిన కేంద్రం మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే కేంద్రం కావాలనే జోసెఫ్ సీనియారిటీని తగ్గించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సీనియారిటీ ఆధారంగానే అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టే అవకాశం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment