ఆ ఆరోపణలను న్యాయమూర్తులు ఖండించలేదు | Retired Judge Justice Reddappa Reddy Interview With Sakshi | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణలను న్యాయమూర్తులు ఖండించలేదు

Published Sat, Oct 17 2020 4:12 AM | Last Updated on Sat, Oct 17 2020 5:19 AM

Retired Judge Justice Reddappa Reddy Interview With Sakshi

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణపై సీఎం వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేయడంలో గానీ, ఆ ఫిర్యాదును బహిర్గతం చేయడంలో గానీ ఎంత మాత్రం తప్పులేదని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రెడ్డప్ప రెడ్డి అన్నారు. ‘న్యాయపరంగా మాట్లాడాలంటే ఆ ఆరోపణలు వాస్తవమని భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను వారు ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండనతో వస్తే, అప్పుడు ముఖ్యమంత్రి తగిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి రాలేదు’ అన్నారు.  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన “సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 
 
ఏ రకంగా తప్పవుతుంది? 
సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఫిర్యాదు ఇచ్చింది సాధారణ వ్యక్తేమీ కాదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి ఉన్నరాన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఫిర్యాదు ఏంటి? ఆ ఫిర్యాదును బలపరిచేలా ఆధారాలున్నాయా? అన్నదే ముఖ్యం. న్యాయమూర్తులపై ఓ ముఖ్యమంత్రి కేంద్రానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం అన్నది ఇదే మొదటిసారి కాదు. నేను 1961లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యాను. అప్పుడు జస్టిస్‌ చంద్రారెడ్డి ప్రధాన న్యాయమూర్తి. ఆయనపై దామోదరం సంజీవయ్య 9 పేజీల ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదులో చాలా ఆరోపణలు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అంతిమంగా అది జస్టిస్‌ చంద్రారెడ్డి బదిలీకి దారి తీసింది. జస్టిస్‌ చంద్రారెడ్డి మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాబట్టి సీజేఐకు లేఖ రాయడంలో తప్పేమీ లేదు.   
 
బహిర్గతం చేయడం తప్పేమీ కాదు  
లేఖ రాసినప్పుడు దానిని బహిర్గతం చేయడం కూడా తప్పు కాదు. ముఖ్యమంత్రి లేఖ రాశారు.. దానిని ప్రభుత్వ ప్రతినిధిగా అజయ్‌ కల్లం ప్రెస్‌కు రిలీజ్‌ చేశారు. ఇందులో తప్పు ఎంత మాత్రం లేదు. సుప్రీంకోర్టుకు గానీ, సుప్రీంకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి గానీ, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు గానీ సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు.  
 
ప్రధాన మంత్రి సుమోటోగా స్పందించవచ్చు 
ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులెవ్వరూ కూడా సీజేకు సబార్డినేట్స్‌ కారు. ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదుగురితో కమిటీ వేయొచ్చు. వారి నుంచి ఓ నివేదిక కోరవచ్చు. ముఖ్యమంత్రి ఇక్కడ ప్రధాన మంత్రికి లేఖ రాయలేదు. రాష్ట్రపతికి కూడా రాయలేదు. న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉన్నప్పటికీ, ఆయన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేరు. అయితే ప్రధాన మంత్రి మాత్రం సుమోటోగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవచ్చు. విచారణ జరిపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వివరణ కూడా కోరవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement